న్యూఢిల్లీ : భారతదేశం తన అధికారిక డిజిటల్ కరెన్సీని వచ్చే సంవత్సరం(2023) ప్రారంభంలో ప్రవేశపెట్టే అవకాశముంది. ఇది ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ మాదిరిగా ఉండనుందని, కానీ మార్పు చేసిన తర్వాత ‘ప్రభుత్వ హామీ’ సౌకర్యం ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సెంట్రల్ బ్యాంక్ సహకారంతో ‘డిజిటల్ రూపాయి’ త్వరలో ప్రవేశపెడతామని గత వారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే డిజిటల్ కరెన్సీలో భారతీయ కరెన్సీ లాంటి ప్రత్యేక అంకెలు ఉంటాయని సమాచారం. ఒక రకంగా ఇది ప్రభుత్వ గ్యారంటీ డిజిటల్ వాలెట్ అవుతుంది. డిజిటల్ కరెన్సీ రూపంలో జారీ చేసిన యూనిట్లు చెలామణిలో ఉన్న కరెన్సీలో చేర్చుతారు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డిజిటల్ రూపాయి సిద్ధంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ సూచించినట్టు తెలుస్తోంది. ఆర్‌బిఐ రూపొందించిన డిజిటల్ రూపీ బ్లాక్‌చెయిన్ అన్ని రకాల లావాదేవీలను ట్రేస్ చేస్తుంది. ప్రైవేటు కంపెనీల మొబైల్ వాలెట్లలో ప్రస్తుతం ఈ వ్యవస్థ లేదు.