న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో భారత్ మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నది. ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ సేన మొత్తం 115 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నాలుగు పాయింట్ల తేడాతో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది.
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ మూడవ స్థానంలో ఉంది. ఆ జట్టుకు 106 పాయింట్లు ఉన్నాయి. టి20ల్లో ఎప్పటి నుంచో నంబర్ వన్ గా ఉన్న భారత్.. ఈ ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్ లను మట్టికరిపించి వన్డేల్లోనూ టాప్ ర్యాంక్ కు చేరుకుంది.
ఇక తాజాగా టెస్టుల్లో కూడా నెం.1 గా అవతరించింది. ఇక ఇండియన్ స్పిన్ ద్వయం అశ్విన్, జడేజాలు కూడా టెస్టుల్లో తమ ర్యాంక్‌లను మరింత మెరుగుపరుచుకున్నారు. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఈ ఇద్దరూ దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఇక ఇండియన్ క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలోనూ ఇప్పుడు నెంబర్ వన్‌గా ఉంది. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తొలి ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అతనికి 21 రేటింగ్ పాయింట్ల దూరంలో అశ్విన్ ఉన్నాడు. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ 8వ స్థానంలో ఉన్నాడు.