ప్రజాస్వామ్య పునాది సూత్రం సమానత్వం. స్త్రీ పురుష, కుల, మత తదితర ఏ ఒక్క తేడా లేకుండా ప్రజలందరూ సమానావకాశాలతో సమానులుగా బతకడమనేదే ప్రజాస్వామ్యానికి ప్రాణ వాయువు. అబ్రహాం లింకన్ అన్నట్టు ‘ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు’ అనే మౌలిక తత్వం ఆధారంగా నిర్మాణమై అమలయ్యేదే నిజమైన ప్రజాస్వామ్యం. రాచరికం, భూస్వామ్యం, మతస్వామ్యం వంటి నిరంకుశ వ్యవస్థలను కూల్చికొని, చీల్చుకొని అవతరించే ప్రజాస్వామ్యం ప్రజలు పూర్తిగా తమంత తాము పరిపాలించుకునే మహత్తర వ్యవస్థ.
దీని జన్మస్థలం సర్వజన ఓటు అయితే, అది వర్థిల్లేది పదహారణాల పరిపూర్ణ ప్రజాస్వామ్య నియమబద్ధమైన రాజ్యాంగం, తదనుగుణంగా అవతరించే చట్టాల ద్వారా మాత్రమే. అయితే గమనించవలసిన చేదు సత్యమేమిటంటే ఇటువంటి పదహారణాల పక్కా ప్రజాస్వామ్యం పూర్తిగా నెలకొన్న దేశాలు దాదాపు లేవని చెప్పాలి. కాని ఒక మాదిరి సామాజిక సమానత్వాన్ని సాధించుకున్న దేశాలు కొన్నైనా ఉన్నందుకు సంతోషించాలి. స్విట్జర్లాండ్, డెన్మార్క్, స్వీడన్ వంటి ఓ డజను దేశాలు లింగపరమైన సమానత్వాన్ని చాలా వరకు సుసాధ్యం చేసుకున్నాయి. గొప్ప ప్రజాస్వామిక దేశమని చెప్పుకునే అమెరికాలో కూడా నల్లవారిని న్యూనంగా చూసి అణచివేసే అమానుషం కొనసాగుతున్నది. ఆర్థికంగా చూసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఆనవాళ్లు బొత్తిగా కనిపించవు. బహుళ జాతి సంస్థల, కార్పొరేట్ శక్తుల గుప్పెట్లోనే దాదాపు అన్ని దేశాలూ, అన్ని సంస్థలూ ఉన్నాయన్న అప్రియ సత్యాన్ని అంగీకరించక తప్పదు.
భారత దేశం విషయానికి వచ్చినప్పుడు మనం చెప్పుకునేది ప్రజాస్వామ్యం, చేతల్లో నిరూపించుకుంటున్నది ఫ్యూడల్ పెత్తందారీతనం, పురుషాధిపత్యం, నాయకారాధన వంటి పచ్చి ప్రజాస్వామ్య వ్యతిరేక దుర్మార్గాలనే, 1947లో స్వాతంత్య్రం వచ్చినంత వరకు. మనది ప్రధానంగా వ్యవసాయ దేశం కావడం వల్ల అప్పటి వరకు ఫ్యూడల్ భూస్వామ్య సమాజంగానే కొనసాగింది. స్వాతంత్య్రం పొందిన తర్వాత దేశాన్ని పారిశ్రామికం చేయడానికి, సాగునీటి ప్రాజెక్టులను నెలకొల్పుకొని, ఆధునిక విద్య, వైద్య రంగాలను సమకూర్చుకొని, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోడానికి ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో గణనీయమైన కృషి జరిగింది. ప్రజాస్వామ్యం నాటుకొని వేళ్లూనుకోడానికి తగిన వాతావరణాన్ని ఇవి కల్పించాయి. ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. బ్రిటిష్ నమూనాలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని స్వతంత్ర న్యాయ వ్యవస్థను నెలకొల్పుకొన్నాం. అమెరికా నుంచి ప్రాథమిక హక్కులను, ఫెడరల్ విధానాన్ని అలవరచుకున్నాం. సామాజిక న్యాయాన్ని సంక్రమింప జేసే చట్టాలను రూపొందించుకున్నాం. అందరికీ వర్తించేలా వయోజన ఓటు హక్కును ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆచరణలో మాత్రం దేశంలో సాగుతున్నది ఫ్యూడల్ ప్రజాస్వామ్యమే గాని , ప్రజల ప్రజాస్వామ్యం ఎంత మాత్రం కాదు. పోలీసు లాఠీ దళితులు, ఇతర కింది తరగతులపై ఇష్టా విలాసంగా చెలరేగి ధనిక, ఆధిపత్య కుల వర్గాలకు మోకరిల్లడం, పలుకుబడి గలవారు దశాబ్దాల తరబడి చట్టానికి అందకుండా తప్పించుకోడం, పేదలు విచారణలోని ఖైదీలుగా చిరకాలం జైళ్లలో మగ్గుతూ ఉండడం, ఓట్లు మత, కుల ప్రాతిపదిక మీద వేయడం, వేయించుకోడం, మైనారిటీలు అనుక్షణం భయం భయంగా బతుకుతూ ఉండడం, దళిత మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు తరచూ జరిగిపోతూ ఉండడం, స్త్రీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించడం వంటి గత కాలపు దుర్నీతులన్నీ దేశంలో ఇప్పటికీ విజృంభించి సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మండు వేసవిలో చల్లని పిల్ల గాలి వీచిన మాదిరిగా కేరళలో గ్రామ స్థాయిలో ఒక మహాద్భుత ప్రజాస్వామ్య మార్పు చోటు చేసుకున్నది. ఆ రాష్ట్రంలోని పలక్కాడ్ జిల్లా మధుర్ గ్రామ పంచాయతీ, అధికారులను అయ్యా (సర్), అమ్మా (మేడమ్) అని సంబోధించే ఫ్యూడల్ సంప్రదాయాన్ని నిషేధిస్తూ తీర్మానం చేసింది. మొన్న మంగళవారం నాడు జరిగిన పంచాయతీ ప్రత్యేక సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రాన్ని సాధించుకొని 70 ఏళ్లు అయ్యాయి, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే ఉన్నతులని ఆచరణలో చూపించవలసిన సమయం ఆసన్నమైంది అని ప్రకటిస్తూ ఆ పంచాయతీ ఉప సర్పంచ్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.ఇక నుంచి పలు అవసరాల కోసం పంచాయతీ కార్యాలయానికి వచ్చే వారు అక్కడి అధికారులను అయ్యా, అమ్మా అని సంబోధించనవసరం లేదని వారిని పేరుతోనో, హోదా నామంతోనో మాత్రమే పిలవాలని ఆ తీర్మానం పేర్కొన్నది. అలాగే ప్రజలు తమ దరఖాస్తుల్లో నేను అభ్యర్థిస్తున్నాను, వేడుకుంటున్నాను అనే మాటలు వాడరాదని వాటికి బదులు డిమాండ్ చేస్తున్నాను అని రాయాలని కూడా తీర్మానం నిర్దేశించింది. ఎన్నికైన మహిళా సర్పంచ్‌లకు బదులు భర్తలు రాజ్యమేలుతున్న మనవంటి రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలు కేరళ మధుర్ పంచాయతీతో పోల్చుకుంటే ఎంత వెనుకబడి ఉన్నాయో వివరించనక్కర లేదు.