న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారతదేశం జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) 6 శాతంగా ఉండనుందని అమెరికా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పి అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక మాంద్యంతో పోరాటం, లేదా ఈ సంకేతాలను కనిపిస్తున్నాయి. కొన్ని యూరోపియన్ దేశాల్లో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారింది. మరోవైపు అమెరికా షట్‌డౌన్ సంక్షోభం చర్చనీయాంశంగా మారింది. ఆసియాలో చైనా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిస్థితిలో భారతదేశంపై ప్రభావం ఉంటుందని ఎస్ అండ్ పి అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు అంచనాను 6 శాతంగా కొనసాగించింది. గ్లోబల్ ఎకానమీ మందగించడం, సాధారణం కంటే తక్కువ రుతుపవనాలు, వడ్డీ రేట్ల పెండింగ్ ప్రభావం వంటి కారణాలను సూచిస్తూ ఎస్ అండ్ పి తన అంచనాను 6 శాతం వద్ద కొనసాగించింది. అయితే 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ 6.9 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఎస్ అండ్ పి పేర్కొంది.
జూన్ త్రైమాసికంలో భారతదేశ వినియోగ వృద్ధితో పాటు మూలధన వ్యయం కూడా బలంగా ఉందని, ఇది దేశంలో వినియోగం గత స్థాయికి తిరిగి చేరుకుంటోందని, దానిని మించిపోతుందనడానికి సూచన అని ఎస్ అండ్ పి పేర్కొంది. ఇటీవల పెరిగిన కూరగాయల ధరలను తాత్కాలికంగానే ఎస్‌అండ్‌పి పరిగణించింది. అయితే ముడి చమురు ధరలు పెరగడంతో రేటింగ్ ఏజెన్సీ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను గత 5 శాతం నుంచి 5.5 శాతానికి పెంచింది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇటీవల 2023 సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి 6.7 శాతంగా ఉండబోతోందని పేర్కొంది. అంతకుముందు 2023లో భారత ఆర్థిక వృద్ధి రేటు 5.5 శాతంగా ఉంటుందని మూడీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి 6.1 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అంతకుముందు ఐఎంఎఫ్ వృద్ధి రేటు 5.9 శాతంగా అంచనా వేసింది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ 6.3 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని తెలిపింది. అంతకుముందు ఫిచ్ 6 శాతంగా అంచనా వేసింది.