ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రేరేపిత హింసాకాండ చెలరేగుతోందని ఆరోపిస్తూ మాజీ సిఎం, వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బుధవారం నిరసన చేపట్టారు. దీనికి ఇండియా కూటమి నేతలు పలువురు తమ మద్దతు ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్‌ఆర్ పార్టీ ఆరోపణలను కేవలం ‘ కపట నాటకం’ గా తోసి పుచ్చింది. ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద జగన్ బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ ఆరోపించారు. సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధినేత అఖిలేష్ యాదవ్ , శివసేన (యుబిటి) నేతలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది , టిఎంసి నేత నదిమూల్ హక్, ఎఐఎడిఎంకె నేత ఎం. తంబిదురై తదితరులు ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలపై దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. “ ఫోటోలు, వీడియోలు చూసి ఉండక పోతే తనకు వాస్తవాలు తెలిసేవి కావు. అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలి. ఇతరులు చెప్పింది వినాలి. వారి జీవితాలను బలి తీసుకోరాదు ” అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.
ఈ సంఘటనలపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని రౌత్ పిలుపునిచ్చారు. “ విపక్ష కార్యకర్తలపై పాశవిక దాడులు జరగడంపై స్వతంత్ర దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపాలి” అని రౌత్ సూచించారు. తంబిదురై ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. 200 రోజుల్లో 595 మంది ప్రాణాలు కోల్పోయారని , అదీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న శాంతి భద్రతల పరిస్థితి అని ధ్వజమెత్తారు. డిఎంకె అరాచకాలకు తమిళనాడులో అనేక మంది మృతి చెందుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తాము అభ్యర్థిస్తున్నామని, ఈ విధమైన దారుణాలు అంధ్రా,తమిళనాడుల్లో ఆగాలని తంబిదురై డిమాండ్ చేశారు. హక్, చతుర్వేది తదితర అనేక నాయకులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్, సుప్రీం కోర్టు ఈ సంఘటనలను తీవ్రంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.