Thursday, December 26, 2024

దారి తప్పిన టీకా!

- Advertisement -
- Advertisement -

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2020 నాటికి ప్రతి పదింట ఏడు మరణాలు వ్యాధుల మూలంగానే సంభవిస్తాయంటూ ప్రముఖ అధ్యయన సంస్థ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 1996లోనే వెలువరించిన నివేదిక అక్షర సత్యమని గడచిన రెండు దశాబ్దాలను పరికించి చూస్తే అనిపించకమానదు. కొత్త సహస్రాబ్ది ఆరంభంలోనే మన దేశంలో సార్స్ మహమ్మారి వెలుగు చూస్తే, ఆ తర్వాత స్వైన్ ఫ్లూ, ఎబోలా, కోవిడ్ వంటి వైరల్ వ్యాధులు ముప్పేట దాడి చేశాయి. వీటన్నింటిలోకీ కోవిడ్ – 19 మనిషి మనుగడకు ప్రాణాంతకంగా పరిణమించింది. కరోనా వైరస్ గురించి మొదటిసారిగా 2019 డిసెంబర్‌లో ప్రపంచానికి తెలిసింది. అనతికాలంలోనే ఇది మారణహోమం సృష్టించింది. ఇప్పటి వరకూ కరోనా వైరస్ బారినపడి 70 లక్షల మంది అసువులు బాసినట్లు అంచనా. ఇప్పటికీ ఏదో ఓ మూల బయటపడుతున్న కోవిడ్ కేసులు.. కరోనా వైరస్ ఇంకా అంతరించిపోలేదనడానికి ప్రబల తార్కాణాలు. కోవిడ్- 19 బారినపడి కోలుకున్నవారిలో రోగ నిరోధకశక్తి సన్నగిల్లుతోందనీ, ఆటోఇమ్యూన్ వ్యాధులు, ఆర్థరైటిస్, ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారని మాత్రమే అందరికీ తెలుసు.

కానీ, పులి మీద పుట్రలా మానవజాతి వెన్నులో వణుకు పుట్టించే విషయం ఒకటి తాజాగా వెలుగు చూసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన విభాగమైన గ్లోబల్ వ్యాక్సీన్ డేటా నెట్‌వర్క్ నిర్వహించిన ఒక అధ్యయనంలో కోవిడ్ -19 వ్యాక్సీన్ల వల్ల 13 రకాల ఆరోగ్య సమస్యలు తీవ్రతరమైనట్లు వెల్లడైంది. తొమ్మిది దేశాల్లో 9.9 కోట్ల మందిపై జరిపిన ఈ విస్తృత అధ్యయనంలో వ్యాక్సీన్ గ్రహీతలు గుండె జబ్బులు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి వ్యాధులకు గురవుతున్నారని తేలడం కలవరం కలిగించే అంశం. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మాసూటికల్ కంపెనీలు రంగంలోకి దిగి వ్యాక్సీన్లు కనుగొనే ప్రక్రియలో పడ్డాయి. ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, మన దేశానికి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీ లాబ్స్ వంటివి ఆదరాబాదరా వ్యాక్సీన్లు రూపొందించి, మార్కెట్లోకి విడుదల చేశాయి. వ్యాక్సీన్ల పనితీరు, సమర్ధతపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు తగినంత సమయం లేకపోవడం వల్ల అప్పట్లో పలు వ్యాక్సీన్ల పనితీరుపై సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

వీటిలో కొన్ని వ్యాక్సీన్ల కారణంగా దుష్పరిణామాలు తలెత్తుతున్నట్లు తాజా అధ్యయనం లో వెల్లడైంది. ఫైజర్ -బయోఎన్టెక్, మోడెర్నాకు చెందిన వ్యాక్సీన్లను మూడు దశల్లో తీసుకున్నవారిలో ఎక్కువ మంది మయోకార్డిటిస్ (గుండె కండరాల వాపు)కు లోనవుతున్నారని బయటపడింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ మూడు డోసులు తీసుకున్నవారిలో పెరికార్డిటిస్ (గుండె వెలుపలి పొర వాపు) అనే జబ్బు వచ్చే ప్రమాదం 6.9% పెరిగినట్లు తేలింది. మోడెర్నా టీకాల నాలుగో మోతాదు తీసుకున్నవారిలోనూ గుండె జబ్బుల బెడద పెరిగినట్లు వెల్లడైంది. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్నవారు కండరాలను బలహీనపరిచే గులియన్ బారీ సిండ్రోమ్ అనే వ్యాధికి సైతం గురవుతున్నారట. గ్లోబల్ వ్యాక్సీన్ డేటా నెట్‌వర్క్ అధ్యయనం నిర్వహించిన తొమ్మిది దేశాల్లో భారతదేశం లేదు. అయితే ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్, మన దేశంలో తయారైన కోవిషీల్డ్ రెండూ ఒకటే కావడం ఆందోళనకు గురిచేసే విషయం. కరోనా వైరస్ నిరోధానికి భారతదేశంలో అధికంగా వినియోగించిన టీకాలు కోవాగ్జిన్, కోవీషీల్డ్. కోవిడ్ సమయంలో ఈ రెండింటి పనితీరుపైనా విమర్శలు వచ్చాయి. ఆస్ట్రాజెనెకా, కోవిషీల్డ్ వ్యాక్సీన్లను ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఆస్ట్రాజెనెకా వాడినవారిలో రక్తం గడ్డకడుతున్నట్లు వెల్లడికావడమే దీనికి కారణం. దీనిని బట్టి దాని తాలూకు ప్రభావం భారతీయులపైనా ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ కోవిడ్ టీకాలతో ఉన్న ప్రయోజనాలే అధికమని అధ్యయన సంస్థ చేసిన ముక్తాయింపులో వాస్తవం లేకపోలేదు. టీకాలు తీసుకున్నవారి కంటే తీసుకోనివారినే కరోనా వైరస్ కబళించిందన్నది మరువలేని వాస్తవం. అయితే టీకాల వల్ల కలుగుతున్న ఈ విపరిణామాల బారినుంచి బయటపడటమెలా అన్నదే ఇప్పుడు అందరి ముందూ ఉన్న ప్రధాన సమస్య. వ్యాక్సీన్ల తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న భారతదేశమే ఇందుకు నడుం బిగించవలసి ఉంటుంది. వ్యాక్సీన్ల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను అరికట్టేందుకు మరొక మేలైన ఔషధంతో ముందుకు వస్తే ప్రపంచ మానవాళి మన దేశానికి రుణపడి ఉంటుందనడంలో సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News