ఎఐడిఆర్‌ఎం బహిరంగ సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
సమ సమాజ స్థాపనతోనే అసమానతల నిర్మూలన సాధ్యం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలో సామాజిక అభివృద్ధి, సంస్కరణలకు వేలాది ఏళ్లుగా పాతుకుపోయిన కుల వ్యవస్థ భూతంగా మారిందని, కుల వ్యవస్థ భూతాన్ని అంతం చేస్తేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు మార్గం సుగమం అవుతుందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. డిజిటిల్ ఇండియా, వికసిత్ భారత్ అంటూ గొప్ప గొప్ప మాటలు చెబుతున్న ప్రధాని మోదీ సామాజిక రుగ్మతలను రూపుమాపే కుల వ్యవస్థ నిర్మూలన గురించి మాత్రం మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. కుల రహిత, వర్గ రహిత సమాజం లక్షంగా కారల్ మార్క్, అంబేడ్కర్ పనిచేశారని అన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ శక్తుల నుంచి ఈ దేశాన్ని రక్షించుకునేందుకు లాల్, నీల్ జండాలు ఏకమై సంఘటితంగా ఉద్యమించాలని రాజా పిలుపునిచ్చారు.
అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం (ఎఐడిఆర్‌ఎం) 2వ మహాసభల ప్రారంభం సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభ జరిగింది. దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్‌పిఎస్) రాష్ట్ర అధ్యక్షులు కె.ఏసురత్నం అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభకు డి.రాజా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎం ఎల్ ఎ కూనంనేని సాంబశివరావు, ఎఐడిఆర్‌ఎం జాతీయ అధ్యక్షులు రాముర్తి, ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్, బికెఎంయు జాతీయ ప్రధాన కార్యదర్శి బోరియా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి.నరసింహా, ఎం.బాలనరసింహా, ఎఐడిఆర్‌ఎం జాతీయ నేతలు సుబ్బారావు, విర్యా పాండ్యన్ మనూజ్, శివకుమార్, రవీంద్ర చారి, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి చాయదేవి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పామాకుల జంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా ప్రసంగిస్తూ కులం అనేది భారతదేశానికే పెద్ద సవాల్‌గా మారిందని, అలాంటి కుల వ్యవస్థను రూపుమాపేందుకు మార్గం చూపుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌ను కేంద్ర మంత్రి అమిత్ షా చట్టసభల సాక్షిగా అవమానించడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండించిందన్నారు.
రాజ్యాంగ పరమైన పదవుల్లో ఉండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన అమిత్ షా తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని, లేకపొతే ప్రధాన మంత్రి మోదీ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తూ ఇప్పటికే అనేక ఉద్యమాలను చేపట్టాయని రాజా తెలిపారు. సిపిఐ ఆవిర్భావం నాటి నుంచే దేశంలో పాతుకుపోయిన కుల వ్యవస్థ, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిందని, అంతుకు ముందు మహాత్మా జ్యోతిబా పూలే, ఆ తర్వాత నారాయణగురు, పెరియార్ రామాస్వామి పెద్దఎత్తున సామాజిక ఉద్యమాలను నడిపారని రాజా చెప్పారు. దళితులు, ఆదివాసీల ఆర్ధిక అభ్యున్నతికి దేశ ప్రథమ ప్రధాని జవహార్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికల ద్వారా నిధులు కేటాంచారన్నారు. అందుకు అనుగుణంగా ఎస్ ఎస్ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా సామాజిక, ఆర్ధిక అభ్యున్నతికి గత ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయని తెలిపారు.
బిజెపి అధికారం చేపట్టిన తర్వాత ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసి ఈ సబ్ ప్లాన్‌ను నిర్వీర్యం చేయడమే కాకుండా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ భజనపరులుగా మారారని రాజా ఆగ్రహాం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్షంగా రూపొందించిన రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని అమలు చేసేందుకు కుట్రలు పన్నిన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు ఇస్ బార్ 400 పార్’ అంటూ గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాయని, వీటిని ఈ దేశ ప్రజలు తిప్పికొట్టారని రాజా పేర్కొన్నారు.
సమ సమాజ స్థాపనతోనే అసమానతల నిర్మూలన సాధ్యం : కూనంనేని సాంబశివరావు
కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సమాజాంలో అసమానతలు, అంతరాల నిర్మూలన సమ సమాజ స్థాపన ద్వారానే సాధ్యమని చెప్పారు ఇది సాధించాలంటే ఈ పాలకులను ఓడించి మన రాజ్యం మనం తెచ్చుకోవాలని, ఇది సాధ్యం కావాలంటే కష్టజీవుల కోసం నిరంతరం పోరాడే ఎర్ర జెండాలు రెపరెపలాడాలని అన్నారు. ఇందుకు అన్ని ఎర్రజెండాలతో పాటు నీల్ జెండా ఏకం కావాలని కోరారు. ప్రపంచంలో మనిషి ఎక్కడ పుట్టినా అందరి రక్తం ఒక్కటేనని, అందరిలోనూ అవే బ్లెడ్ గ్రూప్‌లు ఉంటాయని, ఇది కమ్యూనిస్టులు చెబుతుంది కాదని, సైన్స్ చెబుతున్న నిజమన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని కులం కేవలం భారతదేశంలోనే పుట్టిందని, ఈ కులం నేటి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తోందని తెలిపారు. కుల భూతాన్ని అంతం చేయడంలో దారులు వేరైనా అంబేడ్కర్, కమ్యూనిస్టుల భావజాలం ఒక్కటేనని అన్నారు. ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి కావచ్చినా నేటి శ్రమజీవులకు బతుకు లేదని, ఎంత కష్టపడినా కడుపు నిండే పరిస్థితి లేదన్నారు. దేశంలో 90 శాతం ప్రజల వద్ద ఉన్న సంపదకు మించి కేవలం 10 శాతం మంది వ్యక్తుల వద్ద కేంద్రీకృతమై ఉందన్నారు. సభలో బాలనరసింహా, నిర్మల్ కుమార్, మారపాక అనిల్ మాట్లాడారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఆలాపించిన గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి.