Thursday, September 19, 2024

భారత్-చైనా హింసాత్మక ఘర్షణ

- Advertisement -
- Advertisement -

India-China Violent Border Clash

 కల్నల్ సహా 20 మంది మృతి
పరస్పరం బాహాబాహీ
అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి
పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష
45 ఏళ్ల తరువాత జగడం
చైనా సైనికులు ఆరుగురు మృతి?

న్యూఢిల్లీ/లడఖ్: భారత్‌-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న తరుణంలో ఈస్ట్రన్ లడఖ్ ప్రాంతంలోని గాల్వన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఇరు పక్షాల సైనికులు తొలుత కవ్వింపులకు దిగారు. ఆ తర్వాత అది బాహాబాహీగామారింది. ఈ క్రమంలో ఒక కల్నల్ సహా 20 మంది భారత జవాన్లు మృతి చెందారు. ప్రభుత్వ వర్గాలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. చైనా వైపు కూడా దాదాపు 43 మంది దాకా సైనికులు మృతి చెందడం లేదా తీవ్రంగా గాయపడినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా పక్షం ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించడంతో ఈ ఘర్షణలు తలెత్తినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇరు పక్షాల మధ్య ఐదువారాలుగా సాగుతోన్న సరిహద్దు వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది.

అయితే ఇటీవలే లెఫ్టినెంట్ జనరల్స్, కల్నల్స్ స్థాయిలో జరిగిన చర్చల దశలో పరిస్థితి సద్దుమణిగిందని భావించారు. ఇరుపక్షాలు వెనక్కి తగ్గే దశలో, ప్రశాంత చర్యల నేపథ్యంలోనే, ప్రత్యేకించి అదనపు బలగాలు వెనకకు వెళ్లుతున్న దశలో పరస్పర కవ్వింపులు జరిగినట్లు, ఇవి ఘర్షణకు దారితీసినట్లు వెల్లడైంది. సరిహద్దులలో ఇటువంటి ఘర్షణలు చివరికి సైనికుల ప్రాణాలను బలిగొన్న ఘటన 45 ఏండ్ల తరువాత జరిగింది. తూర్పు లద్దాఖ్‌లో జరిగిన ఘర్షణ, ముగ్గురు సైనికులు మృతి చెందడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే స్పందించారు. రక్షణ బలగాల అత్యున్నత అధికారి జనరల్ బిపిన్ రావత్‌తో, త్రివిధ సైనిక బలగాల అధిపతులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిని, ఉద్రిక్తతల సడలింపు చర్యలు, దౌత్యపరంగా తీసుకోవల్సిన పద్ధతుల గురించి ఈ అత్యున్నత స్థాయి హుటాహుటి భేటీలో సమీక్షించినట్లు ఆ తరువాత సైనిక వర్గాలు తెలిపాయి.

ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె మంగళవారం ఢిల్లీ వెలుపల ఓ సైనిక స్ధావరానికి వెళ్లాల్సి ఉంది. అయితే దీనిని రద్దు చేసుకుని, సరిహద్దులలో పరిస్థితిని సమీక్షించారు. అంతా ప్రశాంతంగానే ఉందని, ఎప్పటికప్పుడు తగు విధంగా పరిస్థితిని గమనిస్తున్నట్లు వెల్లడించారు. చైనా వైపు కూడా ప్రాణనష్టం జరిగిందని, అయితే ఎందరు సైనికులు చనిపొయ్యారనేది తెలియదని భారత సైనిక వర్గాలు తరువాత వెలువరించిన ప్రకటనలో తెలిపాయి. భారత సైన్యమే ఘర్షణకు దిగిందని, ఈ క్రమంలో తమ సైన్యానికి చెందిన ఐదుగురు సైనికులు చనిపొయ్యారని చైనా ఆర్మీ పిఎల్‌ఎ వర్గాలు తెలిపాయి. ఇప్పటి ఘటన వంటిది ఇంతకు ముందు 1975లో జరిగింది. అప్పట్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తులుంగ్ లా వద్ద జరిగిన దాడిలో నలుగురు భారతీయ జవాన్లు మృతి చెందారు. ఇరు పక్షాల మధ్య సోమవారం రాత్రి ఎటువంటి కాల్పులు జరగలేదని, కేవలం ఘర్షణలు జరిగాయని అధికార వర్గాలు ఢిల్లీలో తెలిపాయి.

ఘర్షణలో మృతి చెందిన సైనిక అధికారి గాల్వాన్ లోయ ప్రాంతపు సైనిక దళం కమాండర్ అని వెల్లడైంది. చైనా సైనికులు రాళ్లు రువ్విన ఘటనలోనే సైనికులు మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటనలో ప్రస్తావించలేదు. కేవలం ఈ ప్రాంతంలో ఘర్షణ జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. సరిహద్దులలో ఐదువారాలుగా ఇరు పక్షాల మధ్య క్షేత్రస్థాయిలో ఉద్రిక్తత సాగుతూ వస్తోంది. అయితే సంప్రదింపుల ప్రక్రియలో అంతా సద్దుమణిగినట్లు ఢిల్లీలో అత్యున్నత స్థాయి సైనిక వర్గాలు ప్రకటించిన విషయంలో నిజానిజాలు సరిగ్గా లేవనేది సరిహద్దులలో ప్రస్తుత పరిణామంతో వెల్లడైందని పరిశీలకులు తెలిపారు. గాల్వాన్ వ్యాలీ నుంచి సైన్యం ఉపసంహరణ జరుగుతోందని ఇటీవలే ఆర్మీ చీఫ్ ప్రకటించారు. దశలవారిగా సైనిక ఉపసంహరణకు చర్యలు తీసుకుంటున్నట్లు శనివారమే తెలిపారు.

కల్నల్ సూర్యాపేట వాసి

దాడిలో బలి అయిన కల్నల్ తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సంతోష్‌కుమార్ అని వెల్లడైంది. చైనా సైనికుల చర్యలో బి సంతోష్‌కుమార్ మృతి చెందడంపై తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో సంతాపం వ్యక్తం అయిం ది. పలుచోట్ల ఆయనకు నివాళులు అర్పించారు. దాడిలో మృతి చెందిన ఇద్దరు సైనికుల పేర్లు వెల్లడికాలేదు.

భారత్ సైనికులే దాడికి దిగారు : చైనా

భారత సైనికులే తమ భూభాగంలోకి చొరబడ్డారని దీనితోనే ఘర్షణలు చెలరేగాయని చైనా అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. భారతీయ సైన్యం అతిక్రమణలకు పాల్పడిందని పేర్కొంటూ చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వార్తలు వెలువరించింది. సోమవారం రాత్రి భారత సైనికులు అక్రమ చర్యలకు పాల్పడ్డారని దీనితో ఇక్కడ ఘర్షణ జరిగిందని, ప్రస్తుత పరిస్థితికి భారత సైనికులే కారణం అని బీజింగ్‌లో చైనా ప్రతినిధి ఒకరు తెలిపారు.

దూకుడు భారత్‌దే : చైనా విదేశాంగ మంత్రి

బీజింగ్ : సరిహద్దుల్లో పరిస్థితిని భారతదేశమే దిగజారుస్తోందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి స్పందించారు. ఏకపక్షంగా హద్దులు దాటి వస్తున్నారని, దీనితో ఘర్షణ చెలరేగిందని సోమవారం నాటి ఘటనపై చైనా అధికారికంగా తమ ప్రకటనలో తెలిపింది. కవ్వింపులతో పరిస్థితిని సంక్లిష్టం చేసుకోవద్దని భారత్‌ను చైనా అధికారికంగా హెచ్చరించింది. సరిహద్దులు దాటవద్దని సమగ్ర నిర్ణయం తీసుకున్నామని, అయితే దీనిని ఉల్లంఘించి భారత సైనికులు తమ సైనికులను రెచ్చగొట్టారని వాస్తవాధీన రేఖ వెంబడి వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు దేశాల నాయకత్వ పరిధిలో నిర్ణయించిన విషయాన్ని తాము తెలియచేస్తున్నట్లు చైనా అధికార ప్రతినిధి తెలిపినట్లు అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. సామరస్యం కోసం తాము ప్రయత్నిస్తున్నామని, అయితే ప్రస్తుత పరిణామం ఇందుకు విరుద్ధంగా ఉందని చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నట్లు పత్రిక పేర్కొంది.

India-China Violent Border Clash

2019 లెక్క ప్రకారం  వివిధ దేశాల సైనిక బలగాలు

చైనా                       2,183,000
భారత్                     1,362,500
అమెరికా                  1,281,900
ఉత్తరకొరియా             1,280,000
రష్యా                      1,013,628
పాకిస్థాన్                     654,000
దక్షిణకొరియా                 625,000
ఇరాన్                         523,000

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News