Monday, December 23, 2024

విశ్వపోటీలో మన బడి రాణించేనా?

- Advertisement -
- Advertisement -

విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు పెట్టుబడులు పెంచాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించిన కొద్ది నెలల్లోనే ప్రపంచ ఉత్తమ పాఠశాల ఎంపిక కోసం లండన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. సంఘ సహకారం, పర్యావరణ పరిరక్షణ, కొత్త ఆవిష్కరణలు, ప్రతికూలతలను అధిగమించటం, ఆరోగ్యకరమైన ఆవిష్కరణలు… ఈ ఐదు విభాగాల్లో ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో మన దేశ పాఠశాలల తీరును సమీక్షించుకునే అవసరం ఏర్పడిందిప్పుడు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్ల గతించినా, విద్యాపరంగా మన దేశం ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి.

సంస్కృతి మాటున అమలవుతున్న నమ్మకాలు, పేదరికం, అవగాహనరాహిత్యం, లింగ, కుల వివక్షత, అరకొర సౌకర్యాలు… విద్యారంగాన్ని నిర్వీర్యపరుస్తున్నాయి. 1966 నుంచి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేపట్టినా సరైన ఫలితాలు అందిరావడం లేదు. పాఠశాలల్లో అరకొర సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధ్యాయుల కొరత తదితర కారణాలు విద్యార్థి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడంలో విఫలమవుతున్నాయి. ఉత్తమ పాఠశాలగా రాణించడంలో చతికిలపడుతున్నాయి. ఫలితంగా డ్రాపౌట్లు పెరిగి సంపూర్ణ అక్షరాస్యత అందనంత దూరంగా జరుగుతున్నది.
విద్యారంభంలో నూతన ఉత్సాహంతో పాఠశాలకు చేరుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. తలుపులు లేని తరగతి గదులు, కంపుకొడుతున్న మరుగుదొడ్లు, నీటి వసతి లేని టాయిలెట్ల, పెచ్చులూడుతున్న భవనాలు, నెర్రలిచ్చిన గోడల మధ్య విద్యాభ్యాసం కొనసాగుతోంది.

శిథిలావస్థకు చేరుకున్న సర్కారు బడును మరమ్మతు చేయకుండానే తరగతులు నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటూ ఉపాధ్యాయులు, విద్యార్థులు గడుపుతున్నారు. వర్షాలు మొదలవుతున్న కాలంలో పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవలి కాలంలో మూడేళ్లకే పిల్లల్ని పాఠశాలల్లో చేరుస్తున్నారు. ప్రీ నర్సరీ, నర్సరీ ఎల్‌కెజి, యుకెజి… అంటే ఒకటో తరగతికి రాక ముందే పిల్లల్ని పట్టణ ప్రాంతాల్లోని పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించేస్తున్నారు.

చిన్నారులు తరగతి గదులకు వెళ్లేందుకు పుస్తకాల సంచులతో కనీసం ఒకటి, రెండు అంతస్తులు ఎక్కాల్సివస్తోంది. మరుగుదొడ్లు, మూత్రశాలల కోసం పదేపదే కిందకు దిగాల్సివస్తోంది. దీంతో మెకాళ్ల నొప్పులకు గురవుతున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 8,980 సర్కారు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ, ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ విషయంలో అసోం తర్వాత తెలంగాణ రాష్ర్ట రెండవ స్థానంలో ఉన్నట్లు ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ వెల్లడించింది. ఇక దేశ వ్యాప్తంగా 78,854 పాఠశాలల్లోనూ బాలికలకు మరుగుదొడ్లు లేవు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం 2021 బడ్జెట్‌లోనే ప్రత్యేక పథకం కింద బడుల రూపురేఖలు మారుస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు మార్పు కనిపించడం లేదు.

‘మన ఊరు మన బడి’ పథకం కింద 26,072 పాఠశాలల్లో రూ.7,289 కోట్లతో సౌకర్యాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని నిర్ణయించింది. దీని కోసం మొదటి విడతలో రాష్ర్ట వ్యాప్తంగా 9,123 ప్రాథమిక, ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసింది. వీటి పనులు నత్తనడకలా సాగుతున్నాయి. పాఠశాల స్థాయిలో విద్యకు బలమైన పునాది వేస్తేనే విద్యార్థి భవిష్యత్తు ఉన్నతంగా మారుతుంది. యునెస్కో నిర్దేశం మేరకు సీనియర్ సెకండరీ విద్యలో ప్రతి 26 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. మన దేశంలో సగటున ప్రతి 47 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే పని చేస్తున్నాడు. 1.10 లక్షల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో పనిచేసే ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు మూతపడాల్సిందే. ప్రస్తుతం పదకొండు లక్షల మందికి పైగా ఉపాధ్యాయుల కొరత ఉంది. 2020 21లో మొత్తం పాఠశాలల సంఖ్య 15.09 లక్షలు ఉండగా, 2021 22 నాటికి ఇది 14.89 లక్షలకు తగ్గింది. ఈ ఏడాది ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాలల్లోకి ప్రవేశాలు దాదాపు 25.57 కోట్ల మేర ఉన్నాయి.

ఎస్‌సి, ఎస్‌టి, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థుల నమోదులో పెరుగుదల ఆశాజనంగా ఉంది. ఉపాధ్యాయుల సంఖ్య 2020 21 ఏడాదిలో 97.87 లక్షలు ఉండగా, 2021 22 నాటికి ఈ సంఖ్య 95.07 లక్షలకు తగ్గింది. ఈ తగ్గుదల ప్రభుత్వ పాఠశాల్లో 0.9 శాతం, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1.45 శాతంగా ఉంది. ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం 27 శాతం పాఠశాలల్లో మాత్రమే ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. బడుల్లో కంప్యూటర్లు, వాటి బోధన పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నా, బోధకులను నియమించకపోవడం, విద్యుత్తు సదుపాయం లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ఐదు శాతం పాఠశాలల్లోనే సమాచార, సాంకేతిక పరిజ్ఞాన ప్రయోగశాలలు ఉన్నాయి.

మన రాష్ర్టం విషయానికొస్తే, ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న పాఠశాలలు 30,023 ఉండగా, 1,40,295 మంది ఉపాధ్యాయులు, 10,689 బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. ఒక్కో పాఠశాలలో సగటున 4.6 మంది ఉపాధ్యాయులు, 0.35 బోధనేతర సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారు. కరోనా నుంచి బయటపడి పరిస్థితులు కుదుట పడటంతో విద్యారంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. విద్యార్థుల నమోదు కూడా పెరిగింది. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. 13.65 శాతం ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 11.23 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి.

కంప్యూటర్ సౌకర్యం ఉన్నవి 8,296 (27.63 శాతం). అంతకంటే తక్కువ శాతం కంప్యూటర్ సౌకర్యం ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 11 ఉన్నాయి. రాష్ర్టంలో కేవలం 2,772 ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంటర్‌నెట్ సౌకర్యం (9.2 శాతం) ఉంది. ఈ విషయంలో మన కంటే వెనుకబడిన రాష్ట్రాలు యుపి, ఒడిశా, మిశోరం, బీహార్‌లు. 27.4 శాతం ఉన్నత పాఠశాలల్లోనే సైన్స్ ల్యాబ్‌లున్నాయి. ఈ అంశంలో మూడు రాష్ట్రాలు మన కంటే వెనుక ఉన్నాయి. హైదరాబాద్ నగరం విషయానికొస్తే ప్రతి లక్షమంది జనాభాకు 20 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. కుమురంభీం అసిఫాబాద్‌లో ఎనిమిది రెట్లు అధికంగా 160 పాఠశాలలుండటం విశేషం.

ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలే కాదు, యూనిఫాం దుస్తులు సైతం అందని ద్రాక్షగా మారింది. 2022 23 విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడిచినా 60 శాతం మించి పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం ‘విద్యాంజలి’, మన రాష్ర్ట ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాల ద్వారా దాతల నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నాయి. వీటి కింద కంప్యూటర్లు, ఇంటర్‌నెట్, విద్యుత్, డిజిటల్, స్మార్ట్ క్లాస్‌రూం తదితర సదుపాయాలు కల్పించాలి. ఈ సౌకర్యాలతో ఏర్పాటుతో సరిపెట్టకుండా, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం, అవసరమైన వనరులు కల్పించడం, ఫలితాలు రాబట్టడంపై దృష్టి సారించాలి. అప్పుడే ఉత్తమ పాఠశాలల పోటీలో మన పాఠశాలలు దీటుగా ఎదుర్కొంటాయి.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News