అవినీతిపై ప్రభుత్వాల పోరాటం ఎప్పుడు మొదలైందో తెలియదు గానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా, ఆ పోరాటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పుట్టలకొద్దీ వెలుగుచూస్తున్న అవినీతిపరుల బాగోతాన్ని చూస్తుంటే, మన నేతల చేతలు మాటలకే పరిమితమవుతున్నాయని అనిపించకమానదు. పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్న అవినీతిపరుల నిర్వాకాన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న వందకోట్ల అవినీతి తిమింగలాన్ని అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసిందన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పర్యవేక్షించిన ఓ ఉన్నతాధికారిపై ఎసిబి జరిపిన దాడుల్లో దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు బయటపడ్డాయి. సదరు మహాశయుడు భారీయెత్తున పొలాలు, విల్లాలు, నగానట్రా సమకూర్చుకున్నట్లు వెల్లడైంది. సోదాలు ఇంకా జరుగుతున్నందున ఈ ఆస్తుల విలువ ఎంతకు చేరుతుందో అంచనా వేయలేం.
ఈ కేసులో నిజానిజాలు ఎలా ఉన్నా, పత్రికల్లో వచ్చిన ఈ వ్యవహారాన్ని చూసి, ఈ దేశంలో అవినీతి ఎప్పుడు అంతమవుతుందోనని సామాన్య జనం నిట్టూర్పు విడిచి ఉండవచ్చు. కానీ, అవినీతికి చిరునామాగా మారిన రాజకీయ వ్యవస్థ మారనంతకాలం అవినీతిని దేశంనుంచి పారదోలడం అత్యాసే అవుతుందని మాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు. దేశంలో పెచ్చుమీరుతున్న అవినీతి గురించి సర్వోన్నత న్యాయస్థానం సైతం పలు సందర్భాల్లో ఆందోళన వెలిబుచ్చినా మన నాయకమ్మన్యులలో చలనం మాత్రం కలగడం లేదు. పటుతరమైన చట్టాలు చేసి, అవినీతిపై ఉక్కుపాదం మోపి అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయ నేతలే కాసులకు కక్కుర్తిపడి, దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. అవినీతిని అరికడతామంటూ ప్రతినలు పలికే నేతలు ఆచరణలో అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించడం దౌర్భాగ్యం కాక మరేమిటి? అవినీతి కేసులలో ఇరుక్కుని బెయిల్ పై బయటకు వచ్చినవారే అక్రమాలను అరికడతామంటూ ప్రగల్భాలు పలుకుతుంటే నమ్మడం ఎలాగంటూ సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే ఒక సందర్భంలో ఆక్రోశం వెలిబుచ్చారంటే రాజకీయాలు నైతికంగా ఎంతగా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు.
లోక్‌సభకు కొత్తగా ఎన్నికైనవారిలో 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆ మధ్య అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలడం ఇందుకు మరో ఉదాహరణ. ఆ మాటకొస్తే, అవినీతిని అరికట్టేందుకు మనకు ఉన్న సంస్థలు, చట్టాలు బోలెడు. అవినీతి నిరోధక శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలు, అవినీతి నిరోధక చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్, ప్రజావేగుల చట్టాలు, సమాచార హక్కు చట్టం వంటివి అనేకం ఉన్నా, అవినీతి అణువైనా తగ్గకపోవడానికి కారణాలు అనేకం. దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి అవినీతిపరులను గుర్తించి అరెస్టు చేస్తున్నా, ఆయా కేసులలో శిక్షపడుతున్నది కొద్దిమందికి మాత్రమేనంటే ఆశ్చర్యం కలుగకమానదు. చట్టాలలోని లొసుగులు, న్యాయస్థానాల్లో ఏళ్లూపూళ్లూ పడుతున్న విచారణ, సరైన సాక్ష్యాధారాలు చూపలేకపోవడం వంటివి ఇందుకు కొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే జనాభాతో కిటకిటలాడే ఆసియా దేశాలలో అవినీతి మరీ పెచ్చరిల్లిపోతోంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ర్యాంకుల్లో మొత్తం 180 దేశాల జాబితాలో భారత దేశానిది 96వ స్థానం. ఈ ర్యాంకు ఏ ఏటికాయేడు అంతకంతకు దిగజారిపోతూ ఉండటం మరీ సిగ్గుచేటు. ఇక పాకిస్తాన్ వంటి దేశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ట్రిలియన్ డాలర్లు అవినీతిపరుల ఖాతాల్లోకి చేరుతోందంటూ ఆ మధ్య ఐక్యరాజ్య సమితి సైతం ఆందోళన వెలిబుచ్చింది. అవినీతికి అడ్డుకట్ట వేయగలిగితే ప్రభుత్వాలకు మరింత ఆదాయం సమకూరుతుందనడంలోనూ, ప్రజల జీవితాలు మెరుగుపడతాయనడంలోనూ సందేహం లేదు.
అయితే పిల్లిమెడలో గంట ఎవరు కడతారన్నదే ప్రశ్న. అవినీతి నిర్మూలన ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. ప్రజలూ కీలక పాత్ర పోషించవలసిందే. అవినీతికి తాము దూరంగా ఉండటంతోపాటు అవినీతిపరులను ఎక్కడికక్కడ నిలదీయగలగాలి. ప్రజాచైతన్యం రగిలితే అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అదే సమయంలో ప్రభుత్వాలు చట్టాలలోని లొసుగులను సవరించి, చట్టాలను లోపరహితంగా రూపొందించాలి. అవినీతిపరులకు కఠిన శిక్షలు విధించేలా చట్టాలను సవరించాలి. ప్రభుత్వ కార్యకలాపాలను వీలైనంతవరకూ ఆన్‌లైన్ విధానం ద్వారా నిర్వహిస్తే అవినీతికి ఆస్కారం ఉండదు. బొగ్గు గనులను వేలం వేసేందుకు ఆన్‌లైన్ విధానం తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందన్న వాస్తవాన్ని విస్మరించకూడదు.