న్యూఢిల్లీ : 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాతనే ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడమవుతుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీలో ఉన్న మమతాబెనర్జీ మీడియాతో సోమవారం మాట్లాడారు. సీట్ల సర్దుబాటుతోసహా అన్ని అంశాలు ఈ సమావేశంలో పరిష్కారమవుతాయని, బీజేపీని ఓడించడమే లక్షంగా ముందుకు వెళ్తామని ఆమె దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లో మూడు మార్గాల పొత్తు తమ టిఎంసి, కాంగ్రెస్, వామపక్ష పార్టీ మధ్య సాధ్యమేనని ప్రకటించారు. “బీజేపీ బలంగా లేదు.
మేం బలహీనంగా ఉన్నాం. దీన్ని అధిగమించడానికి తాము సమైక్యంగా పనిచేయవలసి ఉంది” అని చెప్పారు. బీజేపీ తన పలుకుబడిని ముఖ్యంగా హిందీ బెల్టులో పెంచుకుందని ప్రశ్నించగా, తాను హిందీ బెల్టు, ఇతర ప్రాంతాలు అన్న విచక్షణ చూపించబోనని చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీల సస్పెన్షన్‌పై మాట్లాడుతూ బీజేపీ భయపడుతున్నట్టు దీని ద్వారా తెలుస్తోందన్నారు. రెండు రాష్ట్రాల్లో విజయం సాధించినందుకు వారు (బీజేపీ ) నిర్లక్షంగా ఉన్నారా అన్న ప్రశ్నకు “వారు భయపడుతున్నారు.
అందుకే సస్పెండ్ చేశారని సమాధానం ఇచ్చారు. మెజార్టీ ఉన్నా వారు భయపడుతున్నారు. ప్రజల గొంతుకను అణచివేస్తున్నారు. మొత్తం పార్లమెంటునే వారు సస్పెండ్ చేయగలరు. సభను నడిపై నైతికత వారికి లేదు ” అని మమత విమర్శించారు. బహిష్కరణకు గురైన ఎంపి మహువా మొయిత్రాకు మమతాబెనర్జీ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆమె క్రిష్ణానగర్ సీటుపై పార్లమెంటరీ పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. మూడోసారి మోడీ అధికారాన్ని చేపడతారని బీజేపీ వాదిస్తోందనగా, అది సాధ్యం కాదని మమత పేర్కొన్నారు.