Monday, November 18, 2024

ఎట్టకేలకు యుపిలో పొత్తు

- Advertisement -
- Advertisement -

లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారయింది. పొత్తుపై చర్చలు పూర్తి చేస్తేనే యుపిలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్‌యాత్రలో పాల్గొంటానని అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరుతుందా అనే అనుమానాలు మంగళవారం దాకా కూడా కొనసాగాయి. అయితే ఎట్టకేలకు రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఖరారయినట్లు ఇరు పార్టీ నేతలు బుధవారం లక్నోలో సంయుక్తంగా విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. కాగా అంతకు ముందు మొరాదాబాద్‌లో మీడియాతో మాట్లాడిన అఖిలేశ్ యాదవ్ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయన్న ఊహాగానాలను తోసిపుచ్చారు.

రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని అంటూ, సీట్ల సర్దుబాటు కూడా త్వరలోనే పూర్తవుతందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అఖిలేశ్ ప్రకటన తర్వాత కొద్ది గంటలకే సమాజ్‌వాది పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చౌదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే సంయుక్తంగా విలేఖరుల సమావేశంలో ఇరు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 80 లోక్‌సభ స్థానాలున్న యుపిలో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ కంచుకోటలయిన రాయబరేలి, అమేథీతో పాటుగా కాన్పూర్ నగర్, ఫతేపూర్ సిక్రీ, బస్‌గావ్, సహరాన్‌పూర్, ప్రయాగ్‌రాజ్, మహరాజ్‌గంజ్, అమ్రోహా, ఝాన్సీ, బులంద్‌శహర్, ఘజియాబాద్, మథుర, సీతాపూర్, బారాబంకి, దేవోరియలతో పాటుగా ప్రధాని మోడీ నియోజకవర్గమైన లక్నోలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది.

ప్రియాంక కీలక పాత్ర?
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, సోనియాగాంధీలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. యుపిలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీతో చర్చించిన అనంతరం ప్రియాంక, అఖిలేశ్ యాదవ్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. సోనియాగాంధీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాల పాలయిన నేపథ్యంలో సీట్ల కోసం పట్టుబట్టవద్దని వారికి నచ్చజెప్పిన తర్వాతే ఇరుపార్టీల మధ్య పొత్తు చర్చలు ముందుకు సాగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించడం,

అటు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్‌లో తాము కూడా ఒంటరిగానే ప్రకటించిన నేపథ్యంలో ఎంతో ఆర్ఢాటంగా ప్రారంభమయిన విపక్ష ‘ఇండియా కూటమి’ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న వైఖరి కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఆ పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ తరుణంలో యుపిలో అఖిలేశ్ యాదవ్ పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు కావడం కూటమి మనుగడకు ఊపిరి పోసినట్లయింది. మరో వైపు చండీగఢ్ మేయర్ ఎన్నికలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆప్ వైఖరిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News