Saturday, November 23, 2024

మళ్లీ తిప్పేసిన జడేజా.. చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

మళ్లీ తిప్పేసిన జడేజా
అశ్విన్ మ్యాజిక్, మూడో రోజే ఖేల్ ఖతం
చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా
రెండో టెస్టులో భారత్ ఘన విజయం
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడం విశేషం. 61/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు బ్యాటింగ్‌ను తిరిగి చేపట్టిన ఆస్ట్రేలియా 113 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా ఏడు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. తర్వాత 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలి టెస్టులో కూడా భారత్ అలవోక విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఆరంభంలో అశ్విన్..
మూడో రోజు బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి రెండు రోజులు భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన కంగారూ మూడో రోజు మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్‌కు తట్టుకోలేక తక్కువ స్కోరుకే కుప్పకూలింది. దూకుడుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్ (43)ను అశ్విన్ వెనక్క పంపాడు. ఆ వెంటనే స్టీవ్ స్మిత్ (9)ను కూడా అశ్విన్ ఔట్ చేశాడు. కొద్ది సేపటికే లబుషేన్‌ను రవీంద్ర జడేజా వెనక్కి పంపాడు. ధాటిగా ఆడిన లబుషేన్ 5 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. మరోవైపు రెన్‌షా (2)ను అశ్విన్ ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా మళ్లీ కోలుకోలేక పోయింది.

జడేజా మ్యాజిక్..
రవీంద్ర జడేజా అసాధారణ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్లను హడలెత్తిచాడు. అతని ధాటికి హాండ్స్‌కొంబ్ (0), వికెట్ కీపర్ అలెక్స్ కారీ (7), కెప్టెన్ పాట్ కమిన్స్ (0), నాథన్ లియాన్ (8), కుహ్నెమాన్ (0) పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా జట్టులో హెడ్, లబుషేన్ మినహా మరే బ్యాటర్ కూడా రెండంకెల స్కోరును నమోదు చేయలేక పోయాడు. దీన్ని ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో ఊహించుకోవచ్చు. అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన జడేజా 47 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు అశ్విన్ కూడా మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

తడబడినా..
తర్వత స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఓపెనర్ కెఎల్ రాహుల్ మరోసారి పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాడు. ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు ధాటిగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ రెండు సిక్సర్లు, మూడు బౌండరీలతో 31 పరుగులు చేసి రనౌటయ్యాడు. దీంతో భారత్ 39 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. మరోవైపు మాజీ కెప్టెన్ కోహ్లి (20), శ్రేయస్ అయ్యర్ (12) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు.

అయితే చటేశ్వర్ పుజారా, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌లు సమన్వయంతో బ్యాటింగ్ చేసి మరో వికెట్ కోల్పోకుండానే భారత్‌ను గెలిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పుజారా 4 ఫోర్లతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ధాటిగా ఆడిన తెలుగుతేజం శ్రీకర్ భరత్ 3 ఫోర్లు, ఒక సిక్సర్స్‌తో అజేయంగా 23 పరుగులు సాధించాడు. దీంతో భారత్ 26.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో సిరీస్‌లో 20 ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టిన జడేజాకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News