Thursday, January 23, 2025

దేశ భద్రత విషయంపై చర్చ జరగాల్సిందే..

- Advertisement -
- Advertisement -

దేశ భద్రత విషయంపై చర్చ జరగాల్సిందే
చైనా సరిహద్దుల్లో ఘర్షణపై ఒక్కటైన విపక్షం
లోక్‌సభలో సోనియా సారధ్యంలో వాకౌట్
ప్రభుత్వంపై ఒత్తిడికి ఉమ్మడి వ్యూహం కార్యాచరణ
18 ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం
1962లో సభలో చర్చ ప్రస్తావన
నేడు సంయుక్త ప్రకటనకు సిద్ధం
న్యూఢిల్లీ: సరిహద్దులలో చైనా ఘర్షణపై చర్చ విషయంలో పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయి. ఈ అంశంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చొరవ తీసుకుని, ప్రతిపక్షాలను ఒక్కతాటికి తీసుకువచ్చేందుకు యత్నించారు. సరిహద్దులలో చైనా ఘర్షణకు దిగడం సాధారణ విషయం కాదని, దీనిపై పూర్తిస్థాయి చర్చ అవసరం అని కాంగ్రెస్ సారధ్యంలో విపక్షాలు పట్టుపట్టాయి. దీనికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ససేమిరా అనడంతో బుధవారం కాంగ్రెస్, టిఎంసిలు నిరసన వ్యక్తం చేస్తూ లోక్‌సభ నుంచి వాకౌట్ జరిపాయి. ఈ దశలో ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో విపక్షాల మధ్య ఐక్యత సుస్పష్టం అయింది. ఆ తరువాత సభలలో విపక్షాల వ్యూహం గురించి చర్చించాలని, భేటీ కావాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్, టిఎంసి నేతలతో పాటు ఆమ్ ఆద్మీపార్టీ , తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బిఆర్‌ఎస్) సహా 18 ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎల్‌ఎసి వెంబడి తవాంగ్ వద్ద ఈ నెల 9వ తేదీన చైనా సైన్యం తమ గస్తీ రేఖ పరిధిని దాటిరావడం, దీనిని భారతీయ జవాన్లు ధైర్యంగా తిప్పికొట్టే దశలో ఘర్షణ చెలరేగడం వంటి పరిణామాలు దేశ భద్రతకు, ప్రత్యేకించి చైనా సరిహద్దులలోని కీలక క్లిష్ట విషయానికి సంబంధించిన వ్యవహారం అని విపక్షాలు పేర్కొన్నాయి. లోక్‌సభలో టిఎంసి, కాంగ్రెస్‌ల వాకౌట్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరిగింది. తవాంగ్ ఘర్షణలపై చర్చకు సభాధ్యక్షులు నిరాకరించడంపై విపక్షాలు ఆగ్రహించాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్‌కు దిగిన క్రమంలో వీరిని టిఎంసి సభ్యులు కూడా అనుసరించారు. 1962లో ఇండో చైనా యుద్ధం దశలో కూడా అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లోక్‌సభలోచర్చకు అనుమతివచ్చేలా చేశారని కాంగ్రెస్ గుర్తు చేసింది.

అయితే నిబంధనల ప్రకారం వెనువెంటనే చర్చకు వీలు కాదని, దీనిపై సభా నిర్వాహక సలహా మండలి నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. యధావిధిగా దైనందిన సభా కార్యకలాపాలకు దిగేందుకు యత్నించారు. దీనికి విపక్షాలు అభ్యంతరం తెలియచేస్తూ ఐక్యంగా వాకౌట్‌కు దిగి తమ నిరసనకు పదును పెట్టే వ్యూహాల ఖరారుకు సమావేశం అయ్యాయి. శీతాకాల సమావేశాలలో తొలిసారిగా భావసారూప్య పార్టీలు ఒక్కచోట చేరి , చైనా అంశంపై సభలో చర్చకు అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశం కావాలని ఖర్గే కోరడంతో సాధారణంగా కాంగ్రెస్‌తో కలిసి రాకుండా ఉంటూ వస్తున్న ఆప్ ఈ భేటీకి హాజరయింది. అయితే టిఎంసి ఇందులో పాల్గొనలేదు. విపక్షాల సమావేశంలో వామపక్షాలు సిపిఐ, సిపిఎం, ఆర్జేడీ, జెడియు, సమాజ్‌వాది పార్టీ, ఎన్‌సిపి, శివసేన (ఉద్ధవ్ వర్గం), జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇతర పార్టీల నేతలు పాల్గొనడం కీలకం అయింది.

రక్షణ మంత్రి సంక్షిప్త ప్రకటనతో సరి
చైనా సరిహద్దులలో ఘర్షణపై సభలో చాలా గంటల పాటు కాంగ్రెస్, ఎన్‌సిపి, ఇతర పార్టీలు చర్చకు పట్టుపట్టాయి. అయితే ప్రభుత్వం నుంచి కేవలం రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కొద్ది సేపు ఘర్షణ గురించి ప్రకటన చేయడం తప్పితే ఎటువంటి స్పందన వెలువడలేదు. దీనితో విపక్షాలు వాకౌట్‌కు దిగాయి. ప్రశ్నోత్తరాల సమయం కాగానే లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఇండో చైనా సరిహద్దు ఘర్షణపై చర్చ జరగాల్సి ఉందని, 1962 భారత్ చైనా యుద్ధం దశలో చర్చ జరిగిన విషయాన్ని ప్రభుత్వం తెలుసుకుంటే మంచిదని సూచించారు.

ఈ సభలోనే అప్పటి యుద్ధంపై పండిట్ నెహ్రూ చర్చకు వీలు కల్పించారని, 165 మంది ఎంపీలు మాట్లాడేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. సభ అభిప్రాయం తీసుకున్న తరువాత ఏమి చేయాలనేది నిర్ణయించుకున్న రికార్డు ఉందని గుర్తు చేశారు. అయితే నిబంధనలు అందుకు అనుమించడం లేదని, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఎసి)లోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని, సభ నిర్వహణకు అడ్డుతగలడం మంచిది కాదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభలో ఈ అంశంపై చర్చ జరగాల్సి ఉందని టిఎంసి సభ్యులు సుదీప్ బందోపాధ్యాయ్ తెలిపారు. చైనా సైనికులు భారతీయ జవాన్ల ఘర్షణను ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News