20వ శతాబ్దం మొదట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజ సాగర్‌కు చీఫ్ ఇంజినీరుగా పని చేశారు. హైదరాబాద్‌ను మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించారు. 1908లో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత, మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేసారు. పుణెలో ఇంజినీరింగు పూర్తయిన తరువాత తన 23వ యేట బొంబాయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజినీరుగా చేరిన తరువాత, భారత నీటిపారుదల కమిషనులో చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది. ఆయన దక్కను ప్రాంతంలో చక్కని నీటి పారుదల వ్యవస్థను రూపొందించారు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వ చేయగలిగిన ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థను విశ్వేశ్వరయ్య రూపొందించారు.
1903లో మొదటిసారిగా దీనిని పుణె దగ్గరి ఖడక్వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. దీని తరువాత గ్వాలియర్ వద్ద అల తిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోనూ దీనిని వాడారు. 1906- 1907 మధ్య కాలంలో ఆయనను భారత ప్రభుత్వం యెమెన్‌లోని ఆడెన్‌కి పంపించి అక్కడి నీటి పారుదల వ్యవస్థను, మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. ఆయన నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ మంచి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయబడింది. హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినపుడు, ఆయనకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది. అప్పట్లో కృష్ణరాజ సాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఆయన దేశానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1955లో అత్యున్నత పురస్కారం భారత రత్న ప్రదానం చేశారు.
1908 సంవత్సరం సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటలకు ఆకాశం మొత్తం నల్లటి మబ్బులు కమ్మకున్నాయి. గంట దాటింది. చినుకులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు వర్షం పెరగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాయంత్రం 6 గంటలకు మూసీ నది నిండిపోయింది. కేవలం రెండు రోజులు.. భారీ వర్షం చూస్తుండగానే నగరం జలమయమైంది. ఇళ్లల్లోకి వరద నీరు చేరిపోయింది. తినడానికి తిండి కాదు కదా కనీసం కూర్చోవడానికి కూడా స్థలం లేదు. వారు తేరుకోవడానికి అనేక రోజులు పట్టింది. ప్రాణాలను కాపాడుకోవడానికి అఫ్జల్‌గంజ్ భవనం పైన ఎక్కిన జనం దానికి ఆనుకొని ఉన్న చెట్టుపై ఎక్కి వందల మంది ప్రాణాలను కాపాడుకున్నారు. మూసీకి ఉత్తరం 2 కిలోమీటర్లు, దక్షిణాన ఒక కిలోమీటర్ వరకు వరద నీరు ప్రవహించాయి. అఫ్జల్‌గంజ్ వంతెనా కొట్టుకుపోయింది. పురానాపూల్ వంతెన మీద నుంచి నీరు ప్రవహించింది. మరుసటి రోజూ అదే పరిస్థితి. మూడో రోజు సెప్టెంబర్ 28 మూసీ నది 60 అడుగుల ఎత్తులో ప్రవహించింది. 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అఫ్జల్‌గంజ్ వద్ద నీటి మట్టం 11 అడుగులకు చేరింది. పేట్ల బురుజు పైకి వందల సంఖ్యలో చేరుకున్నారు. రెండు గంటల్లోనే పేట్ల బురుజు నీటి ప్రవాహానికి కొట్టుకపోయింది. దీంతో వందలాది మంది నీటి ప్రవాహంలో కొట్టుకపోయారు. దాదాపు 15 వేల మంది ప్రాణాలొదిలారు. ముత్యాల నగరంగా మురిసిపోయిన మహా నగరం ఊహించని జలప్రళయంతో విలవిల్లాడింది. హైదరాబాద్ నగర జనజీవనాన్ని స్తంభింపజేసి అపార ఆస్తి నష్టం కలుగజేసింది. జంట నగరాల అభివృద్ధి ఆధునిక శకం 1908లో ఈ వరదల తర్వాతనే ప్రారంభమైంది. దీనితో అంచెల వారీగా ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అనివార్యమైంది. నగరాభివృద్ధికి ప్రణాళికను తయారు చెయ్యటానికి నియమించబడిన సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వరదలు మళ్లించకుండా నివారించడానికి, నగరంలో మౌలిక పౌర సౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909, అక్టోబరు 1న తన నివేదిక సమర్పించారు. ఏడవ నిజాం 1912లో నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించారు. వరదలను నివారించేందుకు వరద నివారణ వ్యవస్థను కట్టించారు. 1920లో మూసీ నదిపై నగరానికి పది మైళ్ళ ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు. 1927లో మూసీ ఉప నది అయిన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయాన్ని నిర్మించారు. ఇది హైదరాబాద్ నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి. ఆయన మేధావి తనాన్ని చూసి నాటి నిజాం నవాబు కూడా ఆశ్చర్యపోయాడు.
