రాణించిన దీప్తి, సత్తా చాటిన గోస్వామి, పూజా వస్త్రాకర్, ఆస్ట్రేలియా 143/4, భారత్‌తో గులాబీ టెస్టు సమరం
క్వీన్స్‌లాండ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అసాధారణ ఆటతో అలరిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. భారత బౌలర్లు జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్ అద్భుత బౌలింగ్‌తో ఆతిథ్య ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేశారు. ఓపెనర్ బెత్ మూనిను జులాన్ గోస్వామి అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేసింది. మూని 4 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగింది. అయితే తర్వాత వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్‌తో కలిసి మరో ఓపెనర్ అలీసా హీలీ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించింది. ఇద్దరు కలిసి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చాలా సేపటి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
కానీ 66 బంతుల్లో మూడు ఫోర్లతో 29 పరుగులు చేసిన హీలీని గోస్వామి వెనక్కి పంపింది. దీంతో ఆస్ట్రేలియా 63 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. కొద్ది సేపటికే కెప్టెన్ లానింగ్ కూడా వెనుదిరిగింది. 78 బంతుల్లో ఏడు ఫోర్లతో 38 పరుగులు చేసిన లానింగ్‌ను పూజా వస్త్రాకర్ ఔట్ చేసింది. కానీ తర్వాత వచ్చిన తాలియా మెక్‌గ్రాత్‌తో కలిసి ఎలిసే పెరీ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించింది. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. సమన్వయంతో ఆడుతూ చాలా సేపటి వరకు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.
అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని పూజా విడగొట్టింది. మెక్‌గ్రాత్ 68 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసి పూజా బౌలింగ్‌లో ఔటైంది. మరోవైపు పెరీ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించింది. అష్లే గార్డ్‌నర్‌తో కలిసి మరో మరో వికెట్ పడకుండానే మూడో రోజు ఆటను ముగించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పెరీ 98 బంతుల్లో మూడు ఫోర్లతో 27 పరుగులు చేసి క్రీజులో నిలిచింది. ఇక గార్డ్‌నర్ ఒక ఫోర్‌తో 13 పరుగులు చేసి నాటౌట్‌గా ఉంది. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 4 వికెట్ల నష్టానికి 143 పరుగులకు చేరింది. కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే ఆస్ట్రేలియా మరో 234 పరుగులు చేయాలి.
ఆదుకున్న దీప్తి..
అంతకుముందు మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు దీప్తి శర్మ అండగా నిలిచింది. వికెట్ కీపర్ తానియా భాటియాతో కలిసి దీప్తి స్కోరును ముందుకు నడిపించింది. ఇద్దరు సమన్వయంతో ఆడారు. దీప్తి తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించింది. తానియా ఆమెకు సహకారం అందించింది. ఇద్దరు కలిసి జట్టు స్కోరును 300 పరుగులు జోడించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన తానియా భాటియా మూడు ఫోర్లతో 22 పరుగులు చేసింది. మరోవైపు అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన దీప్తి శర్మ 167 బంతుల్లో 8 ఫోర్లతో 66 పరుగులు చేసి ఔటైంది. అయితే భారత్ స్కోరు 145 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 377 పరుగులుగా ఉన్నప్పుడు కెప్టెన్ మిథాలీ రాజ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. కాగా, తొలి రెండు రోజులు ఆటకు అంతరాయం కలిగించిన వరుణుడి జాడ మూడో రోజు కనిపించలేదు. దీంతో పూర్తి ఓవర్ల పాటు ఆట సాగింది.