న్యూఢిల్లీ : భారత్ ఎదుగుదల దేశీయంగా టెక్నాలజీ అభివృద్దితో ముడిపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ , కార్నెగి ఇండియా సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహిస్తోన్న ది గ్లోబల్ టెక్నాలజీ సదస్సులో ఆయన ప్రసంగించారు. మన శక్తిని బట్టి సామర్ధాలను నిర్ణయించే విభిన్నమైన ప్రపంచంలో మనం ఉన్నామన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రపంచంలో డేటా ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తూ బ్రిటన్ గణిత శాస్త్రవేత్త క్లైవ్ హంబీ వ్యాఖ్యలను జైశంకర్ ఉటంకించారు.
18 వ శతాబ్దంలో చమురు పోషించిన పాత్రను 21 వ శతాబ్దంలో డేటా పోషిస్తోందని పేర్కొన్నారు. డేటా అత్యంత విలువైన వనరని, దాన్ని సరైన విధంగా వెలికి తీయాలన్నారు. టెక్నాలజీ, గ్లోబలైజేషన్‌లు ఆర్థిక విషయాలన్నది వాస్తవం. కానీ అవి రాజనీతి శాస్త్ర అంశాలు కూడా . గత రెండేళ్లుగా మనడేటా ఎక్కడ ఉంటోందన్న అంశంపై భారత్ దృష్టి పెట్టింది” అని వెల్లడించారు. టెక్నాలజీకి సంబంధించిన భౌగోళిక , రాజకీయ అంశాల్లో భారత్‌కు టెక్నాలజీ ఎవరు ఇస్తున్నారు, ఎవరు భాగస్వాములవుతున్నారు, మన మార్కెట్ ఎక్కడ ఉంది అనే అంశాలు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది.