Friday, November 22, 2024

ఆశలు రేకెత్తిస్తున్న బడ్జెట్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో నిరుద్యోగులు అసంతృప్తితో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ఫలితాలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఎన్‌డిఎ ప్రభుత్వం గుర్తించింది. అందువల్ల ఈసారి బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పనపైనే ఎక్కువ గా దృష్టి కేంద్రీకరించే అవకాశం కనిపిస్తోంది. యువకుల నైపుణ్యాభివృద్ధికి, సామాజిక భద్రత విస్తరణకు భారీగా కేటాయింపులు ఉండవచ్చని తెలుస్తోంది. వ్యవసాయంలో ఉత్పత్తి అభివృద్ధికి నూతన వంగడాల పరిశోధన, అభివృద్ధి కోసం ప్రయోగశాల నుంచి వ్యవసాయ క్షేత్రానికి అన్న సంకల్పం కోసం బడ్జెట్ కేటాయింపులు రెట్టింపు ఉండాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చి ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ రిలేషన్స్ (ఐసిఆర్‌ఐఇఆర్) సూచిస్తోంది.

ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం మొదటి సారి ఈనెల 23న ప్రవేశపెట్టనున్న 2024 పూర్తి స్థాయి ఆర్థిక బడ్జెట్‌పై ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రానున్న ఐదేళ్లలో తన విజన్‌తో పాటు సంస్కరణల ఎజెండాను ఏ విధంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందో ఈ బడ్జెట్ స్పష్టం చేస్తుంది. సామాన్యులు, మధ్యతరగతి వర్గాల వారు, వేతన జీవులు తమకు బడ్జెట్‌లో ఏయే ప్రయోజనాలు కల్పిస్తారో అని ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులైతే ఆదాయం పెంచే మార్గాలు, పొదుపును మిగిల్చే ప్రకటనలను ఆశిస్తున్నారు.

ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు, కేంద్ర ఉద్యోగుల జీతం, అలవెన్సులు, పెన్షన్‌తో సహా అనేక ప్రయోజనాలను సవరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 18 నెలల డియర్‌నెస్ (డిఎ)ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎనిమిదో వేతన కమిషన్‌ను అమలు చేస్తే కోటి మంది కేంద్ర ఉద్యోగుల పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది.దేశంలో కుటుంబాల ఆదాయంతోపాటు పొదుపు కూడా బాగా తగ్గిపోయింది. ఒక నివేదిక ప్రకారం కుటుంబాల పొదుపు రూ. 14.6 లక్షల కోట్ల నుంచి మూడేళ్లలో 2022 23 నాటికి రూ. 9 లక్షల కోట్లకు తగ్గాయి. ఇక 202425 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయాలతోపాటు పొదుపు కూడా మరింత 25% వరకు తగ్గుతాయని తెలుస్తోంది. ఈసారి మధ్యతరగతి పొదుపు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈసారి కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతికి బడ్జెట్‌లో ఊరట కల్పిస్తుందని తెలుస్తోంది.

రూ. 15 లక్షలకు పైగా ఆదాయం సంపాదిస్తున్న వారికి ఊరట లభించవచ్చు. ప్రస్తుతం రూ. 15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 5 నుంచి 20 శాతం మధ్య పన్ను పడుతుండగా, రూ.15లక్షలు పైబడిన వారికి గరిష్ఠంగా 30% పన్ను పడుతోంది. అలాగే రూ. 10 లక్షల వార్షికాదాయం పైనా పన్ను రేట్లు తగ్గించే యోచన చేస్తున్నారని తెలుస్తోంది. అయితే వేతనాలు అందుకునే వర్గాలు (శాలరీడ్ క్లాస్) మాత్రం కొత్త పన్నువిధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ పాతపన్ను విధానంలో ఉన్నన్ని మినహాయింపులు లేవనీ, అందువల్ల కొత్త పన్ను విధానంలో ప్రస్తుత నిబంధనలను కొనసాగిస్తూనే డిడక్షన్లు పెంచాలని కోరుతున్నారు.