హైదరాబాద్ వరద విషాదంపై ఆజం హుస్సేనీ ఇచ్చిన నివేదికపై 1911లో పగ్గాలు చేపట్టిన ఉస్మాన్ అలీఖాన్ కార్యాచరణ ప్రకటించి ఇంజినీరింగ్ నిపుణుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నగర బాధ్యతలు అప్పగించారు. ఆయన సూచనల మేరకు అనేక రంగాల నిపుణులతో 1912లో సిటీ అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు నగరానికి పశ్చిమాన 16 కి.మీ. దూరంలో 1920లో ఉస్మాన్ సాగర్ (గండిపేట), 1927లో హిమాయత్ సాగర్ పూర్తి చేశారు. మూసీ పరివాహక ప్రాంతమంతా 60 అడుగుల ఎత్తుతో పటిష్టమైన ప్రహరీగోడ నిర్మించారు. 1931 నాటికి డ్రైనేజీ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నాటి అవసరాల మేరకు నగరంలో సుమారు 700 కి.మీ. మేర భూగర్భ డ్రైనేజీ సదుపాయం సమకూర్చారు. మూసీ నదిపై భూబకాసురులు కబ్జా చేసి ఇండ్లు నిర్మించుకోవడం వల్ల భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. గత సంవత్సరంలో కురిసిన వర్షాలను మరువక ముందే జడివానతో మహానగరం వరుసగా జలమయం అయ్యింది. దీనికి కొత్త డ్రైనేజీ సామర్థ్యం పెంచి నివాసయోగ్యమైన జీవనం కోసం విపత్తును ఎదుర్కోనే విధంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా కొత్త మాస్టర్ ప్లాన్ అమలుకు వేగవంతం చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆలోచనను ఆశతో కాకుండా ఆశయంతో పని చేస్తే ఫలితం ఆదర్శవంతంగా ఉంటుంది. తెలివైన వ్యక్తుల మాటలు మాత్రం సజీవంగా ఆచరణలో పెట్టాల్సిన అవసరం వుంది.
ఒకసారి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు, దానితో పాటు శబ్దంలో ప్రకంపనల మార్పును గుర్తించి అత్యవసర చైన్ లాగి ట్రైన్‌ను నిలిపివేశారు. ఆ తరువాత చూస్తే కొంత దూరంలో రైలు పట్టాలు విరిగిపోయి ఉన్నాయి. ఆ విధంగా తన సమయ స్ఫూర్తితో ఎన్నో వందల ప్రాణాలను మోక్షగుండం కాపాడారు. ఆయన చేసిన మరో అద్భుతం విశాఖ తీరంలో ఇసుక మేటలను నియంత్రించిన విధానం. ఎందుకూ పనికిరాని రెండు పాత నౌకలను కొండకు ఒక వైపుగా సరైన కోణంలో ముంచి వేసి తద్వారా ఇసుక మేటను నియంత్రించారు. మరి అప్పుడు నేటి ఆధునిక రేవు పట్టణాలు, మానవ నిర్మిత రేవులు లేవు కదా. సహజమైన రేవులో లోతు ఎక్కువగా ఉన్నప్పుడే పెద్ద నౌకలు కూడా తీరానికి వస్తాయి. అది ఆయన సాంకేతిక నైపుణ్య ప్రతిభకు తార్కాణం. ఇలా చెప్పుకుంటూపోతే మన దేశంలోని చాలా ఆనకట్టలు, చెక్ డ్యాంలు, జలాశయాల ప్రణాళికలు మోక్షగుండం మెదడులో జన్మించిన అద్భుత ఆలోచనలే. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 15 ‘సాంకేతిక నిపుణుల దినోత్సవం గా జరుపుకోవడం మనం ఆయనకు అందించే ఘనమైన నివాళి.