Thursday, January 23, 2025

ర్యాంకింగ్స్‌లో మనోళ్ల హవా

- Advertisement -
- Advertisement -

ర్యాంకింగ్స్‌లో మనోళ్ల హవా
నంబర్‌వన్‌గా సిరాజ్, అశ్విన్, సూర్య
మూడు ఫార్మాట్‌లలోనూ టీమిండియాదే అగ్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా నడుస్తోంది. భారత పురుషుల జట్టు టెస్టులు, వన్డే, టి20 ఫార్మాట్‌లలో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ఇక టెస్టు బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. టెస్టుల్లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా కొనసాగుతున్నాడు. అశ్విన్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. సూర్యకుమార్ 889 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. పాకిస్థాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్ 811 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. టి20 ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్య రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. టి20 టీమ్ విభాగంలో భారత జట్టు నంబర్‌గా కొనసాగుతోంది.

టీమిండియా 264 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. వన్డే ఫార్మాట్‌లో కూడా భారత్ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించడంతో టీమిండియా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను రెండో స్థానానికి నెట్టి భారత్ మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. టెస్టుల్లో కూడా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం టీమిండియా 118 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఆస్ట్రేలియా రెండో ర్యాంక్‌లో నిలిచింది. ఇక టెస్టు బౌలింగ్ విభాగంలో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 879 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ విభాగంలో మరో స్టార్ జడేజా నంబర్‌వన్‌గా నిలిచాడు. 455 పాయింట్లతో జడేజా టాప్ ర్యాంక్‌లో నిలిచాడు.

నంబర్‌వన్‌గా సిరాజ్..
మరోవైపు బౌలింగ్ విభాగంలో హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో సిరాజ్ 694 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో గిల్ అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే. దీంతో గిల్ నంబర్‌వన్ ర్యాంక్‌కు మరింత చేరువయ్యాడు. మిగిలిన రెండు వన్డేల్లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిస్తే గిల్ వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ వన్డే బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News