24 గంటల్లో 3,57,229 పాజిటివ్ కేసులు,3,449 మరణాలు
34.47 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు
1.66 కోట్ల మంది కోలుకున్నారు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం 3.5 లక్షలకు పైగా కేసులు, దాదాపు 3,500 మరణాలు సంభవిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,57,229 పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. క్రితం రోజు 3.68 వేల కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లను దాటింది. గడచిన 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 3,449 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 2,22,408కి చేరుకుంది. భారత్‌లో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,02,82,833కు చేరుకుంది. కాగా గడచిన 24 గంటల్లో 3,20,289 మంది కొవిడ్‌ను జయించగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1.66 కోట్లను దాటింది. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులున్నాయి. కాగా సోమవారం 16,63,742 శాంపిళ్లను పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 29,33,10,789కి చేరుకుంది. కాగా సోమవారం మహారాష్ట్రలో48,621 కొత్త కేసులు నమోదు కాగా, 567 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నాటకలో 44 వేలకు పైగా కేసులు, 239 మరణాలు సంభవించాయి. కాగా ఢిల్లీలో448 మంది, యుపిలో 285 మంది, చత్తీస్‌గఢ్‌లో 266 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు. మరో వైపు దేశంలో ఇప్పటివరకు 15,89,32,921 మంది టీకాలు తీసుకున్నారు.
వెంటిలేటర్, బెడ్ దొరక్క సోదరుడిని
కోల్పోయిన నటి పియా బాజ్‌పాయ్
యువ నటి పియా బాజ్‌పాయ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.చావు బతుకుల మధ్య ఉన్న తన సోదరుడ్ని ఆమె కాపాడుకోలేక పోయింది.‘ ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలోని కయంగంజ్ బ్లాక్‌లో నివసించే నా సోదరుడు చావు బతుతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతనికి అత్యవసరంగా వెంటిలేటర్,. బెడ్ కావాలి. వీటి ఏర్పాటుకు దయచేసి ఎవరైనా సాయం చేయండి’ అంటూ పియా ట్విట్టర్ ద్వారా వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఇది జరిగిన కొద్ది గంటలకే నా సోదరుడు ఇక లేడు’ అంటూ ఆమె మరో ట్వీట్ చేసింది. అయితే తన సోదరుడు కరోనాతో బాధపడుతున్నాడో లేదో ఆమె తెలియజేయలేదు.‘ నిన్ను కలిశాక’ సినిమాతో టాలీవేడ్‌కు పరిచయమైన పియా ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’,‘ దళం’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.