Monday, December 23, 2024

దేశ ఆర్థికం ఆందోళనకరం

- Advertisement -
- Advertisement -

ప్రధాన మంత్రి మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు త్వరలో జపాన్, జర్మనీలను సహితం పక్కకు నెట్టివేసి భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయితే కావచ్చు. అయితే భారతదేశ ఆర్థిక మూలాధారాలు ఎంత పటిష్టంగా ఉన్నాయి? రిజర్వు బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ సభ్యుడు జయంత్ ఆర్. వర్మ ఇటీవల భారతదేశం ‘ఆర్థిక వృద్ధి ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది’ అని తాను భయపడుతున్నానని పేర్కొనడం గమనార్హం. నాలుగు గ్రోత్ ఇంజన్లు (ఎగుమతులు, ప్రభుత్వ వ్యయం, ప్రైవేట్ పెట్టుబడులు, మొత్తం క్యాపెక్స్, ప్రైవేట్ వినియోగం) అనుమానాస్పదంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

గత నెల డిసెంబరు 25న తన నెలవారీ రేడియో ప్రసంగం “మన్ కీ బాత్‌” లో ప్రధాని నరేంద్ర మోడీ బ్రహ్మాండమైన ఆర్థిక పురోగతితో 2022లో “అమృత్ కాల్ ” (స్వర్ణ కాలం)లోకి దేశం ప్రవేశించిందని సగర్వంగా చెప్పారు. “2022 నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది, అనేక విధాలుగా అద్భుతమైనది. ఈ సంవత్సరం భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది… ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ హోదా ను పొందుతున్న భారతదేశం..” అంటూ చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా అగ్రరాజ్యాలతో సహా మొత్తం ప్రపంచం ఆర్ధికంగా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే భారత్ మాత్రమే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా, యుకెని అధిగమించడం ద్వారా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థిరంగా ఉన్నట్లు చెప్పారు.

ఈ మధ్య ఏ సభలో ప్రసంగిస్తున్నా మన ఆర్ధిక వ్యవస్థ గురించి ప్రధాని చాలా ఆశాభావంతో చెబుతున్నారు. ఇదంతా తమ ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే, తన జనాభాలో 62.5% లేదా 813.5 మిలియన్ల మందికి ఆహార పదార్ధాలు ఉచితంగా ఇవ్వాల్సి వచ్చిన దేశాన్ని మనం ఏవిధంగా చూడగలము?
జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద 75% గ్రామీణ, 50% పట్టణ గృహాలు (మొత్తం 62.5% కుటుంబాలు (2014 నుండి) సబ్సిడీ ఆహార ధాన్యాలను పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 2020 నుండి, మహమ్మారిలో లాక్‌డౌన్ ప్రకటించిన వెంటనే, ఈ కుటుంబాలకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) కింద ప్రతి సభ్యునికి అదనంగా 5 కిలోల ఉచిత రేషన్ అందించారు.

వారి అర్హతలను బట్టి ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది. లాక్‌డౌన్ సమయంలో తాత్కాలిక ఉపశమనంగా మూడు నెలలకు ఉద్దేశించిన ‘ఉచిత రేషన్’ను తాజా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ముగిసేదాకా డిసెంబర్, 2022 వరకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా పొడిగిస్తూ వచ్చారు. ఇప్పుడు, ఈ ఉచిత రేషన్ ఉపసంహరించుకున్నా జనవరి 1, 2023 నుండి డిసెంబర్ 31, 2023 వరకు మొత్తం సబ్సిడీని ఒక సంవత్సరం పాటు ఉచితంగా మార్చారు. 2024 ఎన్నికల వరకు పొడిగించే అవకాశం ఉంది. అధికారిక అంచనాల ప్రకారం, డిసెంబర్ 2022 వరకు ఆహార ధాన్యాల కోసం రూ. 3.91 లక్షల కోట్ల ఖర్చు చేశారు. ఇప్పుడు మరో రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. తాజాగా, ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ రాబోయే రెండేళ్ల పాటు అధోగతిలోకి వెళ్తుంది. ప్రపంచ బ్యాంకు 2023, 2024 జిడిపి గణాంకాలను వరుసగా 6.6 శాతం, 6.1 శాతానికి సవరించింది. ఇది జూన్ 2022లో చేసిన దాని మునుపటి అంచనాలతో పోలిస్తే 0.5, 0.4 శాతం తక్కువ.