ఈసారి ఆదాయపు పన్ను రేటు తగ్గించాలన్న డిమాండ్ పన్ను చెల్లింపుదారుల నుంచే కాకుండా పారిశ్రామిక వర్గాల నుంచి కూడా వచ్చింది. బడ్జెట్ ప్రధాన సంకల్పం ‘వికసిత్ భారత్’. ఇది ముఖ్యంగా నాలుగు మూలస్తంభాలపై దృష్టి కేంద్రీకరించింది. అవి నిరుపేద (గరీబ్), మహిళా సంక్షేమం (మహిళాయెన్), యూత్ (యువ), అన్నదాత (రైతు) ఈ నాలుగు లక్షాలను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందని ఆలోచిస్తున్నారు. ఇక ప్రతి కుటుంబంలోనూ భారీగా ఖర్చు పెట్టవలసిన పద్దు ఉన్నత విద్య. ఇదో పెద్ద హాట్ టాపిక్ అయింది. చదువులు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటారా? లేదా నాణ్యమైన చదువులకు ప్రస్తుత వ్యయం తప్పనిసరి అని సరిపెడతారా? అన్నది చర్చనీయాంశమవుతోంది.
ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా మంది ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయలేకపోతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను రాయితీల గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ రాయితీల వల్ల గ్రీన్ టెక్నాలజీని చాలా మంది వినియోగించే అవకాశం కలుగుతుంది. ఇక ఆరోగ్య భద్రతలో వైద్య సేవలు నాణ్యం గా అందరికీ అందుబాటులో ఉండేలా బడ్జెట్‌లో ఏ మేరకు కేటాయింపులు ప్రతిపాదిస్తారో అని ఎదురు చూస్తున్నారు. కనీస మౌలిక సౌకర్యాల కల్పన, ద్రవ్యోల్బణం, అధిక ధరల అదుపు, నిరుద్యోగ సమస్య పరిష్కారం, ఉపాధి కల్పన, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ప్రధాన అంశాలుగా సామాన్య ప్రజానీకం భావిస్తున్నారు. సామాజిక రంగానికి సంబంధించి గ్రామీణ రంగ పథకాలపై వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. గృహాలకు రాయితీలు రూ. 23,000 కోట్ల వరకు పెరుగుతాయని భావిస్తున్నారు. గ్రామీణ రహదారులు, ఉపాధి కోసం కేటాయింపులు భారీగా ఉంటాయని అనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజారోగ్యం, బీమా కార్యక్రమాలకు రూ. 12,100 కోట్లు ఖర్చు చేస్తారని చెబుతున్నారు. మహిళల ఆర్థిక సాధికారత కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తున్నారు. ఈసారి ఆత్మనిర్భర్‌లో భాగంగా దేశీయ తయారీని పెంపొందించ డానికి ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాన్ని పునఃపరిశీలించే అవకాశం కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్ భాగాలు సంబంధిత పరికరాల తయారీ, కూర్పుకు సంబంధించి ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ (ఉత్పత్తి అనుసంధాన రాయితీ) కింద రూ. 35,000 కోట్లు కేటాయించడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిద్ధమైంది.

స్థానికంగా ఫోన్ల ఉత్పత్తి కంపెనీలకు ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకం ద్వారా ప్రత్యేక రాయితీలు అందిస్తారు. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించే ప్రయత్నంలో గత ఏడాది ప్రభుత్వం కెమెరా లెన్స్‌ల వంటి కీలక భాగాలపై దిగుమతి పన్నులు తగ్గించింది. లిథియం అయాన్ బ్యాటరీలపై అదనంగా తగ్గించిన పన్ను రేట్లను పొడిగించింది. లిథియం అయాన్ బ్యాటరీలు స్మార్ట్‌ఫోన్, ఈవీ వాహనాలకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో మొబైల్ రంగం ఎలాంటి తగ్గింపులకు వెసులుబాటు కల్పిస్తుందో చూడాలి. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ వంటి 14 కీలక రంగాలకు పిఎల్‌ఐ స్కీమ్‌ను రూపొందించిన ప్రభుత్వం ఇప్పుడు మరికొన్ని రంగాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరింప చేయాలని చూస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో నిరుద్యోగులు అసంతృప్తితో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ఫలితాలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఎన్‌డిఎ ప్రభుత్వం గుర్తించింది. అందువల్ల ఈసారి బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పనపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే అవకాశం కనిపిస్తోంది.

యువకుల నైపుణ్యాభివృద్ధికి, సామాజిక భద్రత విస్తరణకు భారీగా కేటాయింపులు ఉండవచ్చని తెలుస్తోంది.
వ్యవసాయంలో ఉత్పత్తి అభివృద్ధికి నూతన వంగడాల పరిశోధన, అభివృద్ధి కోసం ప్రయోగశాల నుంచి వ్యవసాయ క్షేత్రానికి అన్న సంకల్పం కోసం బడ్జెట్ కేటాయింపులు రెట్టింపు ఉండాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చి ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ రిలేషన్స్ (ఐసిఆర్‌ఐఇఆర్) సూచిస్తోంది. ఈ మేరకు అగ్రికల్చర్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఎక్స్‌పెండీచర్ (ఎఆర్‌డిఇ)కి ప్రస్తుత కేటాయింపు రూ. 9941 కోట్ల నుంచి దాదాపు రెట్టింపు బడ్జెట్‌లో కేటాయించాలని కోరుతున్నారు.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పాడి పరిశ్రమ, మత్స పరిశ్రమలకు, గ్రీన్ ఎనర్జీలో భాగంగా శిలాజ ఇంధనేతర వాహనాలు, గృహాలకు సౌర విద్యుత్, మెట్రో రైళ్లు, బుల్లెట్ రైళ్ల పురోగతికి ఎక్కువ అవకాశం ఇస్తామని రాష్ట్రపతి లోక్‌సభ సమావేశాల ప్రారంభ ఉపన్యాసంలో ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో తగినంతగా కేటాయింపులు చేయవలసిన అవసరం ఉంది. ఇటీవల పారిశ్రామిక, వాణిజ్య వర్గాల ప్రతినిధులు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌తో భేటీ అయినప్పుడు బడ్జెట్ ప్రతిపాదనలపై అనేక అంశాలను ప్రస్తావించారు. తక్కువ ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయించాలని, ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహక పథకాలను మెరుగుపర్చాలని, ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలని, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

పి.వెంకటేశం
9985725591

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News