Wednesday, January 22, 2025

మోడీలో ‘ఇండియా’ ఆందోళన

- Advertisement -
- Advertisement -

దేశ రాజకీయాల్లో ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ ఏర్పాటుతో ప్రధాని మోడీ ఆందోళన చెందుతునట్టు కనిపిస్తోంది. పాట్నా, బెంగళూరులో ప్రతిపక్షాల భేటీ విజయవంతం కావడంతో పాటు కూటమిలోని పార్టీలన్నీ ప్రస్తుత వర్షాకాల సమావేశంలో మణిపూర్‌లో హింసపై కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వాని నిలదీస్తుండడంతో మోడీలో ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలతో బిజెపి ప్రభుత్వం ఒత్తిడికి లోనవుతోందని, మోడీ జంకుతున్నారనేందుకు నిదర్శనం ఆయన ‘ఇండియా’ కూటమిని ఇండియన్ ముజాహిదీన్, ఈస్ట్ ఇండియా కంపెనీలతో పోల్చడమే అని బీహార్ సిఎం నితీశ్‌కుమార్ వ్యాఖ్యానించారు.

మణిపూర్‌లో అల్లర్లు ప్రారంభమైన రెండున్నర నెలల తర్వాత మోడీ మౌనాని వీడారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ఈ అంశంపై మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తుంటే ఆయన పార్లమెంట్ అవతల మాట్లాడుతూ మణిపూర్‌లో కుకీ మహిళలపై జరిగిన అరాచక ఘటనను ఖండిస్తూనే దాన్ని చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలతో ముడిపెట్టడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆగ్రహం మరింత రెట్టింపయ్యింది. దీంతో ‘ఇండియా’ కూటమిలోని పార్టీలు సభను రోజూ అడ్డుకుంటూ ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసిచ్చారు.

మణిపూర్‌పై మోడీ మౌనం వీడి ఉభయ సభల్లో ప్రకటన చేయాలనేదేవారి ప్రధాన లక్ష్యం. మోడీ మణిపూర్‌పై పార్లమెంట్‌లో చర్చించకుండా భయంతో ప్రతిపక్ష కూటమిని ముజాహిదీన్, బ్రిటిష్ ఇండియా కంపెనీలతో పోలుస్తున్నారని నితీశ్ విమర్శిస్తున్నారు. మోడీ ఆందోళనకు రెండు కారణాలను ‘ఇండియా’ కూటమి నేతలు చెబుతున్నారు. దేశాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఎదుర్కోవడంలో ప్రభుత్వ అసమర్థత ఒకటి కాగా, రెండోది కేంద్రంలోని బిజెపి సర్కారుకు, ఆ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు అవినీతి పాలన అనే ముద్రపడడం. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసను అదుపు చేయడంలో బిజెపి ప్రభుత్వం విఫలం అయింది. ప్రధానంగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ అత్యాచారం చేసిన ఘటన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం ప్రతిష్ఠ దిగజారడంతో పాటు మోడీ అసమర్థతకు నిదర్శంగా నిలిచిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అల్లర్లు అదుపు చేయడంలో బిజెపి సిఎం బీరేన్ సింగ్ వైఫల్యం చెందడంతో దేశ వ్యాప్తంగా ఊదరగొట్టే బిజెపి నినాదం ‘డబుల్ ఇంజిన్ సర్కారు’ పట్టాలు తప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు ఈశాన్య ప్రాంతాల్లో ప్రధానంగా మణిపూర్‌లో మెజార్టీ మెయితీలు, మైనారిటీ కుకీల మధ్య వైషమ్యాల రాజకీయాలు నడిపిస్తున్న బిజెపి ప్రభుత్వం అసమర్థతను ఎండగట్టడంలో ఈ ప్రాంతాల్లో చురుకుగా పని చేస్తున్న మానవ హక్కుల సంస్థలు, పౌరహక్కుల కార్యకర్తలు, ప్రజా మేధావులు సఫలీకృతమయ్యారు. మణిపూర్‌లో వీడియో వైరల్ కావడంతో జాతుల మధ్య వైరంతో పబ్బం గడుపుకోవాలనే బిజెపి వ్యూహం బెడిసికొట్టింది. ఈ వీడియో ఘటనకు సంబంధించి బాధిత మహిళలు మాట్లాడుతూ ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీరేన్ సింగ్ ప్రభుత్వం కుకీలపై వివక్షచూపిస్తూ మెయితీలకు అనుకూలంగా ఉందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తుండడంతో దేశవ్యాప్తంగా బిజెపిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ధరల పెరుగుదల, నిరుద్యోగం, 2022 నాటికి అందరికీ ఇళ్లు ఇస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీలు విఫలం కావడంతో దేశంలో నిరుద్యోగంతో పాటు పేదరికం పెరగడంతో ‘అచ్ఛేదిన్’ అని భ్రమలు కల్పిస్తూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రభుత్వాలను పడగొట్టడంతో పాటు అవినీతి పాలన కూడా బిజెపి కి వ్యతిరేకంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్‌థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి ధనబలాన్ని ప్రయోగించిందనే విమర్శ దేశవ్యాప్తంగా ప్రచారం అయింది. ఉద్ధవ్ ప్రభుత్వాన్ని దించివేసిన తీరును ‘చట్టవిరుద్ధం’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తర్వాత కూడా బిజెపి ఎన్‌సిపిలో చీలిక తెచ్చి అజిత్ పవార్‌తో సహా మరో ఎనిమిది మంది ఎంఎల్‌ఎలను ఏక్‌నాథ్ షిండే మంత్రి వర్గంలో చేర్చుకోవడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అనే భావన కలుగుతోంది. సిబిఐ, ఇడి, ఐటి విచారణలను ఎదుర్కొంటున్న నేతలతో ‘ఇండియా’ కూటమి ఏర్పాటైందని, అది ‘అవినీతి నేతల కూటమి’ అని బిజెపి విమర్శలు గుప్పిస్తోంది. ఇదే సమయంలో దేశంలో తూర్పు నుండి పశ్చిమం వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు వివిధ రాష్ట్రాల్లో పలువురు బిజెపి నేతలు అవినీతికి సంబంధించి విచారణలు ఎదుర్కొంటుండడం గమనార్హం. అవినీతి ఆరోపణలున్న ఇతర పార్టీల్లోని నేతలు బిజెపిలో చేరితే వారు నీతిమంతులవుతారా అనే విమర్శలున్నాయి. 2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన బిజెపిపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు వస్తుండడం నష్టం చేకూర్చవచ్చనే ఆందోళన బిజెపి అగ్రనేతల్లో ఉంది.

‘ఇండియా’ కూటమి దేశం కోసం, దేశ ప్రజల కోసం ఏర్పాటైందని, సీట్ల పంపకంపై ఒక విధానాన్ని త్వరలో ప్రకటిస్తామని బీహార్ సిఎం నితీశ్ తెలిపారు. ఎన్నికల్లో గెలుపుకి గణాంకాలు మాత్రమే సరిపోవని, రాజకీయ సమీకరణాలు కూడా ప్రధానమని ‘ఇండియా’ గుర్తించిందని నితీశ్ చెబుతున్నారు. 2019 ఎన్నికల గణాంకాలు, రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే ఎన్‌డిఎ, జెడి(యు) కూటమి బీహార్‌లోని 40 స్థానాల్లో ఒకటి మినహా 39 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్జీ కూటమికి గణాంకాలు అనుకూలంగానే ఉన్నా ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. గణాంకాల ప్రకారం బిజెపి 40, 50 సీట్లు కోల్పోవాల్సి ఉండేది. అయితే ఇక్కడ రాజకీయ సమీకరణాల అనుకూలతతో కాషాయ పార్టీ 65 సీట్లు గెలవడం గమనార్హం. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో పాటు రాహుల్ గాంధీ పాదయాత్రతో ‘ఇండియా’ కూటమి వ్యూహకర్తలు గణాంకాలతో పాటు రాజకీయ సమీకరణాలపై దృష్టి పెట్టారు. రాజకీయ సమీకరణాలకు సంబంధించి ‘ఇండియా’ కూటమిలోని పార్టీలు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య 2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో వేచి చూడాలి.

ఐ.వి. మురళీకృష్ణ శర్మ- (peoplespulse.hyd@gmail.com)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News