సహజంగానే, ఇది పేదరిక స్థాయిని, ముఖ్యంగా దేశంలో తీవ్ర పేదరిక స్థాయిని పెంచుతుంది. ముఖ్యంగా నిరుద్యోగం పెరుగుతూ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ప్రపంచంలో ఇదో పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన భారత ప్రజలు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు. వినియోగదారుల ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ పేర్కొన్న పరిమితికి మించి 6 శాతం కంటే ఎక్కువగా గత సంవత్సరం అంతా ఉంది. భారతదేశ వస్తువుల వాణిజ్య లోటు 2019 నుండి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. నవంబర్‌లో 24 బిలియన్ల డాలర్లకు పెరిగింది. ఈ గణాంకాలు అన్ని మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళను వెల్లడి చేస్తున్నాయి.

గత అక్టోబర్‌లోని ప్రపంచ బ్యాంకు వారి “పేదరికం, భాగస్వామ్య శ్రేయస్సు 2022” నివేదిక ప్రకారం 2020 మహమ్మారి సమయంలో ప్రపంచ జనాభాలో గరిష్ట సంఖ్యలో “అత్యంత పేద” ప్రజలు భారత్ లోనే ఉన్నారు. 2020లో ప్రపంచంలో 71 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారుకున్నారని పేర్కొనగా, వారిలో మూడింట రెండు వంతుల మందికి పైగా 56 మిలియన్ల మంది, అంటే 79 శాతం మంది భారత దేశంలోనే ఉన్నారు. ప్రపంచ తలసరి ఆదాయం 2021లో 18,721 డాలర్లు కాగా, భారతీయ తలసరి ఆదాయం సంఘం కన్నా తక్కువగా 7,333 మాత్రమే ఉంది. 2022లోని 8.7 శాతం జిడిపి వృద్ధి ఆధారంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ మారినప్పటికీ, భారతీయులు దారుణమైన పేదరికంలో ఉన్నారు. దేశంలో పెరుగుతున్న బిలియనీర్ల సంఖ్య మన ఆర్ధిక పురోగతికి, మన ఆర్హ్ధిక వ్యవస్థ బలోపేతానికి సూచిక కాబోదని గ్రహించాలి.

దేశం సంక్షేమ రాజ్యంగా ఉన్నప్పటికీ, భారతదేశంలోని ఆర్థిక అసమానతలు మన దైనందిన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. మనం 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న సమయంలో మన దేశంలోనే పేద పౌరులు తక్కువ ప్రయోజనాలతో ద్రవ్యోల్బణం, అధిక పన్నుల రూపంలో పెరిగిన ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. భారత రాజ్యాంగం ప్రభుత్వ పాత్రను సంక్షేమంగా భావించింది. అందుకోసం కోసం, పన్నులు విధించడం, వాటి బదిలీని నిర్వహించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. అయితే, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో, వీటిని ‘ఉచితాలు’గా చిత్రీకరిస్తూ, ప్రభుత్వ పేద ప్రజల పట్ల తమ బాధ్యతలకు తిలోదకాలిచ్చే ప్రయత్నం జరుగుతుంది. మరోవంక, పేద పౌరుల జీవితాలపై తిరోగమన ‘పన్నుల’ భారం పడుతోంది. ద్రవ్యోల్బణం పేద, మధ్యతరగతి పౌరులపై కనిపించని పన్నులుగా పనిచేస్తాయి.

