సంపాదకీయం: ఈ ఆర్థిక సంవత్సరం (202223) రెండవ త్రైమాసికం (జులై సెప్టెంబర్) లో మన స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదయిందన్న సమాచారం నిరాశ కలిగించడం సహజం. గత ఏడాది (202122) ఇదే సమయంలో వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయింది. అయితే ఈ ఏడాది 2022 జులైసెప్టెంబర్‌లో చైనాలో నమోదైన 3.9 శాతం వృద్ధితో పోల్చుకుంటే మనం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నామని చెప్పి ప్రభుత్వం తరపు ఆర్థిక వ్యాఖ్యాతలు ఆత్మానందం పొందుతున్నారు. 202122 రెండవ త్రైమాసికంలో సాధించిన రూ. 39.89 లక్షల కోట్ల జిడిపితో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో అంతకు మించిన స్థాయిలో రూ. 38.17 లక్షల కోట్ల జిడిపి నమోదు కావడం మెరుగైన పరిణామమే.
కాని ఏయే రంగాల్లో వృద్ధి సాధిస్తున్నాము, ఏయే రంగాల్లో దెబ్బ తింటున్నాము అనే దానిని విశ్లేషించుకున్నప్పుడు మనం అంతగా సంబరపడవలసిన పరిస్థితి వుండదు. రెండవ త్రైమాసికంలో తయారీ (వస్తూత్పత్తి), గనుల రంగాల్లో వృద్ధి రేటు బాగా పడిపోడం నిరుద్యోగాన్ని పెంచుతున్న అంశం. తయారీ రంగం వృద్ధి 4.3 శాతం పడిపోగా, మైనింగ్ రంగంలో వృద్ధి 2.8 శాతం తగ్గిపోయింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకారం రెండవ త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 5.8 శాతం వద్దనే ఆగిపోయింది. ప్రభుత్వ వ్యయంలో వృద్ధి రేటు 4.4 శాతం తగ్గిపోడం ఆందోళనకరమైన అంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యయం పెరిగే కొద్దీ ముఖ్యంగా అభివృద్ధి రంగంలో దాని ఖర్చు ఎగబాకే కొద్దీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రెండవ త్రైమాసికంలో వ్యవసాయ రంగం 4.6 శాతం వృద్ధితో అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించింది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వ్యవసాయ వృద్ధి రేటు 3.2 శాతం మాత్రమే. గత సంవత్సర ద్వితీయ త్రైమాసికంలో తయారీ రంగంలో 5.6 శాతం వృద్ధి నమోదు కాగా, ఈ ఏడాది అదే సమయంలో అది 4.3 శాతానికే పరిమితం కావడం నిరాశ కల్పించింది. అలాగే గత ఏడాదితో పోలిస్తే నిర్మాణ రంగం వృద్ధి కూడా పతనమైంది. గత సంవత్సరం రెండవ త్రైమాసికంలో నిర్మాణ రంగం 8.1 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఈ ఏడాది 6.6 శాతం వద్ద ఆగిపోయింది. చిన్న వ్యాపారాల రంగంలో వృద్ధి తగ్గిపోయి లాభాలు పడిపోడం వల్ల తయారీ రంగం దెబ్బ తిన్నదని భావిస్తున్నారు. దిగుమతులు రెట్టింపు కావడం జిడిపిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపింది. 202122 ప్రథమార్థం (ఏప్రిల్ సెప్టెంబర్)లో జిడిపి వృద్ధి రేటు 13.7 శాతం కాగా, 202223 ప్రథమార్థంలో అది 9.7 శాతంగానే వుండడం మన ఆర్థిక ఎదుగుదలను దెబ్బ తీసిన అంశం.
ఈ ఆర్థిక సంవత్సరం వచ్చే రెండు త్రైమాసికాల్లోనూ వృద్ధి రేటు మందగిస్తుందని రిజర్వు బ్యాంకు జోస్యం చెప్పింది. ప్రైవేటు రంగంలో వినియోగం పెరగడం వల్ల జిడిపి వృద్ధి రేటు అధికమవుతున్నప్పటికీ ప్రభుత్వ వ్యయం తగ్గడం దాని వేగాన్ని పరిమితం చేసిందని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది రెండవ త్రైమాసికంలో మైనింగ్ రంగం వృద్ధి 14.5 శాతంగా వుండగా, ఈ ఏడాది అది 2.8 శాతం తగ్గింది. కరోనాకి ముందున్న వృద్ధిని సాధించే యత్నంలో ఆర్థిక రంగం పైకి, కిందికి జరుగుతున్నది. ఈ క్రమంలో ఒక త్రైమాసికంలో ముందడుగు, మరోసారి మందగమనం నమోదవుతున్నది. చైనాలో జీరో కొవిడ్ విధానం వల్ల తాత్కాలికంగా వృద్ధి రేటు పరిమితమైనప్పటికీ దాని ఆర్థిక వ్యవస్థకు మనకు పోలిక లేదు. 2022 ఏప్రిల్ అక్టోబర్ కాలంలో ఇండియా ద్రవ్యలోటు అంటే రాబడి, ఖర్చు మధ్య వ్యత్యాసం విపరీతంగా పెరిగిపోయి రూ. 7,58,137 కోట్లకు చేరడం గమనించవలసిన విషయం.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం, చైనాలో ఆర్థిక కార్యకలాపాల మందగమనం వంటి పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపినప్పటికీ ఎగుమతులను పెంచుకొని దిగుమతులను వీలైనంతగా పరిమితం చేసుకోడానికి ప్రభుత్వ స్థాయిలో తగిన కృషి జరగడం లేదు. ఈ అంశంపై పరిణత వ్యూహ రచన జరిగి దానిని స్థిర చిత్తంతో అమలు పరచడం మీద దృష్టి పెట్టడానికి బదులు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రజల్లో చీలికలు తెచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలని చూడడం దేశానికి పట్టిన అతి పెద్ద అరిష్టమని చెప్పక తప్పదు. ఒక వైపు రష్యా నుంచి సులభ షరతుల మీద ఆయిల్‌ను పొందుతున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌లో దాని ధర ప్రస్తుతానికి బ్యారల్ దాదాపు 84 డాలర్ల వద్ద పరిమితంగానే వున్నప్పటికీ ఆ సానుకూల పరిణామం ఫలితాన్ని దేశ ప్రజలకు అందించడంలో మన కేంద్ర ప్రభుత్వం విఫలమవుతున్నది. ఇది దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలను శతకం వద్ద కొనసాగిస్తూ ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బ తీస్తున్నది. జిఎస్‌టి ఆదాయాన్ని పెంచుకోడానికి దాని రేట్లను నిర్దాక్షిణ్యంగా పెంచుతూపోడం జీవన వ్యయాన్ని దుర్భరం చేస్తున్నది. ప్రైవేటు రంగాన్ని విచక్షణరహితంగా అనుమతిస్తూ దాని వల్ల ప్రజలకు ఒరుగుతున్నదేమిటో పట్టించుకోకపోడం ఆర్థిక వ్యవస్థను అస్వస్థతలోకి నెట్టివేసే అంశం.