అమెరికాలో నివసిస్తున్న ఖలిస్థాన్ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నున్‌ను హత్య చేయించడానికి ఇండియా కుట్ర పన్నిందన్న అభియోగం బలం పుంజుకొంటున్నది. ఇది అమెరికాతో మన సంబంధాలను దెబ్బ తీయకపోవచ్చు గాని విదేశాల్లో ఇండియా ప్రతిష్ఠను మసకబారించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయం కొద్ది రోజుల క్రితం బయటకు పొక్కినప్పటి కంటే ఇప్పుడు స్పష్టమైన రూపురేఖలను సంతరించుకొన్నది. ఇందుకు సంబంధించి నిఖిల్ గుప్తా అనే భారతీయుడిపై న్యూయార్క్ కోర్టులో అమెరికా కేసు దాఖలు చేసింది. పన్నున్ హత్యకు కిరాయి హంతకుడిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడని నిఖిల్ గుప్తాపై అందులో అభియోగం నమోదు చేశారు. అందుకోసం లక్ష అమెరికన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధపడి అడ్వాన్స్‌గా 15000 డాలర్లు ముట్టజెప్పినట్టు ఆ అభియోగ పత్రంలో ఆరోపించినట్టు వార్తలు చెబుతున్నాయి. పన్నున్ వ్యక్తిగత సమాచారం, ఫోన్ నంబర్లు వగైరాలను గుప్తా సమర్పించినట్టు అందులో పేర్కొన్నారు. తాము చాలా మంది సిక్కు టెర్రరిస్టులను హతమార్చాలనుకొంటున్నామని కెనడాలో హత్యకు గురైన హర్దీప్ సింగ్ నిజ్జార్ సైతం తమ హిట్ లిస్టులోనివాడేనని గుప్తా తాను సంబంధాలు పెట్టుకొన్న కిరాయి హంతకుడికి చెప్పినట్టు పేర్కొన్నారు.
అయితే ఎవరినైతే పన్నున్ హత్య కోసం నిఖిల్ గుప్తా ఎంచుకొన్నాడో ఆ వ్యక్తి అమెరికా అధికారులతో సంబంధాలు వున్నవాడేనని చెబుతున్నారు. ఈ కేసు ఇంత తొందరలోనే ఇంత స్పష్టమైన రూపు తీసుకోడంతో భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని నియమించినట్టు వార్తలు చెబుతున్నాయి. అమెరికాలోని ఖలిస్థానీయుడి హత్య ప్రయత్నం కేసులో భారత అధికారి హస్తమున్నదని ఎత్తి చూపడం చాలా ఆందోళనకరమైన విషయమని గురువారం నాడు మన విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. హతమార్చడమనేది తమ విధానం కానే కాదని భారత ప్రభుత్వం ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేసింది. పన్నున్ కేసు మలుపులు తిరుగుతుండడంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరొకసారి రంగ ప్రవేశం చేశారు. నిజ్జార్ హత్య విషయంలో ఇండియాను దోషిగా చూపుతూ తమ పార్లమెంటులో తాను చేసిన ప్రకటన లోపరహితమైనదని చెప్పుకొన్నారు. నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వ పాత్రపై అమెరికాతో కలిసి గత ఆగస్టు నుంచి తాము శోధిస్తున్నామని ట్రూడో ఆ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికైనా ఇండియా తమతో కలిసి నిజ్జార్ హత్య కుట్రను ఛేదించడానికి తోడ్పడాలని ట్రూడో అభిప్రాయపడ్డారు. పన్నున్ హత్య బాధ్యతను నిఖిల్ గుప్తా అమెరికాలో ఎవరికి అప్పగించాడో ఆ వ్యక్తి పేరు ఇంత వరకు బయటపెట్టకపోడం గమనించవలసిన విషయం.
కెనడా కూడా నిజ్జార్ హత్య విషయంలో భారత పాత్రను నిరూపించడానికి ఉపయోగపడే సాక్షాలను ఇంత వరకు బయటపెట్టలేదు. అమెరికా సైతం అటువంటి అభియోగం చేయడం ఒక్కటే ట్రూడో తన ఆరోపణకు ఆధారంగా తీసుకొంటున్నట్టు అర్థమవుతున్నది. టెర్రరిస్టులైనప్పటికీ ఇతర దేశాల్లో నివసిస్తున్నప్పుడు వారిని హతమార్చేందుకు ఒక ప్రభుత్వం ప్రయత్నించడం అంతర్జాతీయ మర్యాదలకు విరుద్ధం. అక్కడి ప్రభుత్వాలు సహకరిస్తే తప్ప వారిని శిక్షించడం సాధ్యమయ్యే పని కాదు. అందుచేతనే మన దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడే వారు విదేశాలకు పారిపోయి అక్కడ సురక్షితంగా బతకగలుగుతున్నారు.వారిని శిక్షించాలంటే తమకు అప్పగించాల్సిందిగా ఆయా దేశాలకు విజ్ఞప్తి చేయడం మినహా మార్గం లేదు. అలా తమ తమ దేశాల్లో నేరాలకు పాల్పడి పారిపోయిన వారిని తిరిగి అప్పగించుకొనేలా ప్రతి రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదుర్చుకోడం జరుగుతుంది. ఈ రాజమార్గాన్ని పాటించకుండా దొడ్డి దారిలో ఏ దేశ ప్రభుత్వమైనా ఇతర దేశాల్లోని తమ శత్రువులైన టెర్రరిస్టులను చంపించడానికి సాహసించదు. ఇందులో అమెరికాకు మాత్రం మినహాయింపులుంటాయి. తాను పగబట్టిన ఏ వ్యక్తినైనా ప్రపంచంలో ఎక్కడ వున్నా అక్కడి ప్రభుత్వాలకు కూడా చెప్పకుండా నేరుగా అంతం చేసే తెగువకు అమెరికా తరచూ పాల్పడడం మనకు తెలుసు.
అదేమంటే ఆ వ్యక్తి ఉగ్రవాది అని, మానవాళికే శత్రువని ముద్ర వేస్తుంది. పన్నున్ వ్యవహారంలో అమెరికా మనను వేలెత్తి చూపడం బాధాకరమైన పరిణామమే. పన్నున్ హత్య కుట్రలో భారత ప్రభుత్వ హస్తం ఆరోపణ గురించి జి20 సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రధాని మోడీతో ప్రస్తావించినట్టు ప్రచారం జరుగుతున్నది. అలాగే ఈ విషయం లోతులు తెలుసుకోడానికి ఇండియా వెళ్ళవలసిందిగా సిఐఎ డైరెక్టర్‌ను బైడెన్ ఆదేశించారన్న సమాచారమూ ప్రచారంలో వుంది. ఇది ప్రధాని మోడీ ప్రభుత్వ విదేశాంగ వ్యవహారాల నిర్వహణ తీరును బోనులో నిలబెడుతున్నది. మన వైపు నుంచి దర్యాప్తును సమగ్రంగా జరిపించి నిజానిజాలను వీలైనంత తొందరగా నిగ్గు తేల్చవలసి వుంది.