న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టు జాబితాలో భారత్ గత ఏడాదితో పోలిస్తే ఒకస్థానం దిగజారి 85 వ ర్యాంకుకు పరిమితమైంది.టాప్‌లో ఫ్రాన్స్ ఉంది. హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ 2024పేరిట ఈ జాబితా విడుదలైంది. భారతీయ పాస్‌పోర్టుదారులను వీసా రహిత పర్యటనలకు అనుమతించే దేశాల్లో మరో రెండు కొత్తగా వచ్చి చేరినప్పటికీ, భారత్ ర్యాంకు కాస్త తగ్గడం గమనార్హం.
ప్రస్తుతం భారతీయ పౌరులకు 60 దేశాలు వీసా లేకుండానే తమ దేశాల్లో పర్యటించడానికి అనుమతిస్తున్నాయి. ఇటీవల థాయ్‌ల్యాండ్, మలేసియా, ఇరాన్ దేశాలు భారత్‌కు ఈ పథకాన్ని వర్తింప జేశాయి. వీసా లేకుండా ఎన్ని దేశాలకు ప్రయాణించవచ్చన్న అంశం ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ జారీ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఫ్రాన్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్ పాస్‌పోర్టు ఉన్నవారు వీసా లేకుండా ఏకంగా 192 దేశాలకు వెళ్లవచ్చు. జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచాయి.
మరోవైపు మన పొరుగుదేశం పాకిస్థాన్ 106 వ స్థానానికి పరిమితమైంది. భారత్‌తో దౌత్య వివాదంలో ఉన్న మాల్దీవులు మాత్రం ఏకంగా 58 వ స్థానంలో నిలిచింది. మాల్దీవుల పాస్‌పోర్టు ఉన్న వారు వీసా లేకుండా 96 దేశాలకు వెళ్లవచ్చు. గత 19 ఏళ్ల డాటా మొత్తాన్ని పరిశీలించి హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ తయారు చేస్తారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ అందుబాటులో ఉంచే సమాచారం ఈ సూచీ రూపకల్పనకు కీలకం. మొత్తం 199 దేశాల్లోని 227 ప్రయాణ గమ్యస్థానాల సమాచారం ఈ డాటాలో పొందుపరుస్తారు.