బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై భారత్ సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌తో ‘సకారాత్మక, నిర్మాణాత్మక, పరస్పర ప్రయోజనకర’ సంబంధాలను ఆకాంక్షిస్తున్నామని భారత్ తెలియజేసింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రి సోమవారం ఢాకాలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శి మొహమద్ జషిమ్ ఉద్దీన్‌తో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా పదవీచ్యుతురాలై, భారత్‌కు పరారైన దరిమిలా భారతీయ అధికారి ఒకరు జరిపిన తొలి ఉన్నత స్థాయి పర్యటన ఇది. తాను ఢాకాలో మొహమ్మద్ జషిమ్ ఉద్దీన్‌తో ‘నిర్మొహమాటంగా, దాపరికం లేకుండా, నిర్మాణాత్మకంగా అభిప్రాయాలు మార్పిడి’ చేసుకున్నట్లు మిశ్రి తెలియజేశారు. ‘మైనారిటీల భద్రత, సంక్షేమానికి సంబంధించిన అంశాలతో సహా మా ఆందోళనలు తెలియజేశాను.
సాంస్కృతిక, మతపరమైన, దౌత్యపరమైన ఆస్తులపై శోచనీయ ఘటనలు కొన్నిటి గురించి కూడా చర్చించాం’ అని మిశ్రి విలేకరులతో చెప్పారు. ‘బంగ్లాదేశ్‌తో సకారాత్మక, నిర్మాణాత్మక, పరస్పర ప్రయోజనకర సంబంధాన్ని భారత్ కాంక్షిస్తున్నదని నేను నొక్కిచెప్పాను’ అని ఆయన తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల సమీక్షకు కూడా ఉభయ పక్షాల మధ్య తమ చర్చలు దోహదం చేసిందని మిశ్రి చెప్పారు. ఆగస్టులో బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనల నేపథ్యంలో హసీనా దేశం వదలివెళ్లవలసి వచ్చిన తరువాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురైన విషయం విదితమే. హసీనా భారత్‌కు పరారైన తరువాత కొన్ని రోజులకు నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చారు. హిందువులపై దాడులు, హిందు గురువు చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు వంటి పరిణామాలపై ఇటీవలి వారాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.