న్యూఢిల్లీ: దేశంలో అనేక ఉగ్ర దాడులకు, బాంబు పేలుళ్లకు సూత్రధారి, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా వ్యూహకర్త మొహమ్మద్ ఖాసీం గుజ్జర్‌ను ఉగ్రవాదిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది. గుజ్జర్ జరిపిన ఉగ్ర దాడులలో అనేక మంది మరణించారని, గాయపడ్డారని, భారత్‌పై యుద్ధానికి కుట్ర పన్నిన వారిలో గుజ్జర్ ఉన్నాడని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశ సమైక్యత, సమగ్రతలకు వ్యతిరేకంగా ఎవరైనా కార్యకలాపాలు సాగిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. భారత్‌పై యుద్ధాన్ని చేపట్టేందుకు కుట్రపన్నిన గుజ్జర్ అలియాస్ సల్మాన్ అలియాస్ సులేమాన్ అనేక ఉగ్రవాద కార్యకలాపాలను సాగించాడు.
ఆయుధాలు, మందుగుండు, ఐఇడిలు, నగదును డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు సరఫరా చేయడం, ప్రదేశాలను గుర్తించడం, ఉగ్రవాదులతో సమన్వయం జరపడం వంటి కార్యకలాపాలలో గుజ్జర్ పాల్గొన్నాడని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. కొత్తవారిని తన సంస్థలో చేర్చుకుని వారికి ఉగ్ర శిక్షణ ఇవ్వడానికి అనేక మార్గాలను అతను ఎంచుకున్నాడు. సోషల్ మీడియాతోపాటు వివిధ కమ్యూనికేషన్ వ్యవస్థలను అతను ఉపయోగించుకున్నాడు. జమ్మూ కశ్మీరులోని రియాసి జిల్లాకు చెందిన 32 ఏళ్ల గుజ్జర్ ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీరులో నివసిస్తూ అక్కడి నుంచే లష్కరే తాయిబా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా అధికారికంగా ప్రకటించిన ఉగ్రవాదులలో గుజ్జర్ 57వ వ్యక్తి.