Tuesday, November 5, 2024

‘రేసు’కు బ్రేకులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఇండియా కార్ రేసింగ్ లీగ్ ఆదివారం అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇండియన్ రేసింగ్ లీగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. శనివారం టెస్ట్ రేసులు నిర్వహించగా ఆదివారం సమయాభావం, రేసర్లకు ప్రమాదాల కారణంగా పూర్తి స్థాయిలో రేస్‌లను నిర్వహించలేకపోయారు. ఎఫ్-4 ప్రాక్టీస్ రేసులను మాత్ర మే నిర్వహించారు. ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఫార్మూలా -ఈ పోటీలకు సన్నాహకంగా- భావిస్తున్న జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రధాన పోటీలు జరగకుండానే ఆదివారం ముగిసింది. సమయాభావం, రేసర్లకు స్వల్ప ప్రమాదాలు జరగడంతో అసలైన రేసును నిర్వాహకులు నిలిపివేశారు. దీంతో అసలైన తుది రేసింగ్‌ను ప్రేక్షకులు ఆస్వాదించలేకపోయారు. రేసర్లు ట్రాక్‌లకు అలవాటు పడేందుకు ప్రధాన పోటీలను నిర్వహించామని ప్రధాన ఈవెంట్లు ఆదివారం జరుగుతాయని భావించినా అది సాధ్యపడలేదని నిర్వాహకులు తెలిపారు.

నాలుగు ఫార్ములా కార్లు ప్రమాదానికి…

క్వాలిఫయింగ్ రేస్‌లో కొత్త ట్రాక్‌పై పలుమార్లు కార్లు ఢీకొని రేసర్లకు గాయాలు కావడం కొంత ఇబ్బంది కలిగింది. ఇందులో నాలుగు ఫార్ములా కార్లు ప్రమాదానికి గురికాగా ఇందులో ఒక రేసర్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయాలకు తోడు చీకటి పడటం, రేసింగ్‌కు రెండ్రోజులు మాత్రమే అనుమతి ఉండటంతో సోమవారం వీటిని నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇండియన్ రేసింగ్‌లోని మూడు ప్రధాన పోటీలు లేకుండానే సాధారణ పోటీలతోనే నిర్వాహకులు ముగించారు.

రేస్ కార్ల ఢీ

ఇండియన్ రేసింగ్ లీగ్‌లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రేస్ ప్రారంభమయిన తరువాత చెన్నై టర్బోరైడర్స్ కారును గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా రేసర్‌కు గాయాలయ్యాయి. గాయపడ్డ రేసర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం తరువాత సాంకేతిక లోపంతో మరో కారు నిలిచిపోయింది. దీంతోపాటు మరో రెండు కార్లు ఢీకొనడంతో నిలిచిపోయిన కార్లను క్రేన్ సహాయంతో నిర్వాహకులు తొలగించారు. మొదటిరోజు శనివారం సైతం రేసింగ్‌లోనూ పెను ప్రమాదం తప్పింది. ప్రసాద్ ఐ మ్యాక్స్ ఎదుట ట్రాక్ మీదుగా అతివేగంతో దూసుకెళ్తున్న ఓ కారుపై చెట్టు కొమ్మ విరిగి పడటంతో కారు అదుపుతప్పింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహారించి కొద్ది దూరంలో ట్రాక్ పక్కన కారును నిలిపివేశాడు. ప్రమాదంలో డ్రైవర్ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కార్ రేసింగ్ ఆలస్యంగా…

అయితే వరుస ప్రమాదాల నేపథ్యంలో కార్ రేసింగ్ ఆలస్యంగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన ఫార్ములా-4 రేస్ 2 మధ్యాహ్నం 3.30 కి ప్రారంభం కాగా రేసింగ్‌లో ఇలాంటివి సహజమేనని నిర్వాహకులు పేర్కొన్నారు. కొత్త ట్రాక్ అలవాటు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. రేసు నిర్వహణ ఆలస్యం కావడంతో ఫార్ములా-4 రేస్‌తోనే నిర్వాహకులు సరిపెట్టారు. ఈ నేపథ్యంలో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.

ఉదయం 8 గంటల నుంచే సందర్శకులకు అనుమతి

హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో ఇండియన్ రేసింగ్ (ఐఆర్‌ఎల్) రెండోరోజూ కూడా ప్రేక్షకుల కేరింతల మధ్య ప్రారంభమయ్యింది. ఆదివారం సెలవుదినం కావడంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులతో పాటు మంత్రులు హాజరయ్యారు. అత్యంత వేగంగా దూసుకుపోతున్న రేస్ కార్లను చూసి ప్రేక్షకులు చప్పట్లతో వారిని ఉత్సాహాపరిచారు. రెప్పపాటు వేగంతో దూసుకెళ్లిన కార్లను చూసి చాలా మంది సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. పురుషులతో పోటీ పడి మహిళా రేసర్లు రయ్యుమంటూ కార్లను నడపగా కార్లు దూసుకెళ్తున్న శబ్ధం కిలోమీటర్ల మేర వినిపించింది. ఉదయం 8 గంటల నుంచే సందర్శకులను గ్యాలరీల్లోకి అనుమతించారు.

రేసింగ్ లీగ్‌ను పరిశీలించిన మంత్రులు

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియన్ రేసింగ్ లీగ్‌ను రాష్ట్ర మంత్రులు డా. వి. శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ మహమూద్ అలీలు ఆదివారం పరిశీలించారు. అనంతరం రేసింగ్ నిర్వాహకులు మంత్రులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ, కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, తలసాని సాయి, ప్రముఖ డాక్టర్ వంశీ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబి కృష్ణా యాదవ్, నగర శాఖ అధ్యక్షుడు గండూరీ వెంకట్, కార్యదర్శి తమటం లక్ష్మణ్ గౌడ్‌లు పాల్గొన్నారు.

విఐపి టికెట్ తీసుకున్నా లోపలికి అనుమతించని పోలీసులు

విఐపి టికెట్ తీసుకున్నా పోలీసులు లోపలికి అనుమతించక పోవడంతో ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు. అభిమానులు రూ.6 వేల నుంచి రూ. 12 వేలు వరకు పెట్టి టికెట్ కొన్నామని అయినా తమను పోలీసులు పంపకుండా ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అప్పటికే విఐపి గ్యాలరీ నిండిపోవడంతో వారిని లోపలికి అనుమతించ లేదని పోలీసులు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News