Wednesday, January 22, 2025

మళ్ళీ ఘర్షణలు!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: భారత చైనాల మధ్య వాస్తవాధీన రేఖ మళ్ళీ ఉద్రిక్తం అయింది. రెండేళ్ళ క్రితం లడఖ్ వద్ద గాల్వాన్ లోయలో సంభవించినంత తీవ్రమైనవి కానప్పటికీ రెండు దేశాల సైన్యాల మధ్య తిరిగి ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లోని తవాంగ్ సెక్టార్‌లో మొన్న 9వ తేదీ నాడు చైనా దళాలు ముందుకు రాగా భారత సేనలు అడ్డుకున్నాయని ఈ ఘర్షణల్లో రెండు వైపులా గాయపడ్డారని మన సైన్యం సమాచారం అందించింది. తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్‌త్సె ప్రాంతంలో ఈ ఘర్షణలు సంభవించాయి. ఇందులో గాయపడిన ఆరుగురు భారత సైనికులను గౌహతికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఈ సమాచారం తెలియజేసింది.

200 మంది చైనా సైనికులు ఇనుప ముళ్ళ రాడ్లు, కర్రలతో యాంగ్‌త్సె వద్దకు రాగా వారిని భారత సైనికులు అడ్డుకున్నారు. 2020 జూన్‌లో తూర్పు సెక్టార్‌లోని గాల్వాన్ లోయలో ఇదే మాదిరిగా తలపడినప్పుడు మన కల్నల్ సంతోష బాబు సహా 20 మంది భారత సైనికులు మృతి చెందారు. చైనా సైనికులు కూడా పెక్కు మంది మరణించారు. ఆ తర్వాత రెండు దేశాల సైనిక కమాండర్ల స్థాయిలో 16 రౌండ్ల చర్చలు జరిగాయి. అయినా పూర్తి యథాపూర్వ స్థితికి ఉపసంహరణలు జరగలేదు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే అది సాధ్యమైంది. ఆనాటి పరిస్థితే ఇంకా చక్కబడని నేపథ్యంలో తవాంగ్ సెక్టార్‌లో తాజా ఘర్షణలు సంభవించడం రెండు దేశాల మధ్య దూరం మరింత పెరిగిందని రుజువు చేస్తున్నది.

ఈ సెక్టార్‌లో ఉమ్మడి వాస్తవాధీన రేఖ లేదు. ఎవరికి వారు తమ వాస్తవాధీన రేఖను పాటిస్తున్నారు. భారత, ఆమెరికా సైనిక విన్యాసాలు ఇటీవల ఉత్తరాఖండ్‌లో చైనాతో గల వాస్తవాధీన రేఖకు 100 కి.మీ లోపల మన భూభాగంలో జరిగాయి. అందుకు చైనా అభ్యంతరం తెలిపింది. తనకు ఇండియాకు మధ్య తలదూర్చ వద్దని అమెరికాను హెచ్చరించింది. ఈ విన్యాసాలు తాను భారత దేశంతో 1993 నుంచి 1996 వరకు కుదుర్చుకొన్న ఒప్పందాలకు విరుద్ధమని ఆరోపించింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. తాము ఇతర దేశాలతో కలిసి చేసే సైనిక విన్యాసాలపై వేరే ఏ దేశానికీ వీటో అధికారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఆనాటి ఒప్పందాలను చైనాయే ఉల్లంఘించిందని తెలియజేసింది. 1993 ఒప్పందం భారత చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ పొడుగునా శాంతి, సామరస్యాలను కాపాడడానికి ఉద్దేశించినది.

అక్కడ సైనిక రంగంలో పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకునే చర్యలను 1996 ఒప్పందం నిర్దేశిస్తున్నది. ఈ ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో మంగళవారం నాడు ప్రకటన చేశారు. 9వ తేదీన యాంగ్‌త్సె వద్ద వాస్తవాధీన రేఖను ఉల్లంఘించి యథాతథ స్థితిని మార్చడానికి చైనా సేనలు ప్రయత్నించాయని, మన సైన్యం దృఢ చిత్తంతో ఎదుర్కొన్నదని దానితో చైనా సేనలు తమ స్థానాలకు మళ్ళక తప్పలేదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. భారత సైనికులు సకాలంలో తిప్పికొట్టడం వల్ల అవతలి వారు వెనక్కి వెళ్ళారని వివరించారు. మన సైనికులకు తీవ్ర గాయాలు కాలేదని కూడా తెలియజేశారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలను కాపాడాలని చైనాకు చెప్పామని తాజా ఘర్షణల గురించి దౌత్య మార్గాల్లో చైనాతో చర్చించామని వెల్లడించారు. మన ప్రాదేశిక సమగ్రతను కాపాడడానికి మన సైనికులు నిబద్ధులై వున్నారని చైనా నుంచి ఎదురయ్యే ఎటువంటి దుస్సాహసాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారని ఆయన పార్లమెంటుకు హామీ ఇచ్చారు.

భారత చైనాల మధ్య 3488 కి.మీ నిడివి సరిహద్దు వుంది. హిమాలయాల్లోని 9000 నుంచి 18700 అడుగుల ఎత్తులో కూడా నెలకొని వున్నది. అయితే ఉభయ దేశాల మధ్య భిన్నాభిప్రాయాల కారణంగా ఈ సరిహద్దు రేఖను స్పష్టంగా గీయడం, నిర్వచించడం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. బ్రిటిష్ వలస పాలకులు గీచిన మెక్‌మహన్ రేఖను సరిహద్దుగా చైనా అంగీకరించడం లేదు. పర్యవసానంగా 1962లో యుద్ధం సంభవించింది. అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ దాదాపు ప్రశాంతంగానే కొనసాగుతూ వచ్చింది. 2020 జూన్ నాటి ఘర్షణలతో ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. చైనా వాస్తవాధీన రేఖ పొడుగునా సైన్యాల మోహరింపును, రోడ్ల విస్తరణను కొనసాగిస్తున్నది. అందుకు దీటుగా మన ప్రభుత్వం కూడా సైనిక విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన చర్యలను చేపట్టింది. 2020 ఘర్షణల్లో భారత భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా చైనా ఆక్రమించలేదని అప్పట్లో ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటించారు. వాస్తవంలో 4060 చదరపు కి.మీ ప్రాంతం చైనా ఆక్రమణలోకి వెళ్ళిందని భావిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో కొంత భాగం తనదని చైనా వాదిస్తున్నది. ఇరుగుపొరుగునున్న ఈ రెండు అతి పెద్ద, అత్యంత జనాభా కలిగిన దేశాల మధ్య విభేదాల పరిష్కారం ప్రపంచ శాంతికి, పురోగతికి ఎంతో అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News