న్యూఢిల్లీ: భారత్- చైనా మధ్య 10వ దఫా సైనిక స్థాయి సంప్రదింపులు శనివారం జరిగాయి. ఈస్టర్న్ లద్ధాఖ్ ప్రాంతంలో మరింత సైనిక ఉపసంహరణ దిశలో ఈ చర్చలు తలపెట్టారు. సరిహద్దుల్లోని దళాల ప్రధానాధికారుల స్థాయిలో ఇప్పటి చర్చలు సాగాయి. దీనితో ఈ ప్రాంతంలో సైనిక బలగాలు, ఆయుధాలు, మిలిటరీహార్డ్‌వేర్ వెనకకు వెళ్లేందుకు మార్గం మరింత సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దుల్లో భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్యాంగాంగ్ సరస్సు వెంబడి ఇరుపక్షాల సేనలు వెనకకు వెళ్లడం ఇటీవలే పూర్తయింది. శాంతి సామరస్య చర్చలలో అంతర్భాగంగా చేపట్టిన సైనిక ఉపసంహరణ సజావుగానే సాగుతోంది. సరస్సు ప్రాంతంలో తాము ఏర్పాటు చేసుకున్న పలు బంకర్లను చైనా బలగాలు ధ్వంసం చేసి, నిర్మూలించాయి. తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, దెస్పాంగ్ పరిసరాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు ఇక్కడ నిస్సైనీకరణ మార్గమని ఇరు పక్షాలు గుర్తించాయి. ఈ దశలో కార్ప్ కమాండర్ల స్థాయి చర్చల ప్రక్రియ సాగింది. సరిహద్దులలో ఉద్రిక్తతల నివారణకు చేపట్టాల్సిన కార్యాచరణకు అనుగుణంగానే ఇరుపక్షాల సేనలు వ్యవహరిస్తూ ఉండటంతో ఇప్పటి చర్చల మరింత ఫలవంతం అయ్యే దిశలో ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భూభాగంలోని మోల్డో సరిహద్దు స్థావరంలో ఉదయం 10 గంటలకు ఆరంభం అయిన చర్చలు సుదీర్ఘంగా సాగాయి.
India-China Tenth Round Talks