బిజెపి అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలు
ముంబై: రానున్న లోక్‌సభ ఎన్నికలు వారసత్వ రాజకీయాలు, అవినీతి ఒక వైపు, అభివృద్ధి మరో వైపు మధ్య జరుగుతున్న సంగ్రామమని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అభివర్ణించారు. ముంబై పశ్చిమ శివార్లలో బుధవారం పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోని ఐదవ స్థానం నుంచి మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు వారసత్వ రాజకీయాలు లేదా అవినీతితో భ్రష్టు పట్టిపోయాయని ఆయన ఆరోపించారు.
కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి రావడానికి పార్టీ కార్యకర్తలు ప్రజలను నేరుగా కలుసుకుని వారి మద్దతును కోరాలని ఆయన పిలుపునిచ్చారు. గత పదేళ్లలో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు దేశంలో అభివృద్ధిని మాత్రమే చూస్తున్నారే తప్ప గత ప్రభుత్వాల తరహాలో అవినీతిని కాదని ఆయన తెలిపారు. ఏప్రిల్-మే మధ్యలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు వారసత్వ రాజకీయాలు అవినీతికి, అభివృద్ధికి మధ్య జరిగే సంగ్రామమని ఆయన అన్నారు. వారసత్వ రాజకీయాలు, అవినీతి దేశ నాశనానికి దారితీస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు ముంబైలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బిజెపి కార్యవర్గ సభ్యులతోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.