Wednesday, April 30, 2025

భారత్ కు రెండో విజయం

- Advertisement -
- Advertisement -

మహిళల ముక్కోణపు వన్డే టోర్నమెంట్‌లో భారత్ రెండో విజయం నమోదు చేసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో టీమిండియా తన జోరును కొనసాగిస్తూ సౌతాఫ్రికా మహిళల జట్టును ఓడించింది. ఇంతకుముందు ఆతిథ్య శ్రీలంకపై కూడా భారత్ జయకేతనం ఎగుర వేసిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 15 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 261 పరుగులకే ఆలౌటైంది. తజ్మిన్ బ్రిట్స్ శతకం సాధించినా జట్టును గెలిపించలేక పోయింది.

చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన తజ్మిన్ బ్రిట్స్ 107 బంతుల్లో 13 ఫోర్లు, మూడు సిక్సర్లతో 109 పరుగులు చేసింది. బ్రిట్స్ ఇన్నింగ్స్ సౌతాఫ్రికాను గెలిపించలేక పోయింది. లారా వొల్వార్డ్ (43) తప్ప మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో సఫారీ టీమ్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా అద్భుతంగా రాణించింది. 43 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను ప్రతీకా రావల్ ఆదుకుంది. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రావల్ 91 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 78 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగ్స్ (41), స్మృతి మంధాన (36), హర్లిన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News