Wednesday, January 22, 2025

ఓటరుకు ‘నమో’!

- Advertisement -
- Advertisement -

 

అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్/ మే మాసాల్లో జరగవలసిన సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టిన 202324 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మసిబూసి మారేడు కాయ చేసే నిర్వాకానికే పాల్పడ్డారు. అభివృద్ధి, సంక్షేమ బడ్జెట్‌గా చూపించడానికి ఆమె చేసిన యత్నం నిశిత పరిశీలనలో తేలిపోక తపదు. మాటల్లో సమ్మిళితం, చేతల్లో ప్రజా వ్యతిరేకంగా రూఢి అవుతున్న ఈ బడ్జెట్‌ను మధ్య తరగతి మందహాస పద్దుగా నిరూపించేందుకు ఆమె తాపత్రయ పడ్డారు. ఆ క్రమంలో ఒక రంగానికి కోత పెట్టి, మరో రంగాన్ని బలిపిస్తున్నట్టు కనిపించారు. నికరంగా జరిగేది కోతేగాని, బలుపు కాదు. ఉదాహరణకు మూలధన పెట్టుబడి కింద రూ. 10 లక్షల కోట్లు కేటాయించిన బడ్జెట్‌లో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను నిర్లక్షం చేశారు. చివరికి రూ. 10 లక్షల కోట్ల మూలధన వ్యయం ఎంత వరకు వాస్తవ రూపం ధరిస్తుందో ఆ మేరకు నిధుల కేటాయింపు, ఖర్చు జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఆ తర్వాత అత్యధికంగా రైల్వేకు రూ. 2.40 లక్షల కోట్లు కేటాయించారు.

ప్రధాని మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్ళుగా ఊరించి ఊరించి ఎట్టకేలకు ఈ పద్దులో ఆదాయపు పన్ను శ్లాబులను సవరించింది. కొత్త వ్యక్తిగత రాబడి పన్ను పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు సవరించారు. ఈ స్కీమ్‌లో ఏడాదికి రూ. 7 లక్షల రాబడిపై పన్ను వుండదని పేర్కొన్నారు. అలా చూస్తే నెలకు రూ. 58 వేల వ్యక్తిగత రాబడిపై పన్ను వుండదన్న మాట. ఈ రోజుల్లో ఆపాటి ఆదాయం చెప్పుకోదగినది కాదు. రోజురోజుకి పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం ఎంతటి రాబడినైనా కరి మింగిన వెలగపండుగా మార్చేస్తున్న పరిస్థితుల్లో ఆపాటి రాబడి ఎందుకూ పనికి రాకుండా పోతున్నది. దానిపై పన్ను మినహాయించడం చెప్పుకోదగిన ఔదార్యం ఎంత మాత్రం కాబోదు. పాత, కొత్త రాబడి పన్ను పథకాలు రెండింటినీ అందుబాటులో వుంచారు. దేనినైనా ఎంచుకొనే అవకాశాన్ని ఇచ్చారు. ఎన్నికలకు ముందు మహిళలను సంతృప్తిపరచామని చెప్పుకోడానికి వారి డిపాజిట్లపై వడ్డీ రేటును స్వల్ప కాలానికి పెంచారు. రెండేళ్ళ పాటు రూ. 2 లక్షలు దాచుకొనే మహిళల డిపాజిట్లపై 7.5% వడ్డీని ఇవ్వజూపారు.

దీనిని ఎంత మంది మహిళలు ఉపయోగించుకోగలుగుతారో చెప్పడం కష్టమే. దేశంలో కింద మధ్యతరగతి, కార్మిక వర్గ కుటుంబాలే అధికంగా వున్న నేపథ్యంలో బ్యాంకుల్లో సొమ్ము దాచుకోగలిగే స్థాయి గృహిణులు బహు స్వల్పమే. పేదలు భరించగల గృహ నిర్మాణ పథకం కింద కేటాయింపును 66% పెంచి ఆ మొత్తాన్ని రూ. 79 వేల కోట్లకు చేర్చారు. తలమీద కప్పులేని నిరుపేదలు కోట్ల సంఖ్యలో వున్న దేశంలో ఈ పెంపు కూడా స్వల్పమే. 20232024 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పెట్టదలచిన మొత్తం ఖర్చు రూ. 45 లక్షల కోట్లు. ఈ మొత్తాన్ని సమకూర్చుకోడానికి రూ. 15.43 లక్షల కోట్లు అప్పు చేయవలసి వుంటుంది. దాని మీద వడ్డీ చెల్లింపులను దృష్టిలో వుంచుకొంటే వాస్తవ వ్యయం అంతకంటే తక్కువగానే వుండగలదు.

ఈ పద్దుతో 2023 24లో బడ్జెట్ లోటును 5.9% వద్ద పరిమితం చేయాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకొన్నది. దేశంలో వినియోగించే ఆయిల్‌లో 80% వరకు దిగుమతి చేసుకొంటున్నదే. ప్రభుత్వ ఖర్చులో అత్యధిక భాగం దీని కిందే పోతుంది. అటువంటప్పుడు బడ్జెట్ లోటును పరిమితం చేయడం అనేది అత్యాశే అవుతుంది. దిగుమతులను తగ్గించుకొని ఎగుమతులను గణనీయంగా పెంచుకోగల దేశమే లోటును పూడ్చుకోగలుగుతుంది. మన దేశం అటువంటి ఆర్థిక ప్రగతి బాటలో లేనేలేదు. మన తయారీ రంగం కుంగికునారిల్లుతున్నది. దానిని పైకి లేపి నిలబెట్టే వ్యూహాలేమీ మన కేంద్ర పాలకుల వద్ద లేవు. దేశంలో అపారంగా వున్న యువతరాన్ని వినియోగించుకొని తయారీ రంగం నాణ్యతను పెంచుకొని అంతర్జాతీయ మార్కెట్‌లో మన సరకులకు గిరాకీ తెచ్చుకోడానికి తగిన ఆలోచనలు మన పాలకుల వద్ద లేవు.

దేశంలో కేవలం శారీరక శ్రమ మీద ఆధారపడే జనాభా అత్యధికంగానూ, చదువు సంధ్య కలిగిన మధ్య తరగతి తక్కువగానూ వున్నందున నిపుణతగలిగిన యువత తగినంతగా లభించడం లేదు. గ్రామీణ పేదలకు వరంగా నిరూపించుకున్న ఉపాధి హామీ పథకానికి కేటాయింపును క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో దానిని రూ. 60 వేల కోట్లకే పరిమితం చేసింది. అంటే ఆ పథకం నిధుల్లో 32% కోత విధించింది. దేశ ప్రజల వికాసానికి మూలాధారాలైన విద్య, వైద్య రంగాలకు గణనీయమైన కేటాయింపులు లేవు. అందుచేత దీనిని అభివృద్ధి, సంక్షేమ బడ్జెట్‌గా, సమ్మిళిత పద్దుగా ఎంత మాత్రం పరిగణించలేము. బిజెపి పాలనలోని కర్ణాటకకు అధికంగా నిధులు కేటాయించిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం స్పష్టంగా కనిపిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News