ఉదాహరణకు, రైతులకు పీఎం -కిసాన్ పధకం ద్వారా సాలీనా రూ.6,000 నగదు ప్రయోజనాన్ని అందించే కేంద్ర పథకంను ప్రవేశపెట్టిన సమయంలో, డీజిల్ ధర లీటరుకు రూ. 65. డీజిల్ ధర ఇటీవల రూ.90 మార్కును దాటింది. అందువలన, ఇంధన ద్రవ్యోల్బణం ఈ పథకం నగదు ప్రయోజనాన్ని మింగేస్తుందని స్పష్టం అవుతుంది. అదే విధంగా రహదారులను బ్రహ్మాండంగా నిర్మిస్తున్నామని చెబుతున్నారు. కానీ గతంలో ప్రజలకు ఉచితంగా అందించే ఈ సదుపాయం ఎంత భారంగా మారింది మాత్రం మరచిపోతున్నారు. ఈ భారం పేద ప్రజలపైన ఎక్కువగా పడుతున్నది. ప్రజా వస్తువులు అయినందున ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ప్రైవేటీకరణ, పిపిపి నమూనాల పేరుతో విచ్చలవిడిగా వసూలు చేస్తున్న టోల్ ఫీజులు సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయి.

జమ్మూ నుండి కన్యాకుమారి వరకు కారులో (3,450 కిలోమీటర్లు) ప్రయాణించాలంటే, 59 టోల్ ప్లాజాలను దాటాలి. టోల్ పన్నుల రూపంలో రూ. 5,000 చెల్లించాలి. 2021- 2022 ఆర్థిక సంవత్సరంలో, ప్రభుత్వం టోల్ ట్యాక్స్‌గా రూ. 35,000 కోట్లను వసూలు చేసింది. అదే 2025 నాటికి రూ. 1.34 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరోవంక, రహదారుల కోసం ప్రజల నుండి ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులను చాలా తెలివిగా ఇతరత్రా అవసరాల కోసం మళ్లిస్తున్నారు. అంటే ప్రజల నుండి వసూలు చేసి పన్నులను నిర్దేశిత లక్ష్యాలకు ఖర్చు పెట్టడం లేదు. 2000లో, ప్రభుత్వం సెంట్రల్ రోడ్ ఫండ్ యాక్ట్ (సిఆర్‌ఎఫ్)ని అమలులోకి తెచ్చింది. దీని కింద రోడ్ల నిర్మాణం, నిర్వహణకు నిధులు సమకూర్చేందుకు ఇంధన సెస్ ఉపయోగిస్తారు.

అయితే, 2018లో, దీనిని సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సిఆర్‌ఐఎఫ్)గా సవరించారు. ఈ నిధిని నీరు, పారిశుద్ధ్య పథకాలు, కమ్యూనికేషన్, సామాజిక మౌలిక సదుపాయాలు మొదలైన వాటికి నిధులు సమకూర్చడానికి అనుమతిస్తున్నారు. కానీ 2021 -22 సంవత్సరానికి సిఆర్‌ఐఎఫ్ నిధుల వినియోగం జల్ జీవన్ మిషన్ నుండి స్వచ్ఛ భారత్ పథకం వరకు విస్తరించారు. ప్రధాన మంత్రి మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు త్వరలో జపాన్, జర్మనీలను సహితం పక్కకు నెట్టివేసి భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయితే కావచ్చు. అయితే భారతదేశ ఆర్థిక మూలాధారాలు ఎంత పటిష్టంగా ఉన్నాయి? రిజర్వు బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ సభ్యుడు జయంత్ ఆర్. వర్మ ఇటీవల భారతదేశం ‘ఆర్థిక వృద్ధి ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది’ అని తాను భయపడుతున్నానని పేర్కొనడం గమనార్హం. నాలుగు గ్రోత్ ఇంజన్లు (ఎగుమతులు, ప్రభుత్వ వ్యయం, ప్రైవేట్ పెట్టుబడులు, మొత్తం క్యాపెక్స్, ప్రైవేట్ వినియోగం) అనుమానాస్పదంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ మందగమనం కారణంగా ఎగుమతులు వృద్ధికి ప్రధాన డ్రైవర్ కాలేకపోవడం, ప్రభుత్వ వ్యయం తప్పనిసరిగా ఆర్థిక పరిమితుల ద్వారా పరిమితం చేయాల్సి రావడం, కొంత కాలంగా ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోకపోవడం, భవిష్యత్ వృద్ధి అవకాశాల గురించిన ఆందోళనలు మూలధన పెట్టుబడిని అనుకుంటున్నట్లు కనిపించడం వంటి అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News