మహిళల అండర్ 19 టి20 వరల్డ్‌కప్‌లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియాకు ఇది వరుసగా నాలుగో విజయం కావడం గమనార్హం. తెలంగాణ ఆణిముత్యం గొంగడి త్రిష ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరును సాధించింది. త్రిష అద్భుత సెంచరీతో జట్టును ఆదుకుంది. తర్వాత లక్షఛేదనకు దిగిన స్కాట్లాండ్ 14 ఓవర్లలో కేవలం 58 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన స్కాట్లాండ్కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి.
ప్రారంభం నుంచే భారత బౌలర్లు అద్భుత బౌలింగ్‌ను కనబరిచారు. వరుస క్రమంలో వికెట్లను పడగొడుతూ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను హడలెత్తించారు. స్కాట్లాండ్ టీమ్‌లో ఓపెనర్లు పిప్పా (12), వాల్‌సింగమ్ (12)లతో స్ప్రౌల్ పిప్పా (11)లు మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ఆయూషి 8 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టింది. సెంచరీ స్టార్ త్రిష బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. ఆరు పరుగులకే మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. వైష్ణవి శర్మ మరోసారి సత్తా చాటింది. ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ ఇన్నింగ్స్ 58 పరుగుల వద్దే ముగిసింది.
అదరగొట్టిన త్రిష
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు తెలంగాణ యువ సంచలనం గొంగడి త్రిష అండగా నిలిచింది. మరో ఓపెనర్ కమలినితో కలిసి స్కాట్లాండ్ బౌలర్లను హడలెత్తించింది. కమలిని సమన్వయంతో బ్యాటింగ్ చేయగా త్రిష ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించింది. అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను కనువిందు చేసింది. త్రిషను కట్టడి చేసేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వరుస ఫోర్లు, సిక్సర్లతో త్రిష హోరెత్తించింది. కమిలిని కూడా అద్భుత బ్యాటింగ్‌తో అలరించింది. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించింది. అంతేగాక త్రిషకు ఎక్కువ సేపు స్ట్రయిక్ లభించేలా చూసింది.
ఇద్దరు అద్భుత సమన్వయంతో ఆడి జట్టును పటిష్టస్థితికి చేర్చారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కమిలిని 42 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులు చేసింది. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకుంది. మరోవైపు చెలరేగి ఆడిన త్రిష రికార్డు సెంచరీని నమోదు చేసింది. దూకుడుగా ఆడిన త్రిష 59 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఇదే సమయంలో సానియా చల్కె 29 (నాటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు అభేద్యంగా 61 పరుగులు చేసింది. ఇదిలావుండగా త్రిష ఈమ్యాచ్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అండర్ 19 వరల్డ్‌కప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకు ఏ ఒక్క బ్యాటర్ కూడా ఇలాంటి ఫీట్‌ను సాధించలేదు.