నిబంధనలు పాటించకుండా జనం గుమికూడితే కేసులు పెరుగుతాయి
డెల్టా వేరియంట్‌తోనూ ప్రమాదం పొంచివుంది
మినీ లాక్‌డౌన్‌లతో మేలు : ఎయిమ్స్ చీఫ్
న్యూఢిల్లీ : ‘కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కరోనా మొదటి వేవ్‌తో పోల్చితే రెండో వేవ్ తీవ్రంగా వ్యాపించి భయాందోళనలకు గురి చేసింది. ఈ పరిస్థితుల్లో దేశంలో థర్డ్‌వేవ్ ఐదు నుంచి ఎనిమిది వారాల్లో విరుచుకుపడే ప్రమాదం ఉంది’ అని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్‌లాక్ కారణంగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని దాంతో వైరస్ రూపాంతరం చెందుతూ ఉంటుందని చెప్పారు. హాట్‌స్పాట్లలో తగిన నిఘా అవసరమని సూచించారు. దేశం లోని జనాభాకు టీకాలు అందించడం, కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం తగ్గించడం సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు. కరోనా మొదటి, రెండు వేవ్‌ల నుంచి ఏం నేర్చుకున్నామో తెలుసుకోవాలన్నారు. రోజువారీ కేసులు 4 లక్షలు దాటిన సంఘటనలు కూడా అనుభవమయ్యాయని, రోజువారీ వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఉదహరించారు.
కానీ అనేక రాష్ట్రాలు అన్‌లాక్ చేయడంతో కనీస కొవిడ్ నిబంధనలు పాటించకుండా జనం మళ్లీ భారీగా గుమికూడుతున్నారని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. డెల్టా వేరియంట్ ప్రభావంతో కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని తెలియడంతో ఆయన పైవిధంగా హెచ్చరించారు,. సూక్ష్మస్థాయిలో యాజమాన్య పద్ధతులు (మైక్రోమేనేజ్‌మెంట్ ) అంటే మినీ లాక్‌డౌన్లు పద్ధతిని ప్రవేశ పెడితే కరోనా మూడోదశను చాలావరకు తగ్గించ వచ్చని సూచించారు. 5 శాతం కన్నా పాజిటివ్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ మినీ లాక్‌డౌన్లు పటిష్టంగా అమలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. హాట్‌స్పాట్‌ల్లో నిఘా పెంచాలని సూచించారు. సామూహిక టీకా కార్యక్రమం ముమ్మరం చేయాలని చెప్పారు.