దేశ ఆర్థిక ప్రగతికి దిశా నిర్దేశం చేసిన ఘనత పివిదే : నేడు పివి వర్ధంతి సందర్భంగా సిఎం రేవంత్ నివాళి
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బహుభాషా కోవిదుడు, భారత దేశ మాజీ ప్రధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు సేవలు చిరస్మరణీయమని ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతికి దిశా నిర్దేశం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆయన వర్ధంతిని పురస్కరించుకొని వారికి ఘన నివాళులు అర్పించారు.
మేధో సంపన్నుడు పివి
పివి నర్సింహారావు మించిన మేధోసంపన్నుడు, దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు మరొకరు లేరని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ నెల 23 సోమవారం పివి నర్సింహారావు 20వ వర్ధంతి సందర్భంగా వారు దేశానికి అందించిన సేవలను మంత్రి స్మరించుకున్నారు. తెలంగాణ బిడ్డ అయిన పివి నర్సింహారావు దేశ ప్రధానిగా సేవలందించడం మనందరికీ గర్వకారణమని అన్నారు.
రక్షణ, విదేశాంగ, హోంశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పివి నర్సింహారావు అమలు చేసిన విధానాలు, సంస్కరణలు దేశాన్ని మేలి మలుపు తిప్పాయని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని గట్టెక్కించి, విశ్వవిపణికి భారతదేశాన్ని అనుసంధానం చేసి, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పివి ఖ్యాతిగడించారని కొనియాడారు. రాజకీయ వ్యవస్థ కన్నా దేశం గొప్పదనే పివి నర్సింహారావు మాటలు సదా ఆచరణీయమైనవని మంత్రి సురేఖ పేర్కొన్నారు.