Monday, December 23, 2024

మరో ఎమెర్జెన్సీకి మచ్చు తునక!

- Advertisement -
- Advertisement -

ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీ (197577) ని పదేపదే తిట్టిపోసే ప్రధాని నరేంద్ర మోడీ తన హయాంలో అంతకు మించిన దురహంకార, దౌర్జన్యాలతో ప్రజల హక్కులను హరిస్తున్నారనే విమర్శ కొట్టి పారేయదగినది ఎంత మాత్రం కాదని తరచూ రుజువవుతున్నది. ఆమెది ప్రకటిత ఎమెర్జెన్సీ అయితే ఇది అప్రకటిత ఎమెర్జెన్సీ అని దేశంలోని ప్రతిపక్షం, మేధావులు వేలెత్తి చూపుతున్నది కఠోర వాస్తవమని స్పష్టపడుతున్నది. చైతన్యవంతమైన భారత ప్రజాస్వామ్యం మీద ఎమెర్జెన్సీ ఒక మచ్చ అని అది ఆ సమయం లో దేశంలో హక్కులను కాలరాసిందని ప్రధాని మోడీ మహానియంత హిట్లర్‌ను కన్న జర్మనీలోని మ్యూనిచ్‌లో గత జూన్‌లో ప్రకటించారు. 47 ఏళ్ళ క్రితం ఇదే రోజున భారత ప్రజాస్వామ్యాన్ని బందీ చేసి దానిని అణచివేసే ప్రయత్నం జరిగిందని, ప్రజాస్వామ్యం భారత దేశానికి గర్వకారణమైన అంశమని ఆ సందర్భంలో మోడీ అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు అందుకు భిన్నంగా ఏమైనా జరుగుతున్నదా, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను, హక్కులను కాపాడే గొప్ప కార్యాన్ని ప్రధాని మోడీ దేశంలో జరిపిస్తున్నారా? ఈ ప్రశ్నకు ఔనని సమాధానం చెప్పగలవారు బిజెపియేతరుల్లో ఎవరైనా వుంటారా, వుంటే వారు ప్రజాస్వామ్య హితులవుతారా? ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలిపీఠం మీద పెట్టి ప్రజల హక్కులను వధిస్తున్నదని చెప్పడానికి గతంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. తాజాగా ఆయన ప్రభుత్వం హక్కుల అణచివేతలో మరో మెట్టు ఎక్కింది. ప్రజలకు వాస్తవ సమాచారం అందకుండా ముఖ్యంగా తనకు వ్యతిరేకంగా వుండే అభిప్రాయాలు, విశ్లేషణలు వార్తలకెక్కకుండా చేసే దుర్మార్గానికి పాల్పడుతున్నది.

సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టింగులను పరిశీలించి వాటిలో దేన్నైనా నకిలీ లేదా అబద్ధపు వార్త (ఫేక్ న్యూస్) గా గుర్తించి దానిని తొలగించవలసిందిగా ఆదేశించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పిఐబి (ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో) కి దఖలు పరుస్తూ ఐటి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమాచార సాంకేతిక విభాగం) నిబంధనలను మార్చడానికి సిద్ధమైంది. ఈ విధంగా ఈ చట్టానికి 2021లో సంకల్పించిన సవరణపై ప్రజాభిప్రాయం తెలియజేయడానికి ఈ నెల 25 వరకు గడువు ఇచ్చింది. అంటే సామాజిక మాధ్యమాల్లోని సమాచారంపై పిఐబికి సెన్సార్ హక్కును కల్పించదలచింది. ఇది ఆనాటి ఎమెర్జెన్సీకి ఏ విధంగా విరుద్ధమైనదో, భిన్నమైనదో ఎవరైనా ఎలా చెప్పగలరు? అప్పుడు కూడా అప్పటి పత్రికల్లో వార్తలపై కత్తెర వేసే ఎదురులేని అధికారాన్ని ప్రభుత్వ సమాచార శాఖలకు కట్టబెట్టారు. దానిని వ్యతిరేకిస్తూ కొన్ని దిన పత్రికలు మొదటి పేజీని, సంపాదకీయ పేజీని చీకటి రంగు పులిమి ప్రచురించిన సంగతి చరిత్రలో వున్నదే. ఇప్పుడు ఘనత వహించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐటి చట్టానికి తీసుకు రాదలచిన సవరణ అటువంటి అంధకార అధ్యాయాన్నే ఉద్దేశిస్తున్నది.

పిఐబి గాని, రాష్ట్ర ప్రభుత్వాల సమాచార శాఖలు గాని తమ ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలకు, అవి అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు విశేష ప్రచారాన్ని కల్పించడానికి ఉద్దేశించినవే. అవి వ్యాప్తి చేసే సమాచారంలో భజనకు తప్ప వేరే దానికి చోటుండదు. అటువంటి పిఐబికి ఏది సిసలైన సమాచారమో, మరేది కల్పిత వార్తో తెలుసుకొనే నీరక్షీర విభజన సామర్థం, నిజాయితీ ఎలా వుంటాయి? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వున్నదనిపించే ఒక్క పదాన్ని కూడా వదిలిపెట్టకుండా దానికి అపకీర్తి తెస్తుందనిపించే ప్రతి ఒక్క సోషల్ మీడియా పోస్టింగ్‌ను ఫేక్ న్యూస్ అని ముద్ర వేసి తొలగింప చేసే నిర్వాకాన్నే పిఐబి ప్రదర్శిస్తుంది. దానితో నాణేనికి రెండో వైపు బొత్తిగా కనిపించని గాఢాంధకారం దేశంలో, సమాజంలో అలముకొంటుంది. ఇంతకంటే ప్రజాస్వామ్య హంతకత్వం వేరే ఏముంటుంది? ఫేక్‌న్యూస్ ప్రజాస్వామ్యానికి చేటు చేసేదే. వాస్తవానికి ఫేక్ న్యూస్‌ను వ్యాపింప చేస్తున్నది ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడని మతతత్వ శక్తులే. ఈ శక్తులు వర్ధిలుతున్నది మతోన్మాదం ఆసరాగా అధికారంలో కొనసాగుతున్న బిజెపిలోను, ఇతర మతతత్వ సంస్థల్లోనే.

పిఐబికి ఇవ్వదలచుకొన్న అధికారాలు సామాజిక మాధ్యమాల్లోని ఫేక్ న్యూస్‌ను పోషించి ప్రజల్లో ప్రజాస్వామిక చైతన్యాన్ని పెంచే నిర్భీతితో కూడుకొన్న సమాచారాన్ని, విశ్లేషణలనే తొలగింపజేస్తాయి. ఐటి చట్టానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలచిన సవరణ మీడియా స్వేచ్ఛను బలిగొంటుందని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. దానిని మానుకోవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఒక వ్యాసాన్ని షేర్ చేశారన్న కారణంగానే హైకోర్టు న్యాయమూర్తి పదవికి కొలీజియం సిఫారసు చేసిన ఒక న్యాయవాది పేరును వెనక్కి తిప్పి పంపిన ప్రధాని మోడీ ప్రభుత్వం ఎటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. అలాగే ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టింగ్‌లు పెట్టిన మరో న్యాయవాదికి కూడా అదే గతి పట్టించిన ఘనత ఆయన ప్రభుత్వానిదే. కోడలిని మందలించి తెడ్డు నాకిన అత్త సామెత అందరికీ తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News