Monday, January 27, 2025

సమష్టి వైఫల్యం వల్లే ఓటమి..

- Advertisement -
- Advertisement -

India defeat in second match against South Africa

మన తెలంగాణ/క్రీడా విభాగం: తొలి టెస్టులో చారిత్రక విజయంతో అదరగొట్టిన టీమిండియా సౌతాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో అనూహ్య ఓటమి పాలైంది. తమకు ఎంతో కలిసి వచ్చిన జోహెన్నస్‌బర్గ్ స్టేడియంలో టీమిండియా తొలిసారి టెస్టుల్లో పరాజయం చవిచూసింది. పేలవమైన రికార్డు ఉన్న సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్టులో ఆల్‌రౌండ్‌షోతో చారిత్రక గెలుపును సొంతం చేసుకున్న టీమిండియా వాండరర్స్‌లో మాత్రమే పూర్తిగా చేతులెత్తేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యమే భారత్ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాట్స్‌మెన్‌లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌట్ కావడం జట్టుపై బాగానే ప్రభావం చూపింది. కనీసం 300 పరుగుల స్కోరును సాధించి ఉన్నట్టయితే సౌతాఫ్రికాపై ఒత్తిడి పెంచే అవకాశం ఉండేది. కానీ పేలవమైన బ్యాటింగ్‌తో భారత్ తక్కువ స్కోరుకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్ వైఫల్యం కొట్టోచ్చినట్టు కనిపించింది. జట్టును ఆదుకోవాల్సిన కెప్టెన్ కెఎల్.రాహుల్ నిరాశ పరిచాడు.

మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేక పోయాడు. ఓపెనర్లు తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. అయితే సీనియర్లు అజింక్య రహానె, చటేశ్వర్ పుజారాలు రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన బ్యాటింగ్ కనబరచడంతో భారత్‌కు మెరుగైన ఖాయంగా కనిపించింది. సిరీస్‌లోనే తొలిసారి ఇద్దరు నిలకడైన ప్రదర్శన చేసింది ఈ ఇన్నింగ్స్‌లోనే. అయితే ఇద్దరు వెంటవెంటనే ఔట్ కావడం, రిషబ్ పంత్ నిర్లక్షంగా ఆడి వికెట్‌ను పారేసు కోవడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. మరోవైపు సౌతాఫ్రికా బౌలర్లు రబాడ, జాన్‌సెన్, ఎంగిడిలు అద్భుత బౌలింగ్‌తో టీమిండియా బ్యాటింగ్ పతనాన్ని శాసించారు. వీరి విజృంభణతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో సౌతాఫ్రికా ముందు భారత్ 240 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.

తేలిపోయిన బౌలర్లు..

అయితే క్లిష్టమైన పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో ఈ స్కోరును సాధించడం సౌతాఫ్రికాకు అంత తేలికేం కాదని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే దక్షిణాఫ్రికా ఓపెనర్లు డీన్ ఎల్గర్, మార్‌క్రామ్‌లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఇక ఎల్గర్ తన కెరీర్‌లోనే చిరకాలం గుర్తుండి పోయే ఇన్నింగ్స్‌తో సౌతాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ ఎల్గర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టును విజయపథంలో నడిపించాడు. అతనికి పీటర్సన్, డుసెన్, బవుమా తమవంతు సహకారం అందించారు. దీంతో వాండరర్స్ స్టేడియంలో తమ చెత్త రికార్డును ఈసారి సౌతాఫ్రికా చెరిపేసుకుంది. తొలిసారి భారత్‌పై విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. ఇదిలావుండగా రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. పిచ్ నుంచి సహకారం లభిస్తున్నా వికెట్లను మాత్రం తీయలేక పోయార. స్టార్ బౌలర్లు బుమ్రా, షమి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపింది. వీరు ఆరంభంలోనే రెండు మూడు వికెట్లు తీసి ఉంటే మ్యాచ్ పరిస్థితి టీమిండియాకు అనుకూలంగా మారేది.

దీనికి తోడు పేలవమైన ఫీల్డింగ్ కూడా భారత్ ఓటమికి ఒక కారణంగా చెప్పాలి. తొలి టెస్టులో అద్భుత ఫీల్డింగ్‌ను కనబరిచిన టీమిండియా ఈసారి ఆ స్థాయిలో రాణించలేక పోయింది. తేలికైన క్యాచ్‌లను సయితం చేజార్చుకోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. అంతేగాక ఓటమికి రాహుల్ పేలవమైన కెప్టెన్సీ కూడా కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జట్టును ముందుండి నడిపించడంలో అతను విఫలమయ్యాడని వారు ఆరోపిస్తున్నారు. ఒకవేళ మ్యాచ్‌లో కోహ్లి ఉంటే ఫలితం మరోలా ఉండేదని వారు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News