జోహెన్నస్‌బర్గ్: ప్రపంచ టెస్టు క్రికెట్‌లో టీమిండియానే అత్యుత్తమ జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదని దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ చాలా బలమైన జట్టుగా ఎదిగిందన్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా టీమిండియా ఎదిగిందన్నాడు. దీనికి విదేశీ సిరీస్‌లలో భారత్ సాధించిన చారిత్రక విజయాలే నిదర్శనమన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై భారత్ అద్భుత ప్రదర్శన చేసిందన్నాడు. ఈ రెండు జట్లను వారి సొంత గడ్డపై ఓడించడం అంత సులువుకాదన్నాడు. అయితే, టీమిండియా మాత్రం దీన్ని ఆచరణలో చేసి చూపించిందని మోర్కెల్ ప్రశంసించాడు.రానున్న రోజుల్లో భారత్ టెస్టుల్లో మరింత బలమైన జట్టుగా ఎదగడం ఖాయమన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా ఉందన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదన్నాడు.
అందుకే ఇంటాబయటా అనే తేడా లేకుండా టీమిండియా వరుస విజయాలు సాధిస్తుందన్నాడు. మరోవైపు సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో విజయం భారత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నాడు. సిరీస్‌లో టీమిండియాకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయన్నాడు. ఒకప్పుడూ విదేశీ సిరీస్‌లు అంటేనే భారత్ ముందే డీలా పడిపోయేదన్నాడు. కానీ కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నాడు. విదేశీ గడ్డపై సయితం టీమిండియా అసాధారణ విజయాలు సొంతం చేసుకుంటుందన్నాడు. ఒకప్పుడూ వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లే విదేశీ గడ్డపై నిలకడైన విజయాలు సాధించేవన్నాడు. ప్రస్తుతం టీమిండియా వారి స్థానాన్ని అక్రమించిందని మోర్కెల్ పేర్కొన్నాడు.
India best Test Cricket Team in World: Morne Morkel