న్యూఢిల్లీ: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రతిపక్ష ‘ ఇండియా’ కూటమి నేతలు ఈ నెల 6న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమవుతారని సంబంధిత వర్గాలు తెలియజేశాయి.ఈ మేరకు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తృణమూల్ కాంగ్రెస్, డిఎంకు తదితర పార్టీల నేతలకు లేఖలు రాసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం జరగనున్న ఈ సమావేశంలో నేతలు ఎన్నికలకు ముందు బిజెపిని సంఘటితంగా ఎదుర్కొనాలన్న తమ వ్యూహంపై చర్చించి ఖరారు చేస్తారని ఆ వర్గాలు తెలియజేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి అనుసరించాల్సిన వ్యూహం, సీట్ల పంపిణీ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ముందు ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తోంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బిజెపి విజయ దుందుభి మోగించగా, తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికార బిఆర్‌ఎస్‌ను గదుద్దించి అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక మిజోరాంలో ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కొనేందుకు 26 పార్టీలు ‘ఇండియా’ కూటమి పేరుతో ఒక్కతాటిపైకి వచ్చిన విషయం తెలిసింది. ఈ కూటమి ఇప్పటివరకు పాట్నా, బెంగళూరు, ముంబయిలలో మూడు సార్లు సమావేశమై చర్చలు జరిపింది. కాగా అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేసిన ఉమ్మడి ర్యాలీలను ఇప్పుడు నిర్వహించేందుకుప్రతిపక్ష నేతలు నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్ మొదటి వారంలో భోపాల్‌లో ఇలాంటి ర్యాలీ నిర్వహించాలని అనుకొన్నప్పటికీ చివరి నిమిషంలో వాయిదా పడింది. సీట్ల పంపిణీని త్వరగా ఖరారు చేయాలని తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాది పార్టీ లాంటి కొన్ని పార్టీలు కోరుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా దీనికి సంబంధించిన చర్చలు ఆలస్యం అయ్యాయి.