కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్‌లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విపక్షాలు ఆ తర్వాత సీట్ల సర్దుబాటు విషయంతో కాంగ్రెస్ పెద్దన్న తీరుతో విసిగిపోయి ఒకటొకటిగా వేరు కుంపట్లు పెట్టుకోవడం మొదలుపెట్టాయి. దీంతో కూటమి మనుగడే ప్రశ్నార్థకమయింది. ముందుగా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బీహార్ సిఎం, జెడి(యు) అధ్యక్షుడు నితీశ్ కుమార్ ‘మహా ఘట్‌బంధన్’కు గుడ్‌బై చెప్పి తిరిగి బిజెపితో జతకట్టడంతో ఆ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. అదే సమయంలో కూటమిలో భాగస్వాములయిన బెంగాల్‌లో మమత పార్టీ తృణమూల్ , యుపిలో అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్‌పి, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ పార్టీ ఆప్ తమ తమ రాష్ట్రాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించి కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేశాయి. అయితే కేవలం వారాల వ్యవధిలోనే రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఆ పార్టీలు ఒక్కటొక్కటిగా తిరిగి కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుకు సిద్ధమవుతున్నాయి.
ఈ విషయంలో అందరికన్నా అఖిలేశ్ ఓ అడుగు ముందుకేసి కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు చేసుకున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా యుపిలో ఎక్కువ స్థానాలను గెలుచుకు తీరాల్సిందే. 80 లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలను దక్కించుకుని తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణం, రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో ఓటర్లకు మరింత చేరువవుతోందని విశ్లేషకుల అంచనా. మరో వైపు మాజీ సిఎం, బిఎస్‌పి అధినేత్రి మాయావతి తాము ఏ పార్టీతోను పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో మొన్నటిదాకా పొత్తుల విషయంలో బెట్టు చేస్తూ వచ్చిన కాంగ్రెస్, ఎస్‌పిలు రెండూ కూడా కలిసి పోటీ చేయడం వల్ల ఇరువురికీ లాభమనే వాస్తవాన్ని గ్రహించాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక స్వయంగా రంగంలోకి దిగి అఖిలేశ్‌తో చర్చలు జరపడంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారయిందన్న వార్తలు వచ్చాయి.
సీట్ల సర్దుబాటు తేలేదాకా యుపిలో జరుగుతున్న రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర లో పాల్గొనేది లేదని భీష్మించుకు కూర్చున్న అఖిలేశ్ ఇప్పుడు యాత్రలో పాల్గొంటానని ప్రకటించడం విశేషం. ఇది రెండు పార్టీల కార్యకర్తలకు నైతిక బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. మరోవైపు కేజ్రీవాల్ ‘ఆప్’ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఏకపక్షంగా ప్రకటించిన ఆ పార్టీ పంజాబ్‌లో కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పి కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేసింది. అయితే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేజ్రీవాల్‌ల మధ్య అనేక దఫాలు చర్చలు జరగడంతో ఇప్పుడు ‘ఆప్’ మెట్టు దిగి వచ్చింది. ముందుగా ఢిల్లీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇరుపార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఆప్ నాలుగు చోట్ల్లు, కాంగ్రెస్ మూడు చోట్ల పోటీ చేయడానికి అంగీకరించిచాయి. అలాగే గోవా, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆప్ రెండు చోట్ల పోటీ చేయనుండగా,
మిగతా 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. అలాగే పది స్థానాలున్న హర్యానాలో ఆప్ ఒక చోట పోటీ చేయవచ్చని తెలుస్తోంది. చండీగఢ్ లోక్‌సభ స్థానంలోనూ కాంగ్రెస్ బరిలో ఉంటుంది. అయితే ‘ఆప్’ అధికారంలో ఉన్న పంజాబ్‌లో మాత్రం ఇంకా ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు జరగలేదు. అయితే ఇప్పుడు పంజాబ్ విషయంలో కూడా ఇరు పార్టీలు ఓ మెట్టు దిగి సీట్ల సర్దుబాటుకు అంగీకరించే అవకాశం లేకపోలేదని అంచనా. ‘ఆప్’లో ఇంత మార్పు రావడానికి ఇటీవలి చండీగఢ్ మేయర్ ఎన్నిక పరిణామాల ప్రభావం కీలక పాత్ర పోషించిందని అంచనా. ఈ పరిణామం ఆ పార్టీపైనే కాకుండా ఇండియా కూటమిలోని అన్ని పక్షాలపై ప్రభావం చూపించింది. ‘కలసి ఉంటే కలదు సుఖం’అన్న సత్యాన్ని అవి గ్రహించినట్లు కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా బెంగాల్, అసోం, మేఘాలయలో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుకు సిద్ధంగా వున్నట్టు వార్తలు వస్తున్నాయి. నెల రోజుల క్రితం ఉంటుందా లేదా అనే స్థితిలో ఉన్న‘ఇండియా’ కూటమిలో ఇప్పుడు అన్ని పార్టీలు తిరిగి ఏకతాటిపైకి వస్తుండడం చూస్తే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని కలిసికట్టుగా ఢీకొనాలన్న ప్రతిపక్షాల లక్షం దాదాపుగా నెరవేరుతుందనిపిస్తుంది.