Monday, December 23, 2024

గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ ఉగ్రవాదే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కెనడాలో ఆశ్రయం పొందిన 33 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. అనేక ఉగ్రదాడులు, దోపిడీలు, హత్యల్లో అతడి ప్రమేయం ఉన్నందున ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. లఖ్బీర్ సింగ్ స్వస్థలం పంజాబ్ లోని తరన్ జిల్లా. ఖలిస్థానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా లాండా పనిచేస్తున్నాడు. 2021లో మోహాలీ లోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై రాకెట్ ఆధారిత గ్రెనేడ్ దాడి ప్రణాళికలో లఖ్‌బీస్ సింగ్ పాలుపంచుకున్నాడు.

అదే విధంగా 2022లో టార్న్ తరణ్ లోని సర్హాలి పోలీస్ స్టేషన్‌పై జరిగిన ఆర్పీజీ దాడి ఘటనలో కూడా అతని పాత్ర ఉంది. పలు ఉగ్రదాడులు, దోపిడీలు, హత్యలు, ఐఈడీలు అమర్చడం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతోపాటు పంజాబ్, దేశం లోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం వంటి సంఘటనలకు సంబంధించి లఖ్బీర్‌పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. లఖ్‌బీర్‌సింగ్ గత కొన్నేళ్లుగా కెనడాలో ఉంటున్నాడు. భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల్లో పాల్పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో పంజాబ్ లోని 48 ప్రాంతాల్లోని అతని సంబంధితుల ఇళ్లల్లో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News