ఐక్యరాజ్యసమితి: శాశ్వత, అశాశ్వత విభాగాలు రెండింటిలో తమకు సభ్యత్వం కల్పించడం ద్వారా ఐక్యరాజ్యసమితి(యుఎన్) భద్రతా మండలిని మరింత చట్టబద్ధంగా, ప్రాతినిధ్యపరంగా, జవాబుదారీతనంగా, సమర్థవంతంగా తీర్చిదిద్ది నిజమైన సంస్కరణలు తీసుకురావాలని భారత్ ఆకాంక్షించింది.
ఐక్యరాజ్యసమితిలో సంస్కఱలు తీసుకురావాలని, 15 మంది సభ్యులు గల భద్రతా మండలిలో తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ ఎప్పటి నుంచో డిమాండు చేయడంతోపాటు దక్షిణాసియా దేశాల తరఫున వాదిస్తోంది. యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత, అశాశ్వత కేటగిరిలలో రెండింటిలో సభ్యత్వాలను విస్తరించాలని భారత్ కోరుకుంటోందని భారత రాయబారి రుచిర కాంభోజ్ సోమవారం రాత్రి భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన రవ విడత అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల సదస్సులో తెలిపారు.
ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు చెందిన అనేక దేశాలతోసహా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు భద్రతా మండలిలో సభ్యత్వాన్ని కోరుతున్నాయని ఆమె చెప్పారు. ఇందుకు బధ్రతా మండలి విస్తరణ అత్యంత అవసరమని ఆమె తెలిపారు. ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా శాశ్వత సభ్యులుగా మరో 10 దేశాలు అశాశ్వత సభ్యులుగా ఉన్నాయి.