Tuesday, January 21, 2025

భారత వాస్తవ ప్రగతి!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: 202324 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులను తెలుసుకోడం అవసరం. వచ్చే ఏడాది (2024) ప్రథమార్థం ముగిసే సరికి పార్లమెంటు ఎన్నికలు జరిగి కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరవలసి వుంది. అందుచేత ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చిట్టచివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే అవుతుంది. ఈ బడ్జెట్ రానున్న 25 సంవత్సరాల భారత ఆర్థిక గతిని సూచిస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పుకొంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం విలువ 202324 ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని, ఆ తర్వాత ఏడాదికి ట్రిలియన్ చొప్పున పెరిగి త్వరలోనే 7 ట్రిలియన్ డాలర్ల కిమ్మత్తును అందుకొంటుందని కొంత మంది నిపుణులు ఘనం గా చెబుతున్నారు.

అంటే దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకు పోతామని ప్రధాని మోడీ ఘనంగా పెట్టుకొన్న లక్షాన్ని తొందరలోనే అధిగమించగలమని ఆశలు కలిగిస్తున్నారు. అయితే ఒక దేశ పురోగమనాన్ని గాని, ఆర్థిక ముందడుగును గాని దేనిలో చూడగలం? అత్యంత వేగంగా పెరుగుతున్న అతి పెద్ద కార్పొరేట్ యాజమాన్యాల సంపద అద్దంలోనా, సామాన్య జనం ఆకలి కడుపుల్లోనా అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలిగినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ విలువ శరవేగంతో పెరగడంలోని మంచి చెడ్డలు వాస్తవ రూపంలో బయటపడతాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పేదలున్న దేశంగా మనం సంపాదించుకున్న పేరును తొలగించుకోగలిగినప్పుడే దేశం ముందుకు పరుగులు తీస్తుందని చెప్పగలుగుతాము. 17 ఏళ్ళ లోపు భారతీయ పిల్లల్లో 21.8% మంది అంటే 9 కోట్ల 70 లక్షల మంది నిరుపేదరికంలో మగ్గుతున్నారని ఐకరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) జరిపిన బహుముఖీన దారిద్య్ర నివేదిక వెల్లడించింది.

కరోనాకు ముందు 22 కోట్ల 89 లక్షల పేదలు ఇండియాలో వున్నారని, రెండో స్థానంలో నైజీరియా (9 కోట్ల 70 లక్షల మంది) వుందని వివరించింది. కరోనాలో మన ప్రజలు పడిన కష్టాలను గమనిస్తే ఆ తర్వాత కాలంలో దేశంలో పేదరికం మరింత పెరిగి వుంటుంది. అందుచేత దేశ ఆర్థిక వ్యవస్థ గొప్పతనాన్ని ప్రజల కడుపుల్లో చూడాలి గాని, కార్పొరేట్ల సంపద గుట్టల్లో వెతకకూడదు. మన పారిశ్రామిక రంగం దారుణంగా దెబ్బతినిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఐదారేళ కాలంలో దేశ పరిశ్రమల రంగం కుప్పకూలిందని కొవిడ్ సంక్షోభానికి ముందే ఈ దుస్థితి మొదలై ఇప్పటికీ కొనసాగుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎగుమతి, దిగుమతుల్లో వ్యతిరేక తేడాను తొలగించాలంటే మనం విదేశాల నుంచి కొనుక్కొనే సరకులను తగ్గించుకొని వాటికి మనం అమ్మే సామగ్రిని పెంచుకోవలసి వుంది. ఇది జరిగితే దేశంలో పారిశ్రామిక, తయారీ వృద్ధి జరిగి నిరుద్యోగం కూడా అదుపులో వుంటుంది. అప్పుడే మన ఆర్థిక వ్యవస్థ సరైన గాడిలో నడుస్తున్నట్టు చెప్పుకోగలుగుతాము. ప్రస్తుతానికైతే మనం దిగుమతులు ఎక్కువగా చేసుకొంటూ స్వల్ప ఎగుమతులనే సాధించగలుగుతున్నాము. 2022 నవంబర్ మాసంలో మనం 32 బిలియన్ డాలర్ల సామగ్రి ఎగుమతి చేయగా, 56 బిలియన్ డాలర్ల సామగ్రిని దిగుమతి చేసుకొన్నాము. ఆయిల్ కోసం ఇతర దేశాలపై అత్యధికంగా ఆధారపడుతున్న దేశం మనది.

ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి చమురును ఎక్కువగా తెచ్చుకొంటున్నాము. దాని వల్ల రష్యాతో కూడా మనం భారీ వాణిజ్య లోటులో వున్నాము. ఇండియాలో వినియోగించే బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర ప్రస్తుతం బ్యారెల్ 8384 డాలర్లుగా వుంది. ఇది పెరిగే కొద్దీ మన వాణిజ్య లోటు పెరిగిపోయి దేశంలో ధరలు, ద్రవ్యోల్బణం విజృంభిస్తూ వుంటాయి. అలాగే చైనా తాజాగా అరుణాచల్‌ప్రదేశ్ వద్ద వాస్తవాధీన రేఖను ఉల్లంఘించిన సమయంలోనే అక్కడి నుంచి మనం తెచ్చుకొంటున్న దిగుమతులు భారీగా పెరిగాయి.గత 30 మాసాల్లో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి చేరుకొన్నా యి. 20202021లో చైనా నుంచి 86.39 బిలియన్ డాలర్ల కిమ్మత్తు దిగుమతులు చేసుకోగా, 20212022 లో 115.83 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకొన్నాము.

వాస్తవాధీన రేఖ వద్ద చైనాను దారిలోకి తెచ్చుకోవాలంటే దానితో వాణిజ్య సంబంధాలను తెంపుకోడం ద్వారా దానికి గట్టి బుద్ధి చెప్పాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎంత సులభంగా సలహా ఇచ్చారో ఆ పని చేయడం అంత కష్టతరమని బోధపడుతున్నది. అనేక కీలక పారిశ్రామిక అవసరాల కోసం చైనా మీద మనం అత్యధికంగా ఆధారపడ్డాం.200203 నుంచి 201213 వరకు గల కాలంలో చైనాతో మన వాణిజ్య లోటు 1.1బిలియన్ డాలర్ల నుంచి 37 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది 2022 నాటికి 73 బిలియన్ డాలర్లు అయింది. అందుచేత మన వాస్తవ ప్రగతి మన కుబేరుల సంపదలో కాకుండా మన ఎగుమతి, దిగుమతుల గణాంకాల్లో వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News