Monday, January 20, 2025

చైనాతో చర్చల్లో సుహృద్భావం

- Advertisement -
- Advertisement -

భారత చైనా సైనికాధికారుల మధ్య 19వ భేటీ ఈ నెల 13, 14 తేదీల్లో మన దేశం వైపు గల చుషుల్ మోల్డో సరిహద్దు సమావేశ కేంద్రంలో జరిగింది. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగడం విశేషం. సమస్యల పరిష్కారం పట్ల రెండు వైపులా గల దీక్షను ఈ సమావేశాలు ప్రతిబింబించాయి. అదే సమయంలో చైనా తాను తిష్ఠ వేసుకొన్న దీప్ సంగ్ మైదాన ప్రాంతం, కారకోరమ్ కనుమ, దీప్ చౌక్ సమీపంలోని నింగ్లంగ్ నల్లా ప్రాంతాల్లో భారత సేనలకు గస్తీ హక్కులను తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. అందువల్ల ఈ సమావేశాల నుంచి ఒరిగిందేమీ లేదని పెదవి విరచడాన్ని తప్పు పట్టలేము. దీప్ సంగ్ ప్లేన్స్ ద్వారా కీలక స్థావరమైన దౌలత్ బేగ్ ఓల్దీకి చేరవచ్చు. అందుచేత ఇక్కడ నుంచి చైనా సేనలు తప్పుకోడం లేదు. 2020లో చైనా లడఖ్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ పొడవునా సైన్యాన్ని భారీగా మోహరించడం, మన సైన్యంతో భౌతిక ఘర్షణకు దిగి మన ప్రాంతాన్ని కొంత మేరకు ఆక్రమించుకోడం తెలిసిందే.

Also Read: జాబిల్లికి చేరువలో చంద్రయాన్-3

అక్కడ నుంచి చైనా సేనలు ఖాళీ చేసి మన సేనలు తమ పూర్వ స్థానానికి చేరుకోగలిగితేనే రెండు దేశాల మధ్య నిజమైన శాంతియుత సహజీవనం మళ్ళీ ప్రారంభమైనట్టు భావించాలి. కాని చైనా ఇక్కడే తన వైఖరిలో సడలింపుకి సిద్ధంగా లేదు. ఈసారి చర్చలు సుహృద్భావ వాతావరణంలో వరుసగా రెండు రోజుల పాటు జరగడం, వాస్తవాధీన రేఖ పొడుగునా శాంతిని కాపాడాలని రెండు దేశాలు సంకల్పం చెప్పుకోవడం వల్ల భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించడం సహజం. 1962 యుద్ధం నాటి నుంచి ఇప్పటి వరకు భారత చైనా మధ్య జరిగిన పెద్ద ఘర్షణ 2020 నాటి లడఖ్ ఉదంతమే. రెండు దేశాల మధ్య 3488 కి.మీ (2167 మైళ్ళు) సుదీర్ఘమైన సరిహద్దు ఇంత కాలం నిశ్చింతగా ఉండగలగడం విశేషమే. అయితే మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అమెరికా -చైనా మధ్య పెరుగుతున్న వైరుధ్యం నేపథ్యంలో భారత దేశం అమెరికా వైపు ఒరిగి ఉన్నదని చైనా భావిస్తున్నది.

అందువల్లనే చైనా మనతో ఘర్షణకు దిగిందనే అభిప్రాయానికి ఆస్కారం కలిగింది. ఇది సరిహద్దులకు అటూ ఇటూ ఎప్పుడూ లేనంతగా సైన్యాలను మోహరించేలా చేసింది. చైనాకు దీటుగా సైనిక, ఆయుధ బలాన్ని పెంచుకోడానికి ఇండియా అమితంగా ఖర్చు చేస్తున్నది. మూడేళ్ళ నాటి లడఖ్ సరిహద్దు ఘర్షణల్లో ఆక్రమించుకొన్న ప్రాంతాల నుంచి చైనా సేనలు వెనక్కి తమ స్వస్థలాలకు వెళ్లేలా చేయడం కోసం 19 సార్లు చర్చలు జరపాల్సి రావడమే విడ్డూరం. అయినా లక్ష్యం నెరవేరలేదు. పట్టు విడవకుండా చర్చలు జరుపుతూ ఉండడమే శరణ్యం. 2020 ఏప్రిల్ నుంచి చైనా రెండు వేల చదరపు కి.మీ. భారత భూమిని ఆక్రమించుకొన్నట్టు సమాచారం. కార్ప్ కమాండర్ స్థాయిలో జరిగిన మొన్నటి 19వ సమావేశం అంతకు మునుపటి భేటీల కంటే మెరుగైనదని, రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించే వైపు, వాస్తవాధీన రేఖ పొడవునా అదనపు బలగాలు మోహరించకుండా నిగ్రహం పాటించే వైపు సంకల్పం చెప్పుకోడానికి తగిన పూర్వరంగాన్ని ఈ చర్చలు సిద్ధం చేశాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ వివాదాస్పద ప్రాంతాల్లో రెండు దేశాలు చెరి యాభై వేల సైన్యాన్ని భారీ ఆయుధాలతో మోహరించి వున్నాయి.

ఇది ఎంత ఆర్ధిక భారాన్ని కలిగిస్తుందో చెప్పనక్కర లేదు. గత 18 వ చర్చల్లో సంయుక్త ప్రకటన విడుదల చేయలేదు. అందుకు భిన్నంగా ఈ 19వ సారి చర్చల తర్వాత రెండు దేశాలు కలిసి ఒక ప్రకటనను విడుదల చేశాయి. తూర్పు లడఖ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ పొడవునా గల వివాదాలను పరిష్కరించుకొనే వైపు త్వరగా అడుగులు వేయాలని ఉమ్మడిగా ఒక అంగీకారానికి రావడం మంచి పరిణామమే. సరిహద్దుల్లో గల ఇతర వివాదాల పరిష్కారం వైపు త్వరగా చర్చలు జరగాలని, చర్చల్లోని ఈ ఊపు తగ్గరాదని అనుకోడమూ బాగుంది. గత చర్చల్లో అనేక చోట్ల నుంచి ఉభయులూ వెనక్కి తగ్గడానికి అంగీకారం కుదరడం అది అమలు కావడం తెలిసిందే. ఈ నెల 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) సమావేశాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో మన దేశంలో జి 20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ రెండు సమావేశాలకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరు కానున్నారు. అందువల్ల కూడా 19 వ సమావేశాలు మంచి సూచనలతో ముగిశాయనుకోవాలి. వచ్చే సమావేశాల్లో అగ్రనేతల స్థాయిలో మెరుగైన అంగీకారం కుదరాలని కోరుకొందాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News