న్యూఢిల్లీ: భారత్ స్వాతంత్య్రం వచ్చాక అనేక సవాళ్లను ఎదుర్కొని ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగింది. ప్రస్తుతం 3.17 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూనైటెడ్ కింగ్‌డమ్ తరువాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌దే. గత 75 ఏళ్లలో భారత్ అనేక ఆర్థిక మార్పులు తీసుకొచ్చింది. అభివృద్ధి చెందిన దేశాలకు సమానంగా ఆ మార్పులు తెచ్చింది. పారిశ్రామిక పునరుజ్జీవన కాలంలో బ్రిటిష్ పాలనలో భారత్ ఆర్థిక దోపిడికి గురికావడంతో భారత ప్రజల జీవన ప్రమాణం దేశవ్యాప్తంగా పడిపోయింది.
భారత స్వాతంత్య్రం ఆర్థిక చరిత్రలో ఓ కీలక మలుపనే చెప్పాలి. అయితే నాటి నుంచి ఈనాటి వరకు పయనం సునాయాసంగా ఏమి జరగలేదు. 1981,1991లో ఆర్థిక సంక్షోభం, 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం, డిమానిటైజేషన్, తదితరాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కొవిడ్19 మహమ్మారి, రష్యాఉక్రెయిన్ యుద్ధం వంటివి కూడా మనం చూశాము. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇటీవల భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి 8 నుంచి 8.5శాతం మేరకు పెరగొచ్చని 2021-22 ఆర్థిక సర్వే ప్రొజెక్ట్ చేసింది. భారత తలసరి ఆదాయం సైతం స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి 500 రెట్లు పెరిగింది. భారత్ తొలిసారి 2020 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం భారత్‌లో ధరలు ప్రతిదానిపై పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భవిష్యత్తులో పేదల బతుకులు ఇలా ఉంటాయని ఊహించడం కూడా కష్టమే.