అమరావతి: ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో అత్యుత్తమ స్థానంలో ఉందని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆర్థిక సంస్కరణలు, సరైన సమయంలో సాంకేతికత అందిపుచ్చుకోవాలని సూచించారు. జనాభా వైవిధ్యం, సుస్థిర వృద్ధిరేటు, పటిష్టమైన విధానాలతో పాటు సరైన నాయకత్వంతో ఇండియా బ్రాండ్ బలంగా ఉందని పేర్కొన్నారు. దావోస్‌లో మూడో రోజు సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎపి బృందం ప్రఖ్యాత కంపెనీల సిఇఒలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. భారత దేశం బ్రాండ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉందని, దావోస్ లో వివిధ రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీపడుతున్నాయని తెలియజేశారు.
దేశం కోసం అందరం కలిసి పని చేస్తున్నామని, సిఎంలుగా వేర్వేరు పార్టీలకు చెందినా, ప్రజల కోసం ఐక్యంగా ఆలోచిస్తామని బాబు వివరించారు. మేమంతా వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారిమైనప్పటికీ భారత్ కోసమే పని చేస్తున్నామన్నారు. తాము దావోస్ నుంచి టెక్నాలజీని తీసుకెళ్లడానికి రాలేదని, ప్రపంచానికే మా దేశం టెక్నాలజీని అందజేస్తోందని, అది మా భారతీయుల సత్తా అని ప్రశంసించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ విశేష కృషి చేస్తోందని బాబు స్పష్టం చేశారు.
దాదాపు అన్ని టెక్ కంపెనీల సిఇఒలు భారత సంతతికి చెందినవారే ఉన్నారని, సాంకేతికతను ముందుగా అందిపుచ్చుకున్న దేశంగా భారత్ ప్రయోజనాలు పొందుతోందన్నారు. వ్యాపార దక్షత, నైపుణ్యాలు ఉన్న యువత, జనాభా ఎక్కువగా ఉండటం భారత్ కు వరాలని సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తానికి ఇండియా సేవలందిస్తోందని, ప్రపంచంలో అన్ని ప్రాంతాల ప్రజలకు అత్యంత ఆమోదయోగ్యులు భారతీయులే ఉన్నారని చంద్రబాబు తెలియజేశారు.