రాజపక్సకు జైశంకర్ హామీ
కొలంబో: భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం నాడిక్కడ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహీంద రాజపక్సను కలుసుకున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు భారత సహకారం కొనసాగుతుందని జైశంకర్ వారికి హామీ ఇచ్చారు. విదేశీ మారకనిల్వలు తరిగిపోవడంతో శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఎదుర్కొంటోంది. ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి శ్రీలంకకు 100 కోట్ల డాలర్ల రుణాన్ని భారత్ ఇటీవలే ప్రకటించింది. శ్రీలంక అగ్రనాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతోపాటు ఏడు దేశాల బిమ్‌స్టెక్ సదస్సులో పాల్గొనేందుకు జైశంకర్ ఇక్కడకు వచ్చారు. ఇలా ఉండగా&ఆర్థిక సంక్షోభంలో ఉన్న తమ దేశాన్ని ఆదుకునేందుకు భారత్ 100 కోట్ల డాలర్ల రుణాన్ని అందచేస్తున్నందుకు శ్రీలంక ప్రజల తరఫున అధ్యక్షుడు రాజపక్స భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.