11వ విడత సైనిక స్థాయి చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, దేప్‌సంగ్ తదితర కీలక ప్రదేశాలలో నిస్సైనికీకరణకు సంబంధించి భారత్, చైనా మధ్య 11వ విడత సైనిక స్థాయి చర్చలు శుక్రవారం జరిగినట్లు సంబంధిత శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్ భూభాగానికి చెందిన తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద గల చుషూల్ సరిహద్దు పాయింట్ వద్ద శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 11వ విడత కాప్స్ కమాండర్ స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయని వారు చెప్పారు.
పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డు నుంచి సైనిక బలగాలు, ఆయుధాలను ఉపసంహరించుకోవాలని ఉభయ సైనిక దళాలు ఒక ఒప్పందానికి వచ్చిన రెండు రోజుల అనంతరం ఫిబ్రవరి 20న 10వ విడత చర్చలు జరిగినట్లు వారు తెలిపారు. శుక్రవారం జరిగిన చర్చలలో భారత ప్రతినిధి బృందానికి లెఫ్టినెంట్ జనరల్ పిజికె మీనన్ సారథ్యం వహించారు. సాధ్యమైనంత త్వరలో తూర్పు లడఖ్‌లోని మిగిలిన పాయింట్లలో కూడా నిస్సైనికీకరణ పూర్తి కావడంపై భారత్ చైనాపై ఒత్తిడి తీసుకువస్తుందని వర్గాలు తెలిపాయి.