Sunday, December 22, 2024

ప్రగల్భాలు తప్ప ప్రగతి ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

2022 సంవత్సరానికి వీడ్కోలు, 2023కి స్వాగతం పలుకుతున్నాం. 2022లో మనం ఏం సాధిం చాం? ఎందులో వెనుకబడి ఉన్నాం? అని పరిశీలన చేసుకుంటే పురోగతి మాట ఎలా ఉన్నా ప్రగల్భాలు ప్రచారం చేసుకోవడమే తప్ప కార్యాచరణలో వైఫల్యాలు ఎక్కుగా కనిపిస్తున్నాయి. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాల్లోనే కాదు పాలనలోనూ అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత ఆర్థిక వృద్ధి తగ్గిపోనున్నదని, ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి కాన్ఫరెన్స్ (అన్‌క్టాడ్) ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. గత ఏడాది నమోదైన 8.2 శాతం నుంచి అది 5.7 శాతానికి పతనమౌతుందని వెల్లడించింది. 2023లో ఇది మరింతగా దిగజారి 4.7 శాతానికి చేరుకోనున్నదని అభిప్రాయపడింది.

ఈ సంవత్సరం అంటే 2022లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని సాధించనున్నదని ఇది ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలన్నిటినీ మించిపోతుందని ప్రధాని మోడీ ఘనంగా చెప్పుకున్నారు. అయితే దేశంలోని అసాధారణ నిరుద్యోగం, ఆదాయ వ్యత్యాసాలు, దారుణమైన దారిద్య్రం, ఈ వృద్ధి గణాంకాల గాలిని తీసి వేస్తున్నాయని అంతర్జాతీయ సంస్థలు, నిపుణులు వేలెత్తి చూపిస్తున్నారు.దేశ దేశాల అభివృద్ధి గమనాన్ని అంచనా వేసే గోల్డ్‌మన్ శాచెస్ ప్రకారం 2022 లోని 6.9 శాతం నుంచి భారత అభివృద్ధి రేటు 2023 నాటికి 5.9 శాతం పతనం కానున్నదని తెలుస్తోంది. ఇలా అనేక సంస్థలు జిడిపి వృద్ధి అంచనాలను తగ్గించి చూపిస్తుండడం దేశ భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి విదేశీ మారక ద్రవ్య నిల్వలు 40.94 మిలియన్ డాలర్ల వరకు తగ్గాయి. ఇక నిరుద్యోగ భూతం పెరుగుతోంది. 2022 జూన్‌లో నిరుద్యోగం పెరుగుదల మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 7.8 శాతంగా నమోదైంది.

మే నెలలో 7.12 శాతం నుంచి జూన్‌లో 8.03 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక సైనిక రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అగ్నిపథ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినా అది యువతలో వ్యతిరేకత పెంచిందే తప్ప ప్రయోజనం కనిపించలేదు. మేలో విద్యుత్ సంక్షోభం తలెత్తడానికి కేంద్ర నిర్లక్ష విధానాలే కారణం. ఏప్రిల్ నెలలో మొదటి 27 రోజుల్లో దేశం మొత్తం మీద 1.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక సామాన్యులపై జిఎస్‌టి భారం తడిసిమోపెడవుతోంది. బియ్యం, పెరుగు వంటి పదార్థాలపై కూడా జిఎస్‌టి భారం మోపారు. రాజకీయంగా చూస్తే బలమైన ప్రత్యర్ధులను దెబ్బ తీయడానికి సిబిఐ, ఇడి, ఆదాయ పన్ను శాఖలచే దాడులు సాగిస్తున్నారు.

రాజ్‌భవన్‌లు కేంద్ర రాజకీయ కార్యాలయాలుగా మారడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు పట్టిన అరిష్టం. మహిళలపై నేరాలు పెరిగాయి. 2019లో 30.9 శాతం ఉన్న కేసులు 2021లో 31.8 శాతానికి పెరగడం గమనార్హం. ఇక రైతుల ఉద్యమం ఏడాది పాటు సాగినా వారి డిమాండ్లను నెరవేర్చడం లేదు. సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో సాగిన ఈ ఉద్యమంలో 100 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకులను ముంచి వేసే ఘరానా రుణ ఎగవేతదారులకు మన దేశం పెట్టింది పేరుగా తయారైంది. ఈ అస్తవ్యస్త పాలనా విధానాలతో పాటు దేశాన్ని ప్రమాదకర పరిస్థితుల్లో నెట్టుతున్న హిందుత్వవాద దృఢంగా వ్యాపించింది. ఉదారవాదం, లౌకికవాదం, భావస్వేచ్ఛ, వాక్‌స్వేచ్ఛ ఆందోళనలకు, అవమానాలకు బలవ్వడం కనిపించింది. హిందుత్వ గుర్తింపుకే ప్రాధాన్యం ఇచ్చి క్షేత్ర స్థాయిలో గుత్తగోలుగా ఓటు బ్యాంకును కొల్లగొట్టడంలో బిజెపి అందెవేసిన చెయ్యిగా మారింది. అనేక ప్రాంతాల్లో, రంగా ల్లో, చివరకు కళారూపాల్లోనూ హిందుత్వ వేళ్లు పాకుకుంటూ పోతున్నాయి. గతంలో ఎలాంటి ప్రాధాన్యం లేకుండా వెనుకబడి ఉండే మోడీ ఇప్పుడు నయా హిందుత్వ వాదాన్ని తెరపైకి తెచ్చి రాజకీయ పావులు కదుపుతున్నారు. ఇన్నాళ్లూ ఆయనలో ఉండే కోపం, నిరాశ ఇప్పుడు రాజకీయ రూపంలో పెల్లుబుకుతోంది.

కొంత మంది ప్రముఖులను దూరంగా ఉంచుతోంది. హిందుత్వవాదం లేనిదే ఓట్లు సాధించలేమన్న సంస్కృతిని బలోపేతం చేయడంతో మిగతా రాజకీయ నేతలు కూడా ఇదే పంథా అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. 2022లో కాళీ పూజ కోసం అత్యధికంగా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో నిధులు పోగు చేశారు. కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పఠించడం ప్రారంభించారు. కాంగ్రెస్ జగడాలతో సతమతమౌతుండగా, రాహుల్ భారత్ జోడో యాత్ర లో హిందుత్వ పంథాను ప్రదర్శిస్తోంది. ఇవన్నీ హిందుత్వ వాదానికి మద్దతుగా అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. 2022 భారత రాజకీయాల్లో మతపరమైన గుర్తింపు అంతర్గత భాగంగా మారాయి. దీన్ని అవమానకరంగా ఎవరూ భావించడం లేదు. హిందువులను, హిందువులను కానివారిని వేరు చేసే పోకడలకు స్వయంశీల మేధావులు కొందరు ఆందోళన చెందుతున్నారు. విపక్షాల తీరును పరిశీలిస్తే అప్రాధాన్య అంశాలపై దృష్టిపెట్టి దేశానికి అసంబద్ధతగా తయారయ్యారన్న విమర్శలు వస్తున్నాయి.

ప్రపంచ పరిస్థితిని, జాతీయ సమస్యలను, సుదీర్ఘ లక్షాలను ప్రతిబింబించే భారీ అంశాలపై వారు ఇకనైనా దృష్టి కేంద్రీకరిస్తారా అన్నది ప్రశ్న. కేంద్రంలో ఉన్న బిజెపి అనుసరిస్తున్న విధానాలతో 70 ఏళ్ల, ఉదారవాద, మేథో, లౌకిక దేశం ఆత్మరక్షణలో పడింది. భారతీయులు మోడీని ప్రశంసలతో ముంచెత్తేవారు కొందరైతే, విమర్శించేవారు కొందరయ్యారు. గుజరాత్ ఎన్నికల్లో బిజెపి విజయం మోడీ గొప్పతనమే అన్న ప్రచారం బాగా జరిగింది. ఈ హడావిడిలో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం అంతగా ప్రస్తావనకు రాలేదు. ఇప్పటికీ కూడా అంతులేని నిరుద్యోగంపై బిజెపి ప్రభుత్వాన్ని నిలదీయలేక పోతుండడం విస్మయం కలిగిస్తోంది. దేశం మొత్తం మీద నిరుద్యోగం రేటు అక్టోబర్‌లో 7.8 శాతం వరకు ఉందని సెంటర్ ఫర్ మోనిటోరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది.

2022 మార్చి వరకు యువతలో 16.4 శాతం మంది (15 నుంచి 24 ఏళ్ల లోపు) మాత్రమే ఉద్యోగం పొందగలిగారు. గత ఐదేళ్లుగా ఈ సంఖ్య దిగజారుతోంది. 2017 మార్చిలో 20.9 శాతం ఉండడం గమనార్హం. 2022 అక్టోబర్‌లో ప్రాంతీయ అసమానతలు బాగా కనిపించాయి. హర్యానాలో 31.8 శాతం, రాజస్థాన్‌లో 30.7 శాతం, గుజరాత్‌లో కేవలం 1.7 శాతం, ఒడిశాలో 1.1 శాతం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో 4.2 శాతం వరకు నిరుద్యోగం ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇక రాజకీయ బేరసారాలు, పార్టీ ఫిరాయింపులు బిజెపి వల్లనే సాగుతున్నాయని కాంగ్రెస్, ఆప్, శివసేన, టిఆర్‌ఎస్, ధ్వజమెత్తుతున్నాయి.

బీహార్‌లోని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిజెపితో తెగతెంపులు చేసుకుని తదుపరి రాజకీయ భవిష్యత్ పటిష్టంగా ఉండడానికి ఆర్‌జెడితో చేతులు కలిపారు. పొరుగునున్న ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ మృతి చెందడంతో సరైన రాజకీయ మార్గదర్శకత్వాన్ని కోల్పోయారు. కాంగ్రెస్‌లో అనేక పదవుల్లో రాణించి సీనియర్ నేతగా స్థానం పొందిన గులాం నబీ అజాద్ కశ్మీర్‌లో తన పార్టీ కార్యకలాపాలకే నిమగ్నమయ్యా రు.

డ్రగ్స్, చట్ట విరుద్ధ కార్యకలాపాలతో పంజాబ్ నేతలు తలమునకలై ఉంటున్నారు. తృణమూల్ నేతలు ముఖ్యులు కొందరు స్కామ్‌లతో అప్రతిష్టపాలు కావడంతో మమతా బెనర్జీ బలహీనులవుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మోడీకి సురక్షిత సుదూరాన్ని కొనసాగిస్తున్నారు.ఆంధ్ర సిఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల సమస్యతో తేలియాడుతున్నారు. రోజూ న్యాయపరమైన పోరాటం సాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ బంధాన్ని సాధ్యమైనంత వరకు పెనవేసుకోవాలని చూస్తున్నారు.

ఆంధ్రాలో బిజెపి తన వైఖరి ఏమిటో తనకే తెలియని అయోమయంలో ఉంటోంది. మహారాష్ట్రలో షిండే, థాకరే శివసేన ఆధిపత్యం కోసం పోరాడు కొంటున్నారు. కేరళలో వామపక్షం ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో దాని ఉనికి కనిపించడం లేదు. తెలంగాణలో టిఆర్‌ఎస్ మాత్రమే బిఆర్‌ఎస్‌గా జాతీయ పార్టీగా అవతరించి మోడీకి వ్యతిరేకంగా సాహసోపేతమైన పోరాటం సాగిస్తోంది. దేశంలో న్యాయ వ్యవస్థ అన్ని వైపుల నుంచి అన్ని స్థాయిల్లో దాడులను ఎదుర్కొంటోంది. కేంద్రం నుంచి కొలీజియమ్ వ్యవస్థను కాపాడుకోడానికి ఆరాటపడుతోంది. కేంద్రంతో వాగ్యుద్ధం కొనసాగిస్తోంది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళగా ఉన్నత స్థానాన్ని సాధించినా దేశంలో మహిళలపై అరాచకాలు, హింస లు ఆగడం లేదు. మరో ముఖ్య విషయం గుజరాత్‌లో బిల్కిస్ బానో అత్యాచారం, హింస, హత్య కేసుకు సంబంధించి అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. నిందితులు 11 మందికి సత్ప్రవర్తన సర్టిఫికెట్ ఇచ్చి విడుదల చేయడం, వారు విడుదలైనప్పుడు ఘన స్వాగతం లభించడం తీరని అవమానకర సంఘటనగా దేశానికి అప్రతిష్ఠ తెచ్చిపెట్టింది. ఏదేమైనా 2022 నాటి భారత్ ప్రపంచంలో అవమానకర మచ్చగా మిగిలింది.

పి.వెంకటేశం
9985725591

